
దేశ ప్రజలకు ఏం కావాలి? తినేందుకు ఇంత ముద్ద.. కట్టుకునేందుకు కాస్త గుడ్డ.. ఉండేందుకు ఒక గూడు..చేతి నిండా పని. కానీ దేశంలో ఇప్పటికీ ఇవే ప్రధాన సమస్యలుగా కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారీ విధానాలకు కట్టుబడి కార్పొరేట్ సేవలో పరితపిస్తూ ప్రజా ప్రయోజనాలకు పాతర వేస్తున్నందునే ఈ దుస్థితి. 2014 సార్వత్రిక ఎన్నికల వేళ ఒక 'యుగ పురుషుడు' అంటూ బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిగా కార్పొరేట్ ప్రపంచం తెరపైకి తీసుకొచ్చిన నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గుప్పించిన హామీలు అన్నీఇన్నీ కావు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి తాను ప్రధానమంత్రి అయితే ప్రతి యేటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని నమ్మబలికారు. కానీ ఏమైంది? దేశంలో నిరుద్యోగం కోరలు చాచి మోడీ హామీలను వెక్కిరిస్తోంది. దేశ ప్రజానీకాన్ని అత్యంత ఆందోళనకు గురిచేస్తున్న అంశాల్లో నిరుద్యోగం అగ్రభాగంలో ఉందని ఒక సర్వేలో వెల్లడైంది. నిరుద్యోగం కారణంగా యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో పేర్కొంది.
సెంటర్ ఫర్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం..దేశంలో నిరుద్యోగిత రేటు అక్టోబర్ లో 7.7 శాతానికి పెరిగింది. సెప్టెంబరులో 6.43 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఒక నెల వ్యవధిలోనే 1.34 శాతం పెరగడం ఆందోళనకర పరిణామం. గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. గ్రామీణ భారతావనిలో గత సెప్టెంబరులో 5.84 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు అక్టోబర్ నాటికి 8.04 శాతానికి ఎగబాకింది. హర్యానా, రాజస్థాన్, జమ్ముకాశ్మీర్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో నిరుద్యోగిత రేటు డబుల్ డిజిట్‌కు చేరింది. మరోవైపు పనుల్లో కార్మిక భాగస్వామ్యపు రేటు కూడా పడిపోతోంది. నీతి అయోగ్ గణాంకాల ప్రకారం 2021లో దేశంలో 75 లక్షల మంది 'గిగ్' పనులపై ఆధారపడుతున్నారు. చేతి నిండా చేయగలిగే చేవ ఉన్నా..తగిన ఉపాధి దొరక్క పొట్టకూటి కోసం దేశ యువతరం ఓలా, జొమాటో వంటి ఆన్‌లైన్ ఆధారిత చిన్నాచితకా పనులు చేసేందుకు సైతం వెనుకాడటం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కానీ మోడీ సర్కార్ మాత్రం మొద్దునిద్ర పోతోంది. కార్పొరేట్ సంస్థలకే దోచిపెట్టడం మినహా ఆయన చేసిన ఘనకార్యాలేవీ లేవు. గుజరాత్ అభివృద్ధి ఢంకా కూడా వట్టి బూటకపు ప్రచారమని 'మోర్బీ వంతెన' విషాదం తేటతెల్లం చేసింది. ప్రయివేటు కంపెనీలకు దేనినైనా దోచిపెట్టగలగడమే మోడీకున్న ఏకైక సమర్థత అని తేలిపోయింది.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కోటికి పైగా ఖాళీలు ఉన్నట్లు పార్లమెంటులోనే మోడీ సర్కార్ నిసిగ్గుగా ప్రకటించుకుంది. ఈ 8 ఏళ్లలో 22 కోట్ల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం 7 లక్షల మందికే ఉపాధి దక్కింది. రెండు కోట్ల ఉద్యోగాల భ్రమలకు కొనసాగింపుగానే మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి నినాదాలతో ఈ ఎనిమిదేళ్లు మోడీ సర్కార్ నిరుద్యోగులను వంచించింది. ఖాళీలను భర్తీ చేయకపోవడం వెనుక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలనే కుట్ర కనిపిస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం కూడా దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగిపోవడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 3న ఢిల్లీ జంతర్‌మంతర్‌లో నిర్వహించిన ఆందోళనకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది యువత తరలివచ్చింది. నా ఉద్యోగమేదీ అంటూ గర్జించింది. ప్రతి యేటా ఇస్తామని చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలేమయ్యాయని నిలదీసింది. ఖాళీలను భర్తీ చేయాలని, కాంట్రాక్టు విధానానికి స్వస్తి పలకాలనీ, పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకాన్ని అమల్జేయాలని, అలాగే ఉపాధి కల్పించేదాకా నెలకు రూ.5వేలు చొప్పున యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ఢిల్లీ వీధుల్లో యువతరం నినదించింది. దేశంలో యువతరంలో పెరిగిపోతున్న అసంతృప్తికి ఈ ఆందోళన అద్దం పడుతోంది. మొద్ద నిద్ర నటిస్తూ మొద్దుబారిన మోడీ సర్కార్ నిద్ర లేపాలన్నా..దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆకాంక్షలు నెరవేరాలన్నా ఇలాంటి పోరాటాలను మరింత విస్తరింపజేయడమే మనముందన్న మార్గం.