
ఆంధ్ర రాష్ట్ర మహిళా ఉద్యమం వజ్రోత్సవ మహాసభకు సన్నాహాలు చేస్తున్నది. సెప్టెంబర్ 24, 25, 26 తేదీలలో నెల్లూరులో 15వ రాష్ట్ర మహిళా మహాసభ జరగనుంది.
మన రాష్ట్రంలో మహిళా ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1936లో కృష్ణా జిల్లాలో ఆరంభం అయినా రాష్ట్రవ్యాప్త ఉద్యమ స్వరూపం తీసుకోవడానికి 9 సంవత్సరాలు పట్టింది. 1947 ఫిబ్రవరి 15, 16 తేదీల్లో గుంటూరు జిల్లా చిలువూరులో ప్రథమ ఆంధ్ర రాష్ట్ర మహిళా మహాసభ జరిగింది. అప్పట్లో ఉద్యమం బలంగా ఉన్న కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో ప్రతినిధులు వచ్చినప్పటికీ ఉత్తరాన ఉన్న విశాఖపట్నం, దక్షిణాదిన ఉన్న రాయలసీమ జిల్లాలతో సహా మొత్తం 450 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ఇటీవల వామపక్ష మిత్రులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రథమ ఆంధ్ర రాష్ట్ర మహిళా మహాసభ నిబంధనావళి, తీర్మానాలు, హక్కుల ప్రకటన, జమా ఖర్చులతో కూడిన నివేదికను పాఠకులకు అందించారు. రాష్ట్ర మహిళా ఉద్యమానికి పెన్నిధిని ఇచ్చారు. మహాసభ నివేదికలో ఉన్న అనేక అంశాలు చదివేకొద్దీ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాం.
ఆనాటి మహిళా ఉద్యమంపై మహనీయులు కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వంటి సంఘసంస్కర్తల ప్రభావం, వాటితోపాటు పూర్వ సోవియట్ యూనియన్ తో సహా సోషలిస్టు దేశాల్లో స్త్రీలు సాధించిన విజయాలు, అక్కడి ప్రభుత్వాలు స్త్రీలకు కల్పించిన అవకా శాలు, ఉధృతంగా సాగుతున్న దేశ స్వాతంత్య్రోద్యమం...వీటన్నిటి ప్రభావం కనిపిస్తుంది. భారతదేశ స్త్రీల హక్కులు, విధుల ప్రణాళిక ఇప్పటికీ మహిళా ఉద్యమానికి ఒక దారి చూపుతుంది. ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేస్తుంది. స్త్రీ పురుష సమానత్వం లేకుండా సమాజం అభివృద్ధి అసాధ్యం అని ప్రకటిస్తుంది.
మహాసభ సందర్భంగా భారతదేశ స్త్రీల హక్కుల విధుల ప్రణాళికను విడుదల చేశారు. ఆ ప్రణాళికలో అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. 'స్త్రీని కూడా పురుషునితో పాటు సమాన స్థాయికి తీసుకురావడం అవసరమని...అప్పుడే దేశ, ప్రపంచ పునర్నిర్మాణంలో స్త్రీ తన పాత్రను నిర్వర్తించగలదని నమ్ముతున్నాము.' అని ఆ ప్రణాళికలో ప్రకటించారు.
ప్రజల ప్రాథమిక హక్కులు, విద్యా విధానం, ఆరోగ్యం, పని హక్కు, ఆస్తి హక్కులు, వివాహం, విడాకుల హక్కులు, గృహంలో స్త్రీ స్థానం వగైరా అంశాలు ఈ ప్రకటనలో ప్రస్తావించారు.
విద్యా వైద్య సౌకర్యాలు, ప్రాథమిక హక్కులు, పని హక్కుతో పాటు ప్రత్యేకించి ఇక్కడ ప్రస్తావించిన అంశం గృహ నిర్వహణ, కుటుంబంలో స్త్రీ స్థానం. 'రాత్రనకా పగలనకా సెలవు దినాలు లేక ఎప్పుడూ కష్టపడి పని చేసే గృహిణిని ఎవరు గుర్తించుటలేదు. ఆమెకు సౌకర్యాలు కలగజేయుటకు ఏ విధమైన చర్యలు తీసుకొనలేదు సరి కదా, వాటిని గూర్చి ఎవరికీ ఆలోచన లేదు. గృహిణి చేసే పని కూడా అన్నిటి మాదిరే చాలా ముఖ్యమైనదని మేము విశ్వసిస్తున్నాము. కనుక ఈ కింది కోరికలను కోరుతున్నాము.
భార్య ఇష్టం లేకుండా భర్త తన ఆస్తినంతటను అమ్మి వేయడానికి ఎట్టి అధికారం ఉండకూడదు. ఇంటిని చక్కబెట్టే స్త్రీకి ఆమె భర్త సంపాదనలో కొంత భాగాన్ని తన ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టుకునే అధికారం ఉండవలెను. బయట ఫ్యాక్టరీలలో, ఉపాధ్యాయులుగాను పని చేసే స్త్రీలకు ఉన్నట్లే ఇళ్ల దగ్గర ఉండే స్త్రీలకు కూడా సోషల్ సెక్యూరిటీ కల్పించవలెను. భార్యకు ప్రత్యేక సంపాదన లేని యెడల భర్త ఈ ఫండుకు చందా వేయవలెను. ప్రభుత్వం గానీ స్థానిక సంస్థలు గాని పిల్లల కోసం కిండర్ గార్డెన్లు ఏర్పాటు చేయాలి. పురుషునితోపాటు స్త్రీని కూడా పిల్లలకు గార్డియన్‌గా గుర్తించాలి. ఈ హక్కును తోసిపుచ్చుటకు పురుషునికి అధికారం ఉండకూడదు' వంటి అనేక అంశాలు ఈ హక్కుల ప్రకటనలో ప్రకటించారు.
దురదృష్టం ఏమంటే 75 సంవత్సరాల తర్వాత కూడా పై డిమాండ్లనే మనం పునరుద్ఘాటిస్తున్నాము. కొడుకుల మధ్య కూతుళ్ల మధ్య వారసత్వంలో ఏ విధమైన భేదం ఉండకూడదు, తల్లిదండ్రుల ఆస్తికి వారిద్దరూ సమాన భాగస్వాములే అని నాడు వక్కాణించారు. నైతిక విషయాల్లో కూడా స్త్రీ పురుషులకు ఒకే నీతి నియమం ఉండాలని చెప్పారు. ఇకపోతే పని హక్కు. స్త్రీ పురుషులు ఇద్దరికీ పని హక్కు ఉండాలని, ఉద్యోగాల్లో ఉపాధిలో సమాన అవకాశాలు ఉండాలని చెబుతూనే పిల్లలకు ప్రత్యేక వసతి గృహాలు, గర్భిణీలకు, బాలింతలకు ప్రత్యేక విశ్రాంతి గదులు, పిల్లలకు తల్లులకు పాలు సప్లై చేయడానికి క్యాంటీన్లు వంటి అంశాలు కూడా నొక్కి చెప్పారు.
ఈ నివేదికలో మహాసభ జమా ఖర్చులు కూడా ప్రచురించారు. జమాఖర్చుల నిర్వహణ చూస్తే ఆ రోజుల్లో పెద్దగా చదువు సంధ్యలు లేని మహిళా నాయకులు ఎంత పకడ్బందీగా జమాఖర్చులు నిర్వహించారని ఆశ్చర్యం వేస్తుంది.
మహాసభ నిర్వహణ కోసం మొత్తం నిధి 4192 రూపాయల నాలుగు అణాల మూడు పైసలు వసూలైతే, ఖర్చు 2490 రూపాయల ఆరు అణాలు అయ్యింది. మిగిలిన నిల్వ 1701 రూపాయల 14 అణాల మూడు పైసలు ఉన్నదని ప్రకటించారు.
మహాసభ సందర్భంగా శిశు ప్రదర్శన, బుర్రకథ వంటి సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉన్నాయి. అప్పట్లో 25 వేల సభ్యత్వం ఉండేదట. మొత్తం మీద ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లాలతో పాటు కర్ణాటకలో ఉన్న బళ్లారి కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే కలిసి ఉండేది. కాబట్టి ఈ 14 జిల్లాలలో మహిళా ఉద్యమ విస్తరణకు సారథ్యం వహించే నాయకత్వాన్ని మహాసభ ఎన్నుకొన్నది.
డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ అధ్యక్షురాలుగా, విజయనగరానికి చెందిన డాక్టర్ లక్ష్మి ఉపాధ్యక్షురాలుగా, మానికొండ సూర్యావతి కార్యదర్శిగా చండ్ర సావిత్రీ దేవి, మోటూరు ఉదయం సహాయ కార్యదర్శులుగా వెల్లంకి అన్నపూర్ణాదేవి, తాపీ రాజమ్మ, కొమర్రాజు పద్మావతి, నాగళ్ళ రాజేశ్వరమ్మ, ఎ.పద్మావతమ్మ, పరచూరి సూర్యాంబ, అన్నె అనసూయ, గోకరాజు వెంకాయమ్మ, పందిరి జగదాంబ, ఇనుగంటి రామతులసమ్మ, దిగుమర్తి సువర్ణాబాయి, మోటూరు శేషారత్నం, టి.సావిత్రి గార్లను కమిటీ సభ్యులుగా కార్యనిర్వాహక వర్గాన్ని మహాసభ ఎన్నుకొన్నది. ఇంతటి సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన మహిళా ఉద్యమ వారసత్వాన్ని నిలబెట్టడం ఇప్పటి తరం బాధ్యత, అవసరం కూడా.
వ్యాసకర్త : పుణ్యవతి, 'ఐద్వా' జాతీయ కోశాధికారి