Jul 29,2023 14:47

నైఫిడా :   మయన్మార్‌ పౌర నేత అంగ్‌సాన్‌ సూకీ (78)ని జైలు నుండి ప్రత్యేక ప్రభుత్వ భవనానికి తరలించినట్లు ఆమె పార్టీ అధికారి శుక్రవారం ప్రకటించారు. సోమవారం రాత్రి ఆమెను అత్యున్నత స్థాయి భద్రతతో కూడిన భవనానికి తరలించినట్లు నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డి)కి చెందిన ఓ అధికారి మీడియాకి వెల్లడించారు. నిర్బంధంలో ఉన్నప్పటి నుండి సూకీ ఆరోగ్యంపై పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సూకీని ఆ దేశ దిగువ సభ స్పీకర్‌ టి ఖున్‌ మయాత్‌ను కలిసినట్లు ఆ అధికారి తెలిపారు. అలాగే మయన్మార్‌లో పర్యటిస్తున్న ఆసియా వ్యవహారాల చైనా ప్రత్యేక అధికారి డెంగ్‌ జిజువాన్‌ కూడా సూకీని కలవనున్నట్లు వివరించారు. సూకీని నైఫిడాలోని విఐపి భవననానికి తరలించినట్లు మరో రాజకీయ పార్టీ కూడా స్పష్టం చేసింది. దీంతో ఆమె ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అంగ్‌సాన్‌సూకీ ప్రభుత్వంపై 2021లో జుంటా సైన్యం తిరుగుబాటు ప్రకటించడంతో పాటు ఆమెను అక్రమంగా జైలులో నిర్బంధించిన సంగతి తెలిసిందే. అవినీతి, అక్రమ వాకీ టాకీలను కలిగి ఉండటం, కరోనావైరస్‌ ఆంక్షలను ఉల్లంఘించారన్న అక్రమ కేసులతో జుంటా కోర్టు 33 జైలు శిక్ష విధించింది. ఏడాదిన్నర పాటు నైఫిడాలో గృహనిర్బంధంలో ఉన్న సూకీని 2022 జూన్‌లో రాజధానిలోని మరో ప్రాంతంలోని జైలుకి తరలించారు. 2021 జైలులో నిర్బంధించిన అనంతరం ఆమె ఒకేఒక్కసారి మాత్రమే బయటి ప్రపంచానికి కనిపించారు.