ఇంఫాల్ : ఇంటర్నెట్‌పై నిషేధాన్ని మరో ఐదురోజుల పాటు పొడిగిస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. కొన్ని రోజుల్లో ఇంటర్నెట్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తామని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వారం రోజుల అనంతరం ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. కొన్ని సామాజిక వ్యతిరేక శక్తులు రెచ్చగొట్టే ఫొటోలు, ప్రసంగాలు, వీడియోల ప్రసారం కోసం సోషల్ మీడియాను వినియోగించే అవకాశం ఉంది. ఇవి రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితులపై తీవ్రమైన ప్రభావం చూపించవచ్చని, దీంతో నిషేధాన్ని మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు గురువారం కమిషనర్ (హోమ్) టి.రంజిత్ సింగ్ గురువారం డిజిపికి పంపిన లేఖను విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ భద్రతా దళాలతో ప్రజల ఘర్షణలు, ఎన్నికైన ప్రజాప్రతినిధుల నివాసాలపై అల్లరిమూకల దాడులు, పోలీస్ స్టేషన్‌ల ఎదుట నిరసనలు వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆ లేఖలో తెలిపారు.