ప్రజాశక్తి-కాకినాడ : ఆరోగ్యకర, ఆనందమయ జీవితానికి ప్రతి ఒక్కరూ యోగాను అలవాటుగా చేసుకోవాలని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా ఆయుష్ శాఖ కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో కాకినాడ డీప్ వాటర్ పోర్టు గేట్-1 వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. యోగా ఫర్ వసుధైవ కుటుంబకం ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ ఆర్‌డీవో ఎన్‌వీవీ సత్యనారాయణ, జిల్లా ఆయుష్ అధికారి డా. టి.జగదీశ్వరరావు, రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ వైడీ రామారావు, డీఎంహెచ్‌వో డా.ఆర్.రమేష్, సెట్రాజ్ సీఈవో షేక్ ఇమ్రాన్, సీపోర్ట్స్ సీవోవో ఎం.మురళీధర్, వివిధ విభాగాల అధికారులు, యోగా ఔత్సాహికులు హాజరయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎంపీ, కలెక్టర్, ఇతర జిల్లా ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో భాగంగా పతంజలి యోగాకేంద్ర ప్రతినిధి ఎం.కృష్ణవేణి, యోగా గురు రజినీ దీదీ నేతృత్వంలో యోగాసనాలు, ధ్యాన సాధన అభ్యసన ప్రక్రియ జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగాసనాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని ఎదుర్కొనేందుకు పిల్లల నుంచి ప్రతి ఒక్కరూ యోగాను అనుసరించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచు యోగా ప్రాధాన్యాన్ని చెబుతుంటారని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత మన సంప్రదాయ ఆయుష్ వైద్య విధానాలకు ఆదరణ పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రూ. 15 కోట్ల రూపాయల ఆయుష్ మిషన్ నిధులతో 50 పడకల సామర్థ్యమున్న ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి కాకినాడ స్మార్ట్ సిటీకి మంజూరు కావడం ఆనందంగా ఉందని త్వరలోనే ఈ ఆసుపత్రి పనులు ప్రారంభంకానున్నాయని ఎంపీ వంగా గీత వెల్లడించారు.
- దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి : కలెక్టర్ కృతికా శుక్లా
కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ మన భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగాసనాలు ఉపయోగపడతాయని తాను కూడా రోజూ సూర్య నమస్కారాలు, ప్రాణాయామం వంటివి చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్క రోజుకే పరిమితం కాకుండా ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా చేయడం అలవాటుగా ఉన్నవారికి కోవిడ్ సమయంలో శ్వాస సంబంధ సమస్యలు ఎదురుకాలేదని పేర్కొన్నారు. యోగా వల్ల శరీరానికి, మెదడుకు బలమైన బంధం ఏర్పడుతుందని, ఇమ్యూనిటీ పెరుగుతుందని వివరించారు. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అనేది ఎదురవడం సహజమని ఈ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యోగా ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు యోగాను అలవాటుగా చేసుకోవాలన్నారు. రోజుకు దాదాపు 30 నిమిషాలపాటు యోగాసనాల సాధనతో ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకోవచ్చని కలెక్టర్ డా. కృతికా శుక్లా పేర్కొన్నారు. కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎం.మురళీధర్ యోగా విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో పోర్టు అధికారులు ధర్మశాస్త్ర, కెప్టెన్ జాకబ్, జిల్లాలోని వివిధ ప్రాంతాల ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్యులు తదితరులు హాజరయ్యారు.










