Aug 03,2022 06:53

దేశంలో మంకీపాక్స్‌ కేసులు ఒకటి రెండు బయటపడిన రోజుల వ్యవధిలోనే త్రిస్సూర్‌లో ఒక మరణం కూడా సంభవించిన నేపథ్యంలో మంకీపాక్స్‌ కలిగించే ముప్పుపై సర్వత్రా ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే మంకీపాక్స్‌ వల్ల మరణాలు చాలా అరుదే అయినప్పటికీ జనాభాపై ఆధారపడి కూడా ఇది మారే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) పేర్కొంటోంది. ఈ వ్యాధి గాలి ద్వారా సంక్రమించేది కాదు, ఎవరితోనైనా సన్నిహితంగా మెలిగితే వచ్చేది. పైగా ఈ వ్యాధితో మరణాల రేటు కూడా జీరో నుండి 11శాతం వరకు వుంది. పిల్లల్లో మరణాల రేటు ఎక్కువగానే వుంది. ఇటీవలి కాలంలో ఈ మరణాల రేటు 3 నుండి 6 శాతంగా నమోదవుతోంది. 1970వ దశకం నుండి ఆఫ్రికాలో ఈ వ్యాధి నమోదవుతోంది. అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయిల్‌లో కూడా వుంది. 2017లో నైజీరియాలో బాగా పెచ్చరిల్లింది. మరణాల నిష్పత్తి దాదాపు మూడు శాతంగా నమోదైంది. ఆఫ్రికా ఖండం వెలుపల చూసినట్లైతే దాదాపు 78 దేశాల్లో ఈ వ్యాధి పొడసూపింది. దీంతో దీని ముప్పు పెరిగింది. కోవిడ్‌ విషయంలో చూసినట్లుగా నిర్దిష్ట జనాభా గ్రూపుల్లో ఇది ఎక్కువగా ముప్పు కలిగిస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియరావడం లేదు.
          బ్రెజిల్‌, స్పెయిన్‌లో మంకీపాక్స్‌ మరణాల్లో బాధితులకు తీవ్రమైన లక్షణాలు వున్నాయి. మెదడువాపు వ్యాధి, లింఫోమా వంటివి కనబడ్డాయి. అయితే ఈ వ్యాధుల్లో వైరస్‌ పోషించిన పాత్ర స్పష్టంగా ఇంకా తెలియరాలేదు. ప్రధానంగా లైంగిక చర్య ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని భావిస్తున్న తరుణంలో త్రిస్సూర్‌ మరణంపై కూలంకషంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఎంతైనా వుంది. త్రిస్సూర్‌లో బాధితుడు వైరస్‌ సోకిన వెంటనే ఆస్పత్రిలో చేరలేదు. జ్వరం, తీవ్రమైన నిస్పత్తువ కారణంగా ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాతే శరీరంపై దద్దుర్లు వచ్చాయి. చనిపోవడానికి ఒక రోజు ముందుగా మాత్రమే ఆ వ్యక్తికి వైరస్‌ సోకినట్లు తెలిసింది. అయితే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో పొరపాటున మంకీపాక్స్‌గా నిర్ధారించారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. వీటిని తోసిపుచ్చేందుకుగానూ ఎన్‌ఐవి తిరిగి పరీక్ష కూడా నిర్వహించింది వ్యాధి వ్యాప్తిని పర్యవేక్షించేందుకు భారత ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. త్వరగా వ్యాక్సిన్‌ అభివృద్ధిపరచాల్సిందగా భారత వైద్యపరిశోధనా మండలి వ్యాక్సిన్‌ తయారీదారులను కోరింది. వ్యాధి నిర్ధారణ కిట్‌లను అభివృద్ధిపరచాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వ్యాధి స్వీయపరిమితితో వున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వ్యాధి తీవ్రతను పారదర్శకంగా తెలియచేయడంలో ప్రభుత్వం అలసత్వం వహించరాదు.
                                                            /'ది హిందూ' సంపాదకీయం/