'గుహలో ముడుచుకొని పడుకున్న సింహమా... ఒక్కసారి బయటికొచ్చి, జూలు విదిల్చి, గాండ్రించు... అడివి అంతా నీకు దాసోహమవుతుంది' అంటాడు షెల్లీ. వర్చువల్ ప్రపంచంలో ముడుచుకుపోయిన మధ్య తరగతి మేధావులు... వాస్తవిక ప్రపంచంలో సమాజానికి దూరంగా బతికేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రైతాంగ వ్యవసాయ వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని ఉద్యమం చేస్తుంటే... వారికి చేయూతనివ్వడానికి, సాయంగా నిలవడానికి తటపటాయిస్తున్నారు. తాము ఆర్థిక సహాయం చేసిన సంగతి తెలిసి, బిజెపి ప్రభుత్వం వేధింపులను చేపడుతుందేమోనన్న సందేహం వారి భయాన్ని సూచిస్తోంది. ఇటువంటి మధ్యతరగతి భయాలే హిందూత్వ ఫాసిస్టు శక్తులకు బలంగా పరిణమిస్తోందని మన మేధావులు గమనించాలి.
రైతుల ఆందోళనలకు కెనడా ప్రధాని, బ్రిటన్ ఎంపీలు స్పందించారు. 'శాంతియుత నిరసనలు ప్రజల హక్కు అని, అందుకు అనుమతినివ్వాలని' ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి సైతం స్పందించారు. రైతు కుటుంబాలతో సంబంధం వున్న ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ఈ దేశంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లోని చాలామంది కార్మికుల్లో ఎక్కువ భాగం రైతు కుటుంబాల నుండి వచ్చినవారే. వారంతా ఇప్పుడు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు. బిజెపిని మోస్తున్న ఒక వర్గం మీడియా ఈ ఉద్యమం పట్ల సానుకూలత వ్యక్తం చేయట్లేదు. వాస్తవానికి మనం తినే ప్రతి మెతుకు ఆ రైతు కష్టార్జితం. అలాంటి రైతు... ఢిల్లీ నడిరోడ్లపై వణికించే చలిలో, పోలీసుల నిర్భంధాలు, వాటర్ కేనన్ల జడిలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దేశ రాజధానిలో రైతుకు జరుగుతున్న పరాభవానికి ఎలాంటివారిలోనైనా ఆగ్రహం కలగాలి. దానికి భిన్నంగా నియంతృత్వానికి తలవంచి, నేనిలా భయపడుతూనే వుంటాను... ప్రజాస్వామ్యం మాత్రం వర్థిల్లు అంటే... ఎలా సాధ్యపడుతుంది. ఎంతటి చల్లని నీరైనా అందులో దిగేవరకే చలి, ఆ తర్వాత చలి అనిపించకపోగా, వెచ్చగా వుంటుంది. 'భయం గియం విడు... ముందుకే నడు' అని శ్రీశ్రీ అంటాడు. అడుగు ముందుకు వేసే వరకే భయం... ఒక్కసారి గొంతు విప్పి చూడు... ప్రపంచం నీకు తోడుగా నిలుస్తుంది.
ఈ దేశంలో 60 శాతానికి పైగా వున్న రైతులు... ఆత్మహత్యలు పరిష్కారం కాదని, పోరాటమే శరణ్యమని నమ్మి... పోరాటంలోకి దిగారు. అది ధైర్యం తెచ్చిన ఆత్మవిశ్వాసం. 'మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి' అంటాడో కవి. ఒంటరిగా మొదటి అడుగు వేయడానికి భయపడితే... వేలాదిమంది పోరాటంలో వున్న ఈ సమయంలో కూడా జంకుతున్నామంటే... అది పిరికితనం అనిపించుకుంటుంది. నీలోని మంచి గుణాలను పిరికితనం చంపేస్తుంది. ఆ భయమే ఫాసిస్టు శక్తులకు ధైర్యాన్నిస్తుంది. మేధావి మౌనం సమాజానికి హాని చేస్తుందన్నట్టుగా... నీ మౌనమే వారిని గద్దెనెక్కిస్తుంది. ఓ మేధావీ... నువ్వు గళం విప్పితే, పిడికిలి బిగిస్తే... ఈ ఫాసిజం తోక ముడుస్తుంది. దానికంత ధైర్యం లేదు, శక్తీ లేదు. అది మట్టి కాళ్ల మహమ్మారి. అందుకేె ఎక్కడ ఏ నిరసన గళం వినిపించినా అది ఉలిక్కిపడుతుంది. అందరిపైనా నిఘా పెడుతుంది. తననెవరు కూలదోస్తాడోనని నిత్యం భయపడుతుంది. దానికి అభద్రతా భావం ఎక్కువ. విమర్శలను తట్టుకోలేదు. మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని జీర్ణించుకోలేదు. ఇంతగా భయపడుతున్న ఫాసిజాన్ని చూసి మధ్యతరగతి మేధావులు భయపడటంలో ఔచిత్యం లేదు.
ఫాసిస్టు శక్తి శత్రువని అర్ధమైన తర్వాత కూడా మౌనంగా వుంటే, చరిత్ర క్షమించదు. జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముందు పీఠిన నిలిచి పోరాడిన వారే చరిత్రలో నిలిచారు. వారినే ప్రజలు ఆరాధించారు. నేటికీ ఆరాధిస్తూనే వున్నారు. ఆ రోజు పోరాటంలో పాల్గొనకుండా బిరుదుల కోసం రాజీ పడిన వారంతా కాలగర్భంలో కలిసిపోయారు. వీరుడిగా నిలిచిపోతావో, భీరువుగా మిగిలిపోతావో తేల్చుకోవాల్సింది నువ్వే. సాయం చేయాలన్న ఉదారతకు అడ్డొస్తున్న నీ పిరికితనాన్ని ఒదిలించుకో. ఒక్కసారి గొంతు విప్పి చూడు... అది నీ జగత్తును మార్చుతుంది. సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే... భయం వదులు... కదులు ముందుకు...










