ఉసూరుమనిపిస్తున్నది జీవితం .....
కాలు కదపనియ్యని
అదుపులేని వర్షం !
ఇంటిని అంటిపెట్టుకుని,
జైలు జీవితంలా
బయటిగాలి అంటని వృథా బ్రతుకు...!
ముసురుతో మనసంతా
మంచులా గడ్డకట్టింది
ఆలోచనల బ్రహ్మముడి వీడక
మెదడు మొద్దుబారింది !
నా ప్రమేయం లేకుండానే
చలి తన కౌగిట్లోకి నన్ను బందీ చేస్తున్నది ..
ఏ.. వెచ్చదనమూ
దీన్ని గెలవలేకపోతున్నది!
నేనైతే ఫర్వాలేదుగానీ..
ఏరోజుకారోజు కూలిపనితో,
పొట్ట నింపుకునే
కష్టజీవి సంగతేమిటి?
ముసురు.. మనిషిని
హుషారెత్తించాలిగానీ
ఉసూరుమనిపించకూడదు!
ఆకలి తీర్చాలి గానీ,
అనారోగ్యం పాలు చెయ్యకూడదు!
నిత్యజీవిత సరళిని
అస్తవ్యస్తం చెయ్యకూడదు...
ఋతుపవనాలు
ఋజుమార్గంలోనే పయనించాలి !!
డా.కె.ఎల్.వి.ప్రసాద్
98662 52002