ప్రజాశక్తి-ఏలేశ్వరం : సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే విశ్రాంతి ఉద్యోగులు సమాజానికి చక్కని సంపద అవుతుందని ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం విశ్రాంతి ఉద్యోగుల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వినియోగించుకుని ప్రభుత్వం, ప్రస్తుత ఉద్యోగులు సమాజాన్ని మరింత అభివృద్ధిపదంలోకి నడపవచ్చు అన్నారు. విశ్రాంతి ఉద్యోగులు సంఘంగా ఏర్పడి సొంత నిధులతో భవనం నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. భవనంలో ఫర్నిచర్ కు తన వంతు సహాయంగా ఆయన లక్ష రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ఆలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు, బొదిరెడ్డి గోపి, సుంకర రాంబాబు, మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు వుద్దగిరి సోమరాజు, ఎండి ఇబ్రహీం ఖాన్, జలారుద్దీన్, మెతకాని రాంబాబు తదితరులు ఉన్నారు.










