- 2022 నాటికి రైతుల డబుల్ చేస్తామంటూ గతంలో గొప్పలు
- వాస్తవానికి రైతుల ఆదాయంలో భారీ క్షీణత
- రుణ భారాలతో అనుదాత విలవిల
- ఐదేళ్లలో 28,572 మంది బలవన్మరణం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :
- '2022 నాటికి దేశంలోని అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తాం. అదే ప్రభుత్వం లక్ష్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతుంది. అందుకనే 2022 నాటికి రైతులు ఆదాయం కూడా రెట్టింపు అవ్వాలి. అందుకనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది'' - 2016 ఫిబ్రవరి 28న ఉత్తరప్రదేశ్‌లోనిబరేలీలో జరిగిన రైతు ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ఇది.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనే లక్ష్యం స్వాగతించదగినదే. కానీ అంతటి చిత్తశుద్ధి పాలకులకు ఉండాలి కదా. మోడీ సర్కార్‌కు ఈ చిత్తశుద్ధే లోపించింది. అన్నదాతల పట్ల బిజెపి ప్రభుత్వం ఎంతటి నిర్లక్ష్యంగా ఉందంటే కనీసం 'రైతు' అంటే ఎవరు? రైతు ఆదాయం అంటే ఏమిటి? అనే నిర్వచనం కూడా ఇవ్వలేనంత. రైతుల ఆదాయం డబుల్ చేస్తామంటూ మోడీ సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకున్న 2022 సంవత్సరం రానూవచ్చింది..ఆగస్టు 15న అమృత మహోత్సవాలు కూడా ఆడంబరంగా నిర్వహించడమూ సరేసరి..నిన్నటి శనివారంతో ఏడాది ముగియనూ ముగిసింది. కానీ మోడీ సర్కార్ అన్నదాతలకు వాగ్దానం చేసిన ఆదాయం మాత్రం రెట్టింపు కాలేదు. పైగా రైతనుల ఆదాయం గతం కంటే భారీగా క్షీణించింది. రైతులు కనీుళ్లూ తడారలేదు. పండిన పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం, మరోవైపు పంట పండించడానికి పెట్టుబడి వ్యయం యేటికేడూ పెరిగిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతునాురు. దీనివల్ల అప్పుల భారం పెరుగుతోంది. జూలై 2018 - జూన్ 2019 ఏడాదిలో దేశంలో సగటున ఒక్కొ కుటుంబంపై రూ.74,121 రుణభారం ఉందని కేంద్ర ప్రభుత్వమే తెలిపింది. తాజా గణాంకాలను వెల్లడించేందుకు కూడా మోడీ సర్కార్‌కు మనసు రావడం లేదు. మరోవైపు రైతనుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. ప్రధానిమోడీ రైతులకు రెట్టింపు ఆదాయం చేస్తామని ప్రకటించిన తరువాత కాలంలో దేశవ్యాప్తంగా 28,572 (2017-22) మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
- పిఎం కిసాన్ లబ్దిదారుల కుదింపు
రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయంలో భారీ కోత విధించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పిఎంకిసాన్) పథకం నుంచి ఈ ఏడాదిలోనే కేవలం కొనిు నెలల వ్యవధిలోనే దాదాపు రెండు కోట్ల మంది రైతులను తొలగించారు. 2022-2023లో 11వ విడుత (ఏప్రిల్-జూలై)లో 10,45,59,905 మంది రైతులకు పిఎంకిసాన్ పథకం వర్తిస్తే, 12వ విడుత (ఆగస్టు-నవంబర్)లో 8,42,14,408 మంది రైతులకు మాత్రమే పిఎం కిసాన్ వర్తించింది. 2,03,45,497 మంది రైతులు పిఎం కిసాన్ పథకం నుంచి తొలగించారు. రెండు కోట్ల మంది రైతులను తొలగించడంతో కేంద్ర ప్రభుత్వం రూ.5,108 కోట్లను మిగిలించుకుంది. 11వ విడుతలో రూ.22,551 కోట్లు విడుదల చేస్తే, 12 విడుతలో 17,443 కోట్లు కేటాయించింది.
- నిపుణల కమిటీ ప్రతిపాదనలకూ తిలోదకాలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన తరువాత కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ 13న రైతుల ఆదాయం రెట్టింపు (డిఎఫ్‌ఐ)పై అశోక్ దల్వారు నేతృత్వంలోని 16 మంది నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 14 సంపుటాలలో రైతుల ఆదాయం రెట్టింపు (డిఎఫ్‌ఐ)పై నివేదికను సమర్పించింది. 2017 ఆగస్టులో మొదటి సంపుటి విడుదల చేసింది. 2018 సెప్టెంబర్‌లో 14వ సంపుటి వచ్చింది. ఈ కమిటీ 16 సిఫార్సులను చేసింది. అందులో రైతు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఉత్పత్తి వ్యయం కంటే 1.5 రెట్లు ఉండాలని తెలిపింది. అగ్రి మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ రూ. 2,000 కోట్లతో 22,000 గ్రామాల్లో (గ్రామీణ స్థాయి మార్కెట్‌లు, అగ్రిగేషన్ హబ్‌లు) ఏర్పాటు చేయాలని, 585 వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఎపిఎంసి)లను అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది. ధర, డిమాండ్ అంచనాలు, ఫ్యూచర్స్, ఎంపికలు, వ్యవసాయం కోసం ఎగ్జిమ్ విధానాలపై విధానాలను అభివృద్ధి చేయడానికి సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనివంటి కొన్ని సిఫార్సులను చేసింది. కానీ మోడీ సర్కార్ ఈ ప్రతిపాదనలనూ పెడచెవిన పెట్టింది.
- నీతి అయోగ్ చెబుతున్నదేమిటి?
రైతుల ఆదాయాల బెంచ్‌మార్క్ అంచనాలు, వీటినిరెట్టింపు చేయడంపై నీతి అయోగ్ వ్యవసాయ ఇన్‌ఛార్జ్ సభ్యుడు రమేష్ చంద్ కొన్ని గణాంకాలు తెలిపారు. ఆయన విడుదల చేసిన డేటా ప్రకారం 2004-05, 2011-12 మధ్య 7.5 శాతం పెరుగుదల ఉన్నట్లు తెలిపారు. 2011-12, 2015-16 మధ్య ఒక్కో సాగుదారునికి నిఖర ఆదాయం ఏడాదికి 0.44 శాతం పెరిగినట్లు చూపించారు. ఇది 1999-2000, 2004-05 మధ్య ఎన్‌డిఎ-1 ప్రభుత్వ కాలంలో ఏడాదికి 0.55 శాతం మేర తగ్గింది. 2016-17, 2020-21 మధ్య డేటా అందుబాటులో ఉను చివరి సంవత్సరం, దీనిప్రకారం రైతుల వాస్తవ ఆదాయం 1.5 శాతం క్షీణించింది. ఇది ఎన్‌డిఎ-1 నాటి వ్యవసాయ సంక్షోభం సమయంలో కంటే మూడు రెట్లు అధిక క్షీణతగా ఉంది. తీవ్ర కరువు నెలకొన్న 2015-16ని బేస్ ఇయర్‌గా ఉపయోగించారు. కానీ కరువు సంవత్సర కాలంలోని ఆదాయ గణాంకాలను కూడా మోడీ సర్కార్ నిర్దేశించుకున్న లక్ష్యం చేరుకోకపోవడం గమనార్హం. 2021-22 డేటా అందుబాటులో లేదు.
- ఎన్‌ఎస్‌ఒ, నాబార్డ్ గణాంకాల్లోనూ క్షీణతే
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఒ) సిట్యుయేషన్ అసెస్‌మెంట్ సర్వే (ఎస్‌ఎఎస్) ఆధారంగా పంటల వ్యవసాయం వల్ల రైతు కుటుంబాల ఆదాయం 2012-13, 2018-19 మధ్య ఏడాది 1.5 శాతం క్షీణించింది. 2018-19 తరువాత ఎటువంటి సర్వేలు జరగనందున, 2022లో రైతుల ఆదాయాన్ని అంచనా వేయడానికి మార్గం లేదు. 2015-16 తరువాత రైతు ఆదాయంలోనూ క్షీణత ఉంది. నాబార్డ్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే (ఎన్‌ఎఎఫ్‌ఐఎస్)లో భాగంగా గ్రామీణ కుటుంబాల సర్వే వ్యవసాయ కుటుంబాల ఆదాయానికి సంబంధించిన ఇతర డేటా ఎస్‌ఎఎస్‌కి భిన్నంగా ఉంది. అయితే ఆదాయాల వృద్ధి క్షీణతను స్పష్టం చేసింది. వ్యవసాయ కుటుంబాల ఆదాయం 2015-16, 2018-19 మధ్య ఏడాది 1.7 శాతం పెరిగిందని, ఇది మునుపటి కాలంలోని 3.8 శాతం వృద్ధి రేటు కంటే సగం కంటే తక్కువగా ఉందని స్పష్టం చేసింది.










