- గాజాకు సాయం పెంచాలి
- ఐరాస సర్వప్రతినిధుల సభ తీర్మానం
- భారీ మెజారిటీతో ఆమోదం
- ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు
న్యూయార్క్ : ఇజ్రాయిల్, హమాస్ మధ్య తక్షణమే మానవతా సంధి కుదరాలని పిలుపునిస్తూ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభ అత్యధిక మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించింది. 22 అరబ్ దేశాల గ్రూపు ఈ తీర్మానాన్ని రూపొందించగా, 120-14 ఓట్ల తేడాతో జనరల్ అసెంబ్లీ దీనిని ఆమోదించింది. భారత్ మరో 44 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజర య్యాయి. ఊహించిన విధంగానే ఇజ్రాయిల్, అమెరికా, దాని మిత్ర పక్షాలు దీనికి వ్యతిరేేకంగా ఓటు వేశాయి. ఓటింగ్‌కు ముందు జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాది మాట్లాడుతూ, తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడమంటే అర్ధం లేని ఈ యుద్ధాన్ని, విచక్షణారహితమైన హత్యాకాండను ఆమోదించడమేనని అన్నారు. ఇజ్రాయిల్ గత మూడు వారాల్లో నాలుగు సార్లు ఐరాస తీర్మానాలను ధిక్కరించింది. జనరల్ అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని కూడా అది బేఖాతరు చేస్తూ, వైమానిక, భూతల దాడులను మరింత ఉధృతం చేసింది. గాజాలో ఇజ్రాయిల్ దాష్టీకాలను ఆపేందుకు చర్యలు తీసుకోవడంలో భద్రతా మండలి విఫలం కావడంతో జనరల్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది.
తక్షణమే, శాశ్వతమైన, సుస్థిరమైన మానవతా సంధి కుదుర్చుకుని ఘర్షణలు విరమించాలని శుక్రవారం ఐరాస ఆమోదించిన తీర్మానం పిలపునిచ్చింది. పాలస్తీనియన్లను బలవంతంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళగొట్టే ప్రయత్నాలను అది నిర్వ్దంద్వంగా తిరస్కరించింది. గాజాకు మానవతా సాయాన్ని మరింతగా పెంచాలని, బందీలుగా వుంచిన పౌరులందరినీ తక్షణమే విడుదల చేయాలని తీర్మానం కోరింది. ఇజ్రాయిల్ పౌరులపై దాడులతో సహా అన్ని రూపాల్లోని తీవ్రవాద చర్యలను, విచక్షణారహిత దాడులను ఖండించింది.
కాల్పుల విరమణ అంటే హమాస్‌కు తిరిగి ఆయుధాలు సమకూర్చుకోవడానికి సమయం ఇవ్వడమేనని ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయిల్ రాయబారి గిలాద్ ఎర్డాన్ వ్యాఖ్యానించారు. అత్యవసర సమావేశంలో కాల్పుల విరమణ జరగాలని కోరుతూ పలువురు వక్తలు మాట్లాడారు.
బాంబు దాడులు ఆపండి
బాంబు దాడులను ఆపి, ప్రాణాలను కాపాడా లని పాలస్తీనా రాయబారి విజ్ఞప్తి చేశారు. జనరల్ అసెంబ్లీ అత్యవసర సమావేశంలో ఆయన భావోద్వే గంతో మాట్లాడారు. 'మృతుల్లో 70శాతం మంది చిన్నారులు, మహిళలే, ఇలాంటి యుద్ధాన్నా మీరు సమర్ధించేది?' అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ యుద్ధ నేరాలు, ఆటవిక చర్యలేనని విమర్శించారు. చనిపోయిన వారు చనిపోగా, మిగిలిన వారిని కాపాడేందుకైనా ఈ యుద్ధాన్ని ఆపాలని ఆయన కోరారు. హమాస్‌ను సమూలంగా నిర్మూలించేవరకు దాడులు ఆపేది లేదని ఇజ్రాయిల్ రాయబారి మరోమారు హూంకరించారు.