Aug 24,2023 22:03

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నామినేటెడ్‌ పదవుల్లో వున్న అధికార పార్టీ నాయకుల కాలపరిమితి తీరినా ఇప్పుడున్న వారినే ఎన్నికల వరకు కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని నామినేటెడ్‌ పోస్టులు అన్నిటినీ మరొకరికి అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో సగటున ఏడాది నుండి మూడేళ్ల వరకు కాలపరిమితి వుంటుందని చెప్పి వైసిపి నాయకులకు కట్టబెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్‌ పోస్టుల్లో వ్యవసాయ మార్కెట్‌ యార్డులు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్‌లతో పాటు బిసి కార్పొరేషన్‌లకు ఛైర్మన్‌ పదవులు, డైరెక్టర్‌ పదవులను వారి స్థాయిని బట్టి కట్టబెట్టారు. రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, 137 ప్రభుత్వ కార్పొరేషన్‌లకు ఛైర్మన్‌ పదవులతోపాటు 484 డైరెక్టర్‌ పదవులు వున్నాయి. అలాగే 56 బిసి కార్పొరేషన్లు, మూడు ఎస్‌సి కార్పొరేషన్లు, ఒక ఎస్‌టి కార్పొరేషన్‌కు కలిపి 684 మంది డైరెక్టర్లు వున్నారు. ఇప్పటికే బిసి కార్పొరేషన్ల ఛైర్మన్‌లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు వుండగా, పదవుల విషయంలో గందరగోళం, అసంతృప్తులు బహిర్గతం కాకూడదని అన్ని నామినేటెడ్‌ పదవులనూ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ అంశంలో త్వరలో ఆయా విభాగాల వారీ ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.