- 23వ తేదీ లోపు పరిష్కారం కాని పక్షాన రెండు రోజుల మెరుపు సమ్మె
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ కార్పొరేషన్ పర్మనెంట్ కార్మికుల సమస్యలు ఈనెల 23వ తేదీలోగా పరిష్కరించకుంటే రెండు రోజులు మెరుపు సమ్మె చేపడతామని ప్రజలకు అసౌకర్యం కలిగితే అధికారులు పాలకవర్గమే బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఐటియు నేతలు హెచ్చరించారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ స్పందనలో ఇప్పటికి ప్రతివారం 50 సార్లు కార్మిక సమస్యలపై వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు. అయితే కార్మిక సమస్యల పరిష్కారం దిశగా అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ చేపట్టిన చర్యలు శూన్యమన్నారు. కొన్ని సంవత్సరాలుగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న రెగ్యులర్ కార్మికులు, అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్యం మరియు ఇంజనీరింగ్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని వినతి పత్రాలు అందజేస్తూ దశలు వారిగా ఆందోళన పోరాటాలు చేస్తున్న నేటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రధానంగా రెగ్యులర్ కార్మికులకు రెండు సంవత్సరాల బకాయి ఉన్న సరెండర్ లీవ్, బకాయి ఉన్న డిఏలు ఇంక్రిమెంట్స్, సకాలంలో యూనిఫాం, పనిముట్లు, ఇవ్వాలని, పారిశుద్ధ్య కార్మికుల కు చనిపోయిన కార్మికులకు డెత్ బెనిఫిట్స్ ఇప్పించాలని టెక్నికల్ సమస్యలతో వేతనం పడని వారికి వెంటనే వేతనం ఇవ్వాలని, ఈపీఎఫ్ ఈఎస్ఐకు సంబంధించి కన్సల్టెంట్ ను వెంటనే ఏర్పాటు చేయాలని, ఇంజనీరింగ్ ఔట్సోర్సింగ్ కార్మికులకు 2011 సంవత్సరంలో 11 నెలల పిఎఫ్ బకాయి వెంటనే వారికి ఖాతాలోకి జమ చేయాలని, గార్బేజ్ కోవిడ్ మలేరియా కార్మికులకు సకాలంలో వేతనాలు ఇస్తూ వారి వేతనం నుండి ఈ.పీ.ఎఫ్ ఈ.ఎస్.ఐ కటింగ్ చేయించాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం సంవత్సరంల తరబడి పరిష్కారం చేయమని వేడుకుంటున్న పరిష్కారం చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. స్పందన కార్యక్రమంలో దాదాపు 55 అర్జీలు ఇచ్చిన ఇచ్చిన అర్జీలకు దిక్కే లేనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి 23వ తేదీ లోపు సమస్యలు పరిష్కారం చేయాలని స్పందన కార్యక్రమంలో వేడుకోవడం జరిగినది. ఇప్పటికైనా 23 తేదీలోపు సమస్యలు పరిష్కారం కాని పక్షాన రెండు రోజులు మెరుపు సమ్మెకు వెళ్తామని స్పందన కార్యక్రమంలో మెరుపు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కావున కమిషనర్ పాలకవర్గం కార్మికుల సమస్య లకు మార్గం చూపాలని లేని పక్షాన నిరవధిక ఆందోళన పోరాటాలు కూడా వెళ్తామని కార్మికులు స్పందన కార్యక్రమం సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు, రెగ్యులర్ కార్మికుల యూనియన్ లీడర్ ముత్తు రాజు, నల్లప్ప, ఓబుల్ పతి ,పోతులయ్య, సంజీవ రాయుడు, శ్రీనివాసమూర్తి మరియమ్మ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొనడం జరిగింది.










