Jul 29,2023 21:50
  • నెల్లూరులో ప్రారంభమైన పండుగ

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : మతసామరస్యానికి ప్రతీకైన రొట్టెల పండుగ నెల్లూరులో శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఐదు రోజులపాటు జరిగే ఈ పండుగకు బారాషాహిద్‌ దర్గా, స్వర్ణాల చెరువు ముస్తాబైంది. మొహర్రం సందర్భంగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతోపాటు విదేశాల నుంచి యాత్రికులు పెద్ద ఎత్తున తరలొచ్చారు. కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, ఎస్‌పి కె.తిరుమలేశ్వరరెడ్డి, జెసి కూర్మానాధ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వికాస్‌ ఏర్పాట్లు పరిశీలించారు. ప్రతి ఏడాది మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను యాత్రికుల రద్దీ మేరకు ఐదు రోజులకు పొడిగించారు. ఆగస్టు 2వ తేదీ వరకు రొట్టెల పండుగ జరగనుంది. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, వివాహం, ఇలా అనేక రకాల రొట్టెలను ఒకరినొకరు పంచుకున్నారు. క్యూ లైన్లోని యాత్రికులకు ఇబ్బందులు లేకుండా అందరికీ త్వరితగతిన దర్శనం అయ్యేలా చూడాలని, వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లలో తోపులాటలకు ఆస్కారం లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వృద్ధులు, వికలాంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. రాబోయే రోజుల్లో యాత్రికుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున, అందుకనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకున్నారు. స్వర్ణాల చెరువులో భక్తులు స్నానాలు చేస్తుండడంతో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. విద్యుత్‌, మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.