Nov 28,2022 22:18
  • ఐదు డిమాండ్లను అంగీకరించామన్న మంత్రి
  • హింసాత్మక ఘటనలను ఖండించాలి : సిపిఎం

తిరువనంతపురం : లాటిన్‌ ఆర్చ్‌ డియోసెస్‌ నాయకుల నేతృత్వంలోని అదానీ పోర్ట్‌ వ్యతిరేక కార్యాచరణ మండలి చేపట్టిన పలు హింసాత్మక సంఘటనల అనంతరం రాజధాని తిరువనంతపురంలోని తీర ప్రాంత గ్రామమైన విళింజంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం నిరసనకారులు విళింజం పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. 35 మంది పోలీసులు గాయపడ్డారు. ఐదు జీపులు, 20 మోటార్‌ సైకిళ్లు, కంప్యూటర్లు, వైర్‌లెస్‌ సెట్‌లను కూడా ఆందోళనకారులు తగలబెట్టారు. అంబులెన్సులను కూడా ఆందోళనకారులు ముందుకు కదలనివ్వకపోవడంతో తీవ్రంగా గాయపడిన తమ సహచరులు ఎనిమిది మందిని పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారు. శనివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురు ఆందోళనకారులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ మత పెద్దలతో సహా ఆందోళనకారులు డిమాండ్‌ చేయడంతో పోలీసులు బాష్పవాయ గోళాలు ప్రయోగించారు. ఈ పరిస్థితి హింసాత్మక ఘటనలకు దారి తీసింది. రూ.పది కోట్లకుపైగా విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. దాదాపు మూడు వేల మందిపై కేసులు నమోదయ్యాయి. లాటిన్‌ ఆర్చ్‌ డియోసెస్‌ ఆర్చ్‌ బిషప్‌ థామస్‌ జె.నెట్ట, ఆక్సిలరీ బిషప్‌ ఆర్‌.క్రీస్తుదాస్‌లపై కేసు నమోదు చేసి మొదటి, రెండవ నిందితులుగా పేర్కొన్నారు.
ఉమెన్‌ చాందీ నేతృత్వంలోని యుడిఎఫ్‌ ప్రభుత్వం మంజూరు చేసిన అదానీ పోర్టు నిర్మాణానికి మద్దతునిస్తామని హామీ ఇస్తూ గతంలో ఆర్చ్‌ డియోసెస్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రెండు రోజుల క్రితం నిరసన మండలి వేసిన శిబిరాన్ని పోర్టు నిర్మాణానికి మద్దతునిచ్చిన వారు ధ్వంసం చేశారు. పోర్టు నిర్మాణానికి మద్దతునిస్తూ మాజీ ఆర్చ్‌ బిషప్‌ సుశేపాక్యమ్‌ విడుదల చేసిన పాత వీడియోను మీడియాలోని ఒక వర్గం సోమవారం విడుదల చేశారు.

  • ఐదు డిమాండ్లను ఆమోదించాం : మంత్రి దేవర్‌కోవిల్‌

ఆందోళనకారులు ఏడు డిమాండ్లను లేవనెత్తుతున్నారు. వాటిల్లో ఐదు డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిందని ఓడరేవుల శాఖ మంత్రి అహ్మద్‌ దేవర్‌కోవిల్‌ చెప్పారు. ప్రతిసారీ సమావేశాల్లోనూ ఆందోళనకారులు కొత్త డిమాండ్లను లేవదీస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని లౌకికవాద కూర్పును విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం అనుమతించబోదని స్పష్టం చేశారు. ఓడరేవు నిర్మాణాన్ని విరమించాలను డిమాండ్‌ మినహా అన్ని డిమాండ్లను అంగీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు.

  • హింసాత్మక ఘటనలను ఖండించాలి : సిపిఎం

హింసను సృష్టించడానికి చేసే ఏ ప్రయత్నాలనైన అడ్డుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం ఒక ప్రకటనలో కోరింది. విళింజం గ్రామంలో జరిగిన సంఘటనలు ఖండించదగినవని పేర్కొంది. ఆందోళనకారులు ప్రజల నుండి వేరయ్యారు. ఈ కోస్తా తీర ప్రాంతంలో అల్లర్లు సృష్టించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఈ ఓడరేవు నిర్మాణానికి సిపిఎం ఎల్లప్పుడూ మద్దతిస్తుందని, దీని వల్ల రాష్ట్ర అభివృద్ధి మెరుగుపడగలదని ఆశిస్తున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది.