Oct 22,2023 07:08
  • ఎటుచూసినా వెల్లివిరిసే ఉత్సాహం... కనుల పండుగగా వీధి వీధులా వెలుగులీనుతున్న కమనీయ కాంతులు... వీనులవిందుగా నలుదిశలా మార్మోగే పాటలు జోరు... ఆడుతూ పాడుతూ మైమరచి చిందులేసే యువత కేరింతలు... ముసిముసి నవ్వులతో ఆనంద పరవశంతో పులకరింతలు.. పండుగ వాతావరణాన్ని తదేక దృష్టితో చూస్తూ పిల్లలను ఆశీర్వదించే పెద్దలు... పట్టణ వీధుల్లో ఇసుకేస్తే రాలనంత జనబాహుళ్యం... జాతీయస్థాయి క్రీడాకారుల పోటీలతో యువతలో సరికొత్త ఉత్సాహం.. అబ్బుర పర్చే అద్భుతమైన బుట్టబొమ్మల నృత్య ప్రదర్శనలు.. భళిరా భళి అంటూ కళ్లు మిరుమిట్లు గొలిపే భేతాళ నృత్య ప్రదర్శనల కోలాహలం. అడుగడుగునా సంప్రదాయ కోలాటాల ఆనంత హేళలు... భక్తి బృందపు బహుచక్కని భజన కీర్తనలు... బడలిక తెలియకుండా నయన మనోహర నృత్యం చేస్తున్న కళాకారులు... విచిత్రమైన బహు విశేష వేషధారణలు... అబ్బురపర్చే సాంస్కృతిక ప్రదర్శనలు ఝంఝం నాదాలు... యుద్ధ విద్యల విన్యాసాలు... పలుతున్న టపాసుల మోతలు... జురు అంటూ కాంతులతో నిండిన ఆకాశం... ఊరేగింపులు... వీటిన్నిటి కలబోత నూజివీడు దసరా ఉత్సవాల సందడి. సర్వమత సమ్మేళనంగా నూజివీడు దసరా ఉత్సవాలు 115 ఏళ్ల నుంచి సాగుతున్నాయి. ముస్లింలు కూడా ఈ ఉత్సవాల్లో పెద్దఎత్తున పాల్గొనడం సర్వమత సమ్మేళనానికి నిదర్శనం.

ప్రపంచంలో కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో దసరా ఉత్సవాలు ఎంతో పేర్గాంచాయి. ఆంధ్రా మైసూరుగా నూజివీడు పేరుగాంచింది. దాదాపుగా 115 సంవత్సరాలపాటు క్రమం తప్పకుండా నిర్విరామంగా ఈ మహోత్సవాలను ఇక్కడి నిర్వహిస్తూ వస్తున్నారు. 1952 నుంచి 2023 వరకూ కొనసాగుతూ 71వ వార్షికోత్సవాన్ని ఏడాది నిర్వహిస్తున్నారు. మైసూరులో వడయార్‌ రాజా వంశీయులు మాదిరిగానే ఉయ్యూరు రాజా వారు జమ్మి కొట్టి అమ్మవారికి పూజ చేయడం, ఉయ్యూరు జమీందారు గౌరవ సూచకంగా తుపాకీ పేల్చి, జమ్మి చెట్టుకు పూజ చేయడంతో దసరా ఉత్సవాలను సంప్రదాయ బద్ధంగా ప్రారంభిస్తారు. కుల, మత, ప్రాంతం వంటి బేధాలు లేకుండా ప్రజానీకం ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.

dasara-festival-in-nuzivid-history-jeevana-story
  • బుట్టబొమ్మల ఊరేగింపు ప్రత్యేకత

ప్రాచీన సాంప్రదాయంలో భాగంగా బుట్ట బొమ్మల ఊరేగింపు దసరా వేడుకలకు హైలెట్‌గా నిలవనుంది. ఐరావత వాహనం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. బుట్ట బొమ్మలు ఉయ్యూరు ఎస్టేట్‌ నుండి ప్రారంభమై దసరా రోజున పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి ఊరేగింపుగా ప్రదర్శన కొనసాగుతుంది. రాత్రి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు మరుసటి రోజు తెల్లవారే వరకు సాగే బుట్ట బొమ్మల ప్రదర్శనలో యాత్రికులు, సందర్శకులు వేలాదిగా పాల్గొంటారు.

  • ఈ ఏడాది హంస వాహనం ఏర్పాటు

దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా విజయవాడలో కనకదుర్గమ్మకు కృష్ణానదిలో తెప్పోత్సవం (జలవిహారం) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నూజివీడులో ఈ ఏడాది హంస వాహనం ప్రత్యేకంగా ఏర్పాటుచేసి ఊరేగించనున్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీమత్‌ కామాక్షి అమ్మవారి ఆలయంలో సంప్రదాయ బద్ధంగా శ్రీదేవి దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తారు. దసరా రోజున రాత్రి 9 గంటలకు శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర నాటక ప్రదర్శనను ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

dasara-festival-in-nuzivid-history-jeevana-story
  • చారిత్రక వైభవానికి సాక్ష్యం నూజివీడు సంబరాలు 

గతంలో ఏడు సంస్థానాలకు రాజధానిగా భాసిల్లిన నూజివీడు రాచరికపు కోటలకు నిలయంగా ఉండేది. తమ కోటలను శుత్రువుల బారి నుంచి పరిరక్షించుకునేందుకు గుర్రాలు, కుక్కల గేట్లను సైతం నిర్మించారు. నేటికీ ఆ గేట్లు అలాగే ఉన్నాయి. కీర్తిశేషులు డాక్టర్‌ ఎం.ఆర్‌.అప్పారావు తండ్రి రాజా మేకా వెంకటాద్రి అప్పారావు (ఉయ్యూరు ఎస్టేట్‌) నాయకత్వంలో దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించటం ప్రారంభించారు. ఐదు దశాబ్ధాలకుపైగా ఆయన నేతృత్వంలో ఈ ఉత్సవాలు జరిగాయి. ఏనుగు అంబారీలు (ఐరావతం)పై పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి, కోట శివాలయం, రాజగోపాలస్వామి ఆలయాలకు చెందిన ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి పట్టణమంతా సంచారం చేసేవారు. ఏనుగులతోపాటు ఒంటెలు, గుర్రాలు ప్రదర్శనలో ఉండేవి. ఆ వెనుక తప్పెట్లు, బుట్టబొమ్మలు, శక్తి వేషాలు, కోలాటాలు, భజనలు, విచిత్ర వేషధారులు ఉండడం ఆనవాయతీ. ఇప్పుడు కూడా అనేక రకాల కళాకారులు ఉత్సవాల్లో పాల్గొని తమ కళారూపాలను ప్రదర్శిస్తుంటారు. దసరా పండుగ పర్వదినాన నగరమంతా భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాల నలుమూలల నుంచి ప్రజానీకం వస్తారు. ఉయ్యూరు ఎస్టేట్‌ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాల నిర్వహణ బాధ్యతను రాజా వెంకటాద్రి అప్పారావు నూజివీడు స్పోర్టింగ్‌ క్లబ్‌కు 1952లో అప్పగించారు. బొబ్బిలి బాల నేతృత్వంలో పరిమిశెట్టి రామకృష్ణ (చంటి), యిరవా చలపతిరావు అధ్యక్ష కార్యదర్శులుగా స్పోర్టింగ్‌ క్లబ్‌ ఏర్పడి దసరా ఉత్సవాలను నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. వారి అనంతరం కీర్తిశేషులు పి.బాలకృష్ణ, బొబ్బిలి కొండలరావు అధ్యక్షులుగా పనిచేశారు. అనంతరం రామిశెట్టి మురళీకృష్ణకుమార్‌ తదితరుల నాయకత్వంలో నేటివరకూ దిగ్వియంగా కొనసాగిస్తూనే ఉన్నారు.
- పగడాల సత్యనారాయణ, దసరా ఉత్సవాల నిర్వహణా కమిటీ కార్యదర్శి

dasara-festival-in-nuzivid-history-jeevana-story
  • ఆటల పోటీలతో సందడి

కీర్తిశేషులు రాజా మేకా వెంకటాద్రి అప్పారావు, పరిమిశెట్టి బాలకృష్ణ, బొబ్బిలి కొండలరావుల నేతృత్వంలో దాదాపు 115 ఏళ్ల నుంచి ఈ దసరా సంబరాలు జరుగుతున్నాయి. అంతే వైభవంతో ఈ చారిత్రాత్మక సంబరాలను కొనసాగించాలనే తపనతో స్పోర్టింగ్‌ క్లబ్‌ కృషి చేస్తోంది. దాతల ఆదరణ, ప్రజల ప్రోత్సాహంతో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నూజివీడు స్పోర్టింగ్‌ క్లబ్‌ ద్వారా అఖిల భారత చెడుగుడు పోటీలు, దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది 71 వార్షిక అఖిల భారత చెడుగుడు పోటీలు పురుషులు, మహిళల ఆహ్వాన కబడ్డీ పోటీలు, దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈనెల 22న ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 23న చెడుగుడు, కబడ్డీ పోటీలు ప్రారంభమవుతాయి. అదేరోజు రాత్రి దసరా ఉత్సవాల ర్యాలీ ప్రారంభమవుతుంది. 25న విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుంది.
- రామిశెట్టి మురళీకృష్ణకుమార్‌., నూజివీడు స్పోర్టింగ్‌ క్లబ్‌ అధ్యక్షులు

----- - యడవల్లి శ్రీనివాసరావు