Jul 29,2023 22:10
  • చెప్పినట్లు నివేదిక ఇవ్వలేదనే వేటు !

న్యూఢిల్లీ : ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపిఎస్‌) డైరెక్టర్‌ కె.ఎస్‌.జేమ్స్‌ను సస్పెండ్‌ చేస్తూ మోడీ ప్రభుత్వం అనూహ్యమైన చర్య తీసుకుంది. రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరగడమే ఇందుకు కారణంగా పేర్కొంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలను నిర్వహిస్తూ వుంటుంది. ప్రభుత్వం తరపున ఇతర కార్యక్రమాలను కూడా చేపడుతూ వుంటుంది. జేమ్స్‌కు సస్పెన్షన్‌ లేఖ జారీ అయిన విషయాన్ని ఐఐపిఎస్‌లోని ప్రజారోగ్య, మరణాల అధ్యయన విభాగ వర్గాలు ధృవీకరించాయి. సోమవారానికి మరిన్ని వివరాలు అందే అవకాశం వుందని భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఈ లేఖను పంపారు. ఐఐపిఎస్‌ సర్వేల్లో నిర్దిష్ట డేటా సెట్‌లతో అసంతృప్తిగా వునుందున రాజీనామా చేయాల్సిందిగా జేమ్స్‌ను ఇంతకుముందే ప్రభుత్వం కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కేంద్రం చెప్పినట్లు నివేదిక ఇవ్వకపోగా, అసత్యాలతో తాము పేర్చిన కోటను వాస్తవిక గణాంకాలతో కూల్చివేశారనే కక్షతోనే జేమ్స్‌పై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు సంబంధిత వర్గాలు విమర్శిస్తున్నాయి.
ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ డైరెక్టర్‌గా 2018లో నియమితులయ్యారు. అనేక డేటా సెట్‌లు ప్రభుత్వానికి అసౌకర్యంగా మారాయని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 వెల్లడించడం ఇక్కడ గమనార్హం. 2019 అక్టోబరు 2న బహిరంగ మల విసర్జన రహిత భారతదేశంగా మారినట్లు ప్రధానిమోడీ ప్రకటించడాన్ని సర్వే తీవ్రంగా విభేదించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రతినిధులు, బిజెపి నేతలు తరచూ చెబుతూనే వుంటారు. కానీ, దేశంలో ఇప్పటికీ 19 శాతం కుటుంబాలు బహిరంగ మల విసర్జనను పాటిస్తున్నాయని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 డేటా తెలియచేస్తోంది.
ఒడిషా, జార్ఖండ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో 30శాతానికి పైగా జనాభాకు టాయిలెట్లు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరీ అధ్వానుం. పిల్లల్లో పోషకాహారాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో 2018లో పోషణ్‌ అభియాన్‌ పేరుతో ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేలవమైన పనితీరు కనబరుస్తోందని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 సర్వే పేర్కొంది. ఇది కూడా ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. ఈ తరహా డేటాతో మోడీ ప్రభుత్వం ఆగ్రహంగా వుందనేది వార్తలు వెలువడుతున్నాయి.
వినిమయం వ్యయ సర్వేను విడనాడాలని మోడీ ప్రభుత్వం తన మొదటి పదవీకాలంలో నిర్ణయించిన సమయంలో సర్వత్రా విమర్శలు, అనుమానాలు ఎక్కువయ్యాయి. 2019 జనవరిలో నిరుద్యోగ డేటాను నిలుపు చేయాలని నిర్ణయించడం కూడా పరిస్థితిని మరింత అధ్వాన స్థితికి నెట్టివేసింది. పైగా సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆ డేటాను విడుదల చేశారు. ఈ చర్యతో జాతీయ గణాంక కమిషన్‌ సభ్యులు పలువురు రాజీనామా చేశారు. ఇలా డేటా విషయంలో ప్రభుత్వం వ్యవహరించే తీరు కచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు ప్రభుత్వానికి గల నిబద్ధత, పారరద్శకతను ప్రశిుస్తోంది. విధాన నిర్ణయాక క్రమంపై, అధికారిక గణాంకాల పట్ల ప్రజల విశ్వాసంపై పడే ప్రభావం గురించి ఆందోళనలు తలెత్తుతున్నాయి.