జాతీయోద్యమం కన్నా ముందు దేశంలో పలు ప్రాంతాలలో సాంఘిక సంస్కరణోద్యమాలు బయలుదేరాయి. అందరికీ విద్య అందించాలని, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించాలని, దురాచారాలను నిర్మూలించాలని సాగిన ఈ ఉద్యమాలు ఉత్తరాంధ్ర లోనూ గట్టి ప్రభావాన్ని చూపించాయి. ఆ ప్రభావం కొందరు సంస్థానాధీశుల పైనా పడింది. దీనికి జాతీయోద్యమ ప్రభావం తోడైంది. ఈ నేపథ్యంలోనే...ఏళ్ల చరిత్ర కలిగిన మహారాజ విద్యా సంస్థలు స్వాతంత్య్రానికి పూర్వం దాదాపు 150 ఏళ్ల క్రితం విజయనగరం సంస్థానాధీశుల ఆధ్వర్యంలో నెలకొల్పబడ్డాయి. సేవా దృక్పథంతో ఏర్పడిన విద్యా సంస్థలు మొదట పాఠశాల విద్యతో ప్రారంభమై క్రమంగా ఇంటర్, డిగ్రీ, మహిళా డిగ్రీ, ఇంజనీరింగ్, లా... తో పాటు బి.ఇడి, బిఫామ్‌సీ, బి.బి.ఎ, ఎం.కామ్ వంటి ఉన్నత విద్యా కోర్సులు నెలకొల్పబడ్డాయి. స్వాతంత్య్రం రాకపూర్వం పేద విద్యార్థులకు, ఉన్నత విద్య నోచుకోని విద్యార్థులకు చదువు అందించడమే లక్ష్యంగా ఎటువంటి ఖర్చు లేకుండా ఉచిత వసతి, ఉచిత విద్య అందించడంతో ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ భారత దేశంలోనే మహారాజ విద్యా సంస్థలు పేరుగాంచాయి. స్వాతంత్య్రం వచ్చాక జిల్లా విద్యా రంగంలో ఈ విద్యా సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల విద్యార్థులు చదువుకోవడానికి వేదికగా మారాయి. మహారాజా కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లలో వేలాదిమంది దూర ప్రాంతాల విద్యార్థులు వచ్చి తక్కువ ఖర్చుతో వసతి పొంది ఉన్నత విద్యను అభ్యసించి దేశ పురోగతికి తోడ్పడ్డారు. అలా సేవా దృక్పథంతో కూడిన విద్యా విధానం పేరుతో స్థాపించిన మాన్సాస్ విద్యా సంస్థలు క్రమక్రమంగా ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం అవుతూ వచ్చాయి. ఇప్పుడు చివరగా మిగిలిన మహారాజ కళాశాలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రస్తుత యాజమాన్యం పావులు కదుపుతున్నది. సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన విద్యాసంస్థల లక్ష్యం పక్కకి పోయి విద్యా వ్యాపారమే లక్ష్యం అయిపోయింది. ఆరోజు తాతలు, తండ్రులు ఆదర్శవంతంగా విద్యాసంస్థలు నెలకొల్పి వాటిని నడిపితే...ఈ రోజు వారసులు విద్యా వ్యాపారమే లక్ష్యంగా పని చేయటం ఏమి అర్ధాన్ని ఇస్తుందో వారసులే తేల్చాలి!
ప్రైవేటు దిశగా మహారాజ కళాశాల
క్రీస్తు పూర్వం 1879 లో డా|| పి.వి.జి రాజు గారి ఆధ్వర్యంలో మహారాజ(ఎ) కళాశాల స్థాపించబడినది. స్వాతంత్య్రానికి పూర్వం మాన్సాస్ ట్రస్టుకు వచ్చే ఆదాయంతో ఈ కళాశాల నడిచేది. క్రమంగా స్వాతంత్య్రం వచ్చాక మాన్సాస్ ట్రస్టు సహకారంతో పాటు ప్రభుత్వం, విద్యార్థుల (ఫీజులు రూపంలో) సహకారంతో కళాశాల నడిచింది. తక్కువ ఖర్చుతో మంచి విద్యను అభ్యసించే అవకాశం కలిగేది. పైగా విద్యార్థులు ఇచ్చే తక్కువ ఫీజులతో కళాశాల అభివృద్ధి జరిగేది. ఆ విధంగానే ల్యాబ్ సౌకర్యాలు మెరుగుపర్చగలిగారు. 2004లో చంద్రబాబు నాయుడు జీ.వో.నెం.39 తీసుకువచ్చి ప్రభుత్వం అందించే ఎయిడ్‌కు భారీ కోత పెట్టారు. ఎయిడెడ్ వ్యవస్థకు ఆ జీఓ శాపంగా మారింది. దీంతో విద్యార్థులపై ఫీజుల భారం పెరిగింది. క్రమంగా ఫీజులు పెంచుకుంది. 2004లో రూ.200, రూ.300 ఉండే ఫీజు 2014లో రూ.8000కు పెరిగింది. 2015లో పి. అశోక్ గజపతిరాజు గారు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అయిన తరువాత కళాశాల ప్రైవేటీకరణకు అప్పటి మాన్సాస్ ట్రస్ట్ కరస్పాండెంట్ డి.ఆర్.కె రాజు పావులు కదిపారు. అప్పటివరకూ ఏనష్టం లేని కాలేజి నిర్వాహణ అప్పటి నుంచీ నష్టం వచ్చినట్టు లెక్కలు చూపించారు. తరువాత కళాశాల ప్రైవేటీకరణకు పునాది వేశారు. తొలుత డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో వచ్చారు. విద్యార్థుల నిరసనతో ఎస్.ఎఫ్.ఐ నాయకత్వంలో జరిగిన పోరాటాలకు వెనక్కు తగ్గారు. కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్టళ్లను మూసివేయడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు. ఈ హాస్టల్‌కు ఘనమైన చరిత్ర ఉంది. 2004లో 2 వేల మంది వున్న ఈ హాస్టల్‌లో ఫీజులు పెంచి సీట్లు కుదించి 2017లో 700 మందికి తగ్గించేశారు. అప్పటికీ ఆగకుండా స్టూడెంట్ మెనేజ్‌మెంట్ హాస్టల్‌గా (ఎస్.ఎం.హెచ్) ఉన్న హాస్టల్‌ని కాంట్రాక్టుకు ఇచ్చి 2017లో రూ.8000 ఉన్న హాస్టల్ ఫీజు రూ.25,000 లకు పెంచారు. దీనితో ఇక్కడి విద్యార్థుల సంఖ్య 500 లకు పడిపో యింది. హాస్టల్‌ను ఇప్పడు పూర్తిగా ప్రైవేటుపరం చేశారు. అంత టితో ఆగకుండా ప్రస్తుత మాన్సాస్ ఛైర్మన్ సంచయిత గజపతిరాజు ఏకంగా కాలేజీని ప్రైవేటీకరించేందుకు ఒక ఫైల్‌ను సిద్ధం చేసి ఉన్నత విద్యామండలి అనుమతి కోసం ధరఖాస్తు పంపారు.
ప్రయివేట్‌పరం ఎందుకు చేస్తున్నారు?
కాలేజీ నిర్వహణ ఇబ్బందిగా ఉందని, నష్టాల్లో వుందని, అధ్యాపకుల జీతాలు భారంగా ఉన్నాయని యాజమాన్యం కారణాలు చెప్తోంది. కానీ వేల ఎకరాలు కలిగిన మాన్సాస్ ట్రస్టు ఆధ్యర్యంలో నడిచే ఈ కళాశాలకు నష్టం ఎలా ఉంటుంది? నిజంగా నష్టం వచ్చినా సేవ చేయడం కోసమే పెట్టిన ఈ కళాశాల నష్టాన్ని కోట్ల రూపాయలు సంపాదనగల మాన్సాస్ యాజమాన్యం భరించలేదా? విజయనగరం జిల్లా లోని వేల ఎకరాల మాన్సాస్ భూములను రైతులు సాగు చేసి ప్రతి సంవత్సరం కౌలు కడుతున్నారు. ఆ డబ్బంతా ఏమైపోతుంది? మాన్సాస్ పరిధిలో ఉన్న ఎం.వి.జి.ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, ఇతర ప్రైవేట్ విద్యా సంస్ధలు ప్రతీ ఏడాది కొన్ని కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నాయి. ఆ డబ్బంతా మాన్సాస్ పరిధి లోకి వస్తుంది. ఆ డబ్బు ఏమౌతుంది? అది కూడా కాలేజీ నిర్వహణకు ఖర్చు చేయవలిసినదే కదా. లాభాపేక్ష లేకుండా నడపడం ఈ కాలేజీని స్థాపించినప్పుడు వున్న లక్ష్యం. కనుక కాలేజీని నిర్వహించడం యాజమాన్యం బాధ్యత. ఆ రోజు దాని కోసమే ఈ విద్యా సంస్ధలు నెలకొల్పామని చెప్పారు. ఇప్పటి వారసుల నడవడిక చూస్తుంటే ఆరోజు ఈ ట్రస్టు ఏర్పాటు చేసింది అప్పటి రాజుల ఆస్తులు కాపాడుకోవడానికా అనిపిస్తుంది. అంతేకాక ఇప్పుడు ఈ మహారాజ (ఎ) కాలేజీ ఉన్న స్థలం, భవనాలు దాదాపు రూ.350 కోట్ల రేటు పలుకుతుందని ఒక అంచనా. అందుకే దీనిని మెల్లగా ప్రైవేటుపరం చేసి ఇన్నాళ్లూ ప్రజల కోసం ఉపయోగించిన ఆస్తులను ఇప్పుడు స్వంతానికి దాచేయాలని చూస్తున్నారు. కానీ ఆ కళాశాలలో కొత్తగా వచ్చిన భవంతులు, ల్యాబ్ ఇతర ఫర్నీచర్ మొత్తం విద్యార్థుల నుండి వసూలు చేసిన ఫీజుల నుంచిగాని ప్రభుత్వం ఇచ్చిన ఎయిడ్‌తోగాని ఏర్పరచుకున్నదే.
ప్రభుత్వ వైఖరి ఏమిటి?
ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తామని నేటి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నెలకొల్పుతా మంటోంది. ఉన్నత విద్య అభివృద్ధే లక్ష్యం అంటోంది. మరి 4000 మంది విద్యార్థులకు తక్కువ ఖర్చుతో విద్యను అందించే ఒక పెద్ద విద్యా సంస్థ ప్రైవేటువారి చేతుల్లోకి పోతుంటే మాత్రం జోక్యం చేసుకోవడంలేదు. మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఈ కళాశాల విద్యార్థులే. వీరి కనుసన్నల్లోనే ఈ కార్యక్రమమంతా జరుగుతుందని జిల్లా ప్రజలు భావిస్తుంటారు. వెంటనే ఈ కళాశాలను స్వాధీనం చేసుకొని ప్రైవేటీకరణను ఆపాలి.
మన బాధ్యత
మహారాజ కళాశాలకు దక్షిణ భారత దేశంలోనే సుదీర్ఘ చరిత్ర వుంది. దేశానికి ఎందరో ప్రముఖులను అందించిన కళాశాల. వేలాది మంది పేద బతుకులలో దీపం పెట్టిన కళాశాల. విద్యార్థులు, ప్రభుత్వం, మాన్సాస్ సంయుక్తంగా అభివృద్ధి చేసుకున్న కళాశాల. 4000 మంది విద్యార్థులు, 200 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భవిష్యత్‌కు సంబంధించిన సమస్య ఇది. ఈ జిల్లా చారిత్రక వారస త్వానికి సంబంధించిన సమస్య ఇది. ఇంతటి ఘన చరిత్రగల ఈ కళాశాల ప్రైవేటుపరం కాకుండా ఈప్రాంత విద్యార్థులు, యువత, మేధావులతో పాటు మహారాజ కళాశాల అధ్యాపకులు, పూర్వవిద్యార్థులు, భవిష్యత్‌తరం ఏకమై పోరాడాల్సిన సమయమిది.
- పి. రామ్మోహన్‌రావు
(వ్యాసకర్త ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి,
విజయనగరం. సెల్ : 7075712379)










