Jun 15,2023 16:47

ప్రజాశక్తి-తెనాలి(గుంటూరు) : కార్మికుల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా పటిష్టంగా అమలు కావడం లేదని, ప్రభుత్వాలు మారినా కార్మికుల సమస్యలకు పరిష్కారం లభించడం లేదని సిఐటియు జిల్లా నాయకులు కె బాబు ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగా పురపాలక సంఘ కార్యాలయం ఎదుట గురువారం మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. బాబు ప్రసాద్ నిరసన దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 1948లో ఈఎస్ఐ చట్టం వచ్చినా దానిని అమలు చేయడం లేదన్నారు. ఫలితంగా కార్మికులు నష్టపోతున్నారని చెప్పారు. ఈపీఎఫ్ చట్టం, సమాన పనికి సమాన వేతనం చట్టం, కనీస వేతనం చెల్లింపు చట్టం, గ్రాట్యూట్ చట్టం వంటివి ఎన్ని ప్రభుత్వాలు మారినా కార్మికులకు అమలు కావడం లేదన్నారు. అన్ని విధాల కార్మికులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలను ప్రభుత్వం అధ్యయనం చేసి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు షేక్ హుస్సేన్ వలి, అధ్యక్ష కార్యదర్శులు ఎం.పద్మ, ఎం వెంకటేశ్వర్లు, కె సుశీల, వి.లక్ష్మీనారాయణ, కె.సరళ రాణి, డి దుర్గాప్రసాద్, సిహెచ్ వెంకాయమ్మ, ఎన్ ఆదాం, జి తిరుపతయ్య, మేరి బాబు, ఆర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు