Jun 07,2023 18:08

అమరావతి: సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పెన్షన్‌ విధానంపై బిల్లు రూపొందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 'ఏపీ గ్యారెంటీడ్‌ పెన్షన్‌ బిల్లు-2023' పేరుతో కొత్త పెన్షన్‌ విధానం అమలుకు మంత్రివర్గంలో నిర్ణయించారు. 10వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
కేబినెట్‌ ఆమోదించిన నిర్ణయాలు ..

  • అమ్మఒడి పథకం అమలును జూన్‌ 28కి వాయిదా వేస్తూ నిర్ణయం.
  • రాష్ట్రంలోని కొత్త మెడికల్‌ కళాశాలల్లో 706 పోస్టుల భర్తీకి ఆమోదం.
  • ప్రభుత్వ పింఛన్‌ విధానంపై బిల్లు రూపొందించేందుకు ఆమోదం.
  • ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా రూ.5వేల కోట్ల రుణ సేకరణకు అనుమతి.
  • జూన్‌ 12 నుంచి 17 వరకు జగనన్న విద్యా కానుక వారోత్సవాల నిర్వహణకు ఆమోదం.
  • పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 'జగనన్న ఆణిముత్యాలు' అవార్డుల ప్రదానం.
  • ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో 6,840 పోస్టుల భర్తీకి ఆమోదం.
  • వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసేందుకు నిర్ణయం. అందులో పని చేస్తున్న 14,653 మంది సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకం.
  • సీపీఎస్‌ రద్దు చేసి జీపీఎస్‌ తీసుకురావాలని నిర్ణయం.
  • జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 12 నుంచి 16 శాతానికి పెంపు. అదనంగా 2.73 శాతం డీఏ పెంపునకు ఆమోదం.
  • చిత్తూరు డెయిరీ ప్లాంట్‌కు 28 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు అంగీకారం.
  • 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు స్మార్ట్‌ మీటర్ల బిగింపునకు రూ.6,888 కోట్లను వ్యయం చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌ నెట్‌ కోసం రూ.445 కోట్ల రుణాల కోసం ఏపీ ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అనుమతిస్తూ కేబినెట్‌ ఆమోద ముద్ర.
  • టోఫెల్‌ సర్టిఫికేషన్‌ కార్యక్రమం అమలుకు కేబినెట్‌ ఆమోదం. 3 తరగతి నుంచి 10 తరగతి వరకూ విద్యార్థులకు టోఫెల్‌ శిక్షణ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదించింది.