Apr 05,2023 10:54

న్యూయార్క్‌ : ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వారి జీవిత కాలంలో వ్యంధత్వంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన కొత్త నివేదికలో పేర్కొంది. అందరికీ ఆమోదయోగ్యమైన, అత్యంత నాణ్యత కలిగిన సంతానోత్పత్తి సంరక్షణను మెరుగుపరిచేందుకు మరింత కృషి జరపాల్సిన అవసరముందని పేర్కొంది. యువతలో 17.5 శాతం మందికి వ్యంధత్వం అనుభవంలోకి వచ్చిందని డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది. ప్రపంచంలోని భిన్న ప్రాంతాల మధ్య ఈ వ్యంధత్వం స్థాయిలో పెద్దగా మార్పు లేదని పేర్కొంది. అధిక ఆదాయ దేశాల్లో జీవితకాల వ్యాప్తి 17.8 శాతంగా వుండగా, తక్కువ, ఒక మోస్తరు ఆదాయం కలిగిన దేశాల్లో 16.5 శాతంగా వుంది. 'వ్యంధత్వం కారణంగా వివక్ష చూపరాదు' అని డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రొస్‌ అదనామ్‌ గాబ్రియెసెస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 'ఈ నిష్పత్తి చూస్తుంటే సంతానోత్పత్తి సంరక్షణకు అవకాశాలను విస్తరించాల్సిన అవసరం తెలుస్తోంది. ఆరోగ్య పరిశోధన, విధాన రంగంలో ఈ అంశాన్ని పక్కకు నెట్టేయకుండా చూడాల్సి వుందని, అప్పుడే సురక్షితమైన, సమర్ధవంతమైన, అందరికీ అందుబాటులో వుండే మార్గాలు తల్లిదండ్రులు కావాలనుకున్నవారికి అందుబాటులో వుంటాయి' అని డబ్ల్యుహెచ్‌ఓ రీసెర్చ్‌ విభాగ డైరెక్టర్‌ డాక్టర్‌ పాస్కలే అలాటీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరింత మెరుగైన విధానాలు, ప్రభుత్వ ఆర్థిక సాయంతో పరిస్థితిని చక్కబరిచేందుకు అవకాశం వుంటుందని తెలిపారు.