Apr 24,2023 17:01

ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రాత్రి రమణ ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్స్ & ప్రసాద్ ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "దొరకునా ఇటువంటి సేవ.." సంగీత విభావరి నందిగామ వీక్షకులను ఆకట్టుకుంది. శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం పలువురు సంగీత కళాకారులను అభినందించి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నందిగామ ప్రాంత కళాకారులతో సంగీత విభావరి నిర్వహణ చేయడం ఈ  ప్రాంతానికే గర్వకారణం అని పేర్కొన్నారు. మానవ దైనందిన జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం లాంటి ఒత్తిళ్లతో యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డారని, ఇటువంటి సంగీత కార్యక్రమాలు మనశ్శాంతిని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని తెలిపారు. అనునిత్యం కళాకారులను ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న కళామతల్లి ముద్దుబిడ్డ బొబ్బిళ్ళపాటి గోపాలకృష్ణ సాయి కళా రంగానికి చేసిన సేవలు అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు లేని నగరాలు నిర్జీవంతో కూడుకున్నాయని .. నందిగామ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని ఏర్పాటు చేయాలని సూచించారు . నందిగామ పరిసర ప్రాంతాల నుంచి కళా రంగంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిన కళాకారులందరితో త్వరలోనే మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, గరికపాటి నానయ్య, కో ఆప్షన్ సభ్యులు ఎంవై దాసు, పరిటాల రామ కోటేశ్వరరావు, పారుపల్లి హరిబాబు, నెలకుదిటి శివ నాగేశ్వరరావు, బండారు వెంకట్రావు,  పలువురు కళాకారులు తదితరులు పాల్గొన్నారు .