
- ట్యాంకర్లతో తడులు అందిస్తున్న రైతులు
ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : పచ్చటి పైర్లతో కళకళలాడాల్సిన పొలాలు నిర్జీవంగా కనిపిస్తున్నాయి. ఖరీఫ్, రభీలో చినుకులు కరువై కర్నూల్ జిల్లాను కరువు ఛాయలు అలుముకున్నాయి. ఎక్కడ చూసినా బీడు భూములు కనిపిస్తున్నాయి. చిరు జల్లులకు విత్తనం వేసిన చోట మొండిగా మొలకలు వచ్చినా ఎండల తీవ్రతకు మాడిపోయాయి. ముఖ్యంగా జిల్లాల్లో మిరప, వరి, పత్తి, కంది పంటల సాగు చేస్తున్నారు. కానీ వర్షాభావ పరిస్థితులు వల్ల జిల్లాలో మిర్చి రైతులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఎండుతున్న మిర్చి పంటను కాపాడేందుకు రైతులు ట్యాంకర్లతో రక్షక తడులు అందిస్తున్నారు. దీంతో రైతుల నుంచి నీటి కోసం ఆర్డర్లు వస్తుండటంతో ట్యాంకర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
- వర్షాభావ పరిస్థితులు, రైతులకు కష్టాలు తెచ్చిపెట్టాయి.
లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన పంట కళ్లముందే ఎండిపోతుంటే.. చూస్తుండలేక తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎండుతున్న మిర్చి పంటను కాపాడేందుకు రైతులు ట్యాంకర్లతో రక్షక తడులు అందిస్తున్నారు. అదనంగా ఖర్చవుతున్నా అన్నదాతలు పట్టువీడకుండా శ్రమిస్తున్నారు.
పెట్టుబడుల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉన్నా మిర్చికి మంచి ధర ఉందనే ఉద్దేశంతో రైతులు ఎక్కువ మంది పంట సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ సారి జిల్లాలో నీటి ఎద్దడి నెలకొంది.మిర్చి పంటపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.కాలువలకు నీరు రాకపోవటంతో రైతులు బోర్లపై ఆధారపడ్డారు.అవిలేని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నీరు లేక మొక్కలు వడలిపోతున్నాయి. ఎలాగోలా పంటని కాపాడాలనే ప్రయత్నాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పంటకు అందిస్తున్నారు. రక్షక తడుల ద్వారా పంటను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిర్చి పంటకు పెట్టుబడులు కూడా ఎక్కువ అవుతాయి. విత్తనాలు, పురుగు మందులతో పాటు కూలీల ఖర్చు అధికంగా ఉంటుంది. ఇప్పటికే రైతులు ఎకరాకు 80వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు సాగు నీటి వ్యయం అందుకు తోడవటంతో మిర్చి రైతులకు పెట్టుబడులు అమాంతం పెరిగాయి.
- ఒక్కసారి ట్యాంకర్ల ద్వారా 25-30 వేల వర్కు ఖర్చులు
ఒకవైపు ఎండిపోతున్న మిర్చి పైరును కాపాడుకోవడానికి రైతులు ఎకరాకు రూ.25-30 వేల వరకూ వెచ్చించి నీటిని ట్యాంకర్ల ద్వారా పెట్టుకుంటున్నారు. అయినా పంట చేతికి రావడం కష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బొబ్బర తెగులు, తామర పురుగు ఉధృతి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. బొబ్బర తెగులు సోకిన మొక్క ఎదుగుదల లోపించడంతో పాటు వేగంగా ఒక మొక్క నుండి మరో మొక్కకు వ్యాపిస్తుందని, ఈ తెగులు సోకిన మొక్కలను గుర్తిస్తే వెంటనే పీకేసి తగలబెట్టాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- విద్యుత కోతలు
లో ఓల్టేజీ సమస్యతో పాటూ విద్యుత కోతలు అన్నదాతలను వేధిస్తున్నాయి. వ్యవసాయానికి పగలు,రాత్రి కలిసి రోజకు 9 గంటలు విద్యుత సరఫరా చేయాలి. అయితే విద్యుత కోతలు ఎక్కువ అయ్యాయని రైతులు వాపోతున్నారు. ఒక్కో రోజు గంట,రెండు గంటలు మాత్రమే విద్యుత సరఫరా చేస్తున్నారని, దీంతో పంట మొత్తానికి నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత అధికారులను అడిగితే ఏవేవో కారణాలు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.

- మోటారు,స్టార్టర్ రిపేరీకి రూ.8 వేలు ఖర్చయింది : వెంకటేష్, రైతు, ఆదోని మండలం
లో ఓల్టేజీతో మోటారు నుంచి నీరు సక్రమంగా రాలేదు. 5ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ, టమోటా పంటలు ఎండిపోతున్నాయి. లోఓల్టేజీ వలన ఇటీవలే మోటారు, స్టార్టర్‌పెట్టె, కేబుల్ వైరు కాలిపోయాయి.వాటి రిపేరీ కోసం మొత్తం రూ.8 వేలు ఖర్చయింది. అధికారులు స్పందించి లో ఓల్టేజీ సమస్య పరిష్కరించాలి.
- మిరప సాగు అధిక ఖర్చమవుతుంది : చెయ్యన్న, రైతు హుళుగుంద మండలం
వర్షాభావ పరిస్థితుల వల్ల మిరప పంట సాగు చేస్తే అప్పు ఈ ఏడదే అధిక ఖర్చవుతుంది. రెండు ఎకరాలు భూమి కౌలుకు తీసుకొని మిరప పంట సాగు చేస్తే తెగుళ్లు సోకి చెట్లు ఎండిపోయాయి.మిరప పంట మీద పెట్టుకున్న ఆశ అడియాశ అయింది. మరో పక్కకి ఎల్ఎల్సి కి నీరు బంద్ అయితే ఇక ఆపు పులి మిగిలేది.
- రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : కే.వెంకటేశులు, రైతు సంఘం, జిల్లా అధ్యక్షులు
బోర్లు, బావులు కింద మోటార్ల ద్వారా సాగవుతున్న పొలాలకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయం లేకుండా సరఫరా చేయాలి. సాగుదార్లలో 70 శాతం మంది కౌలురైతులే. వీరి కోసం ప్రత్యేక నిధిని కేటాయించి నష్టపరిహారం చెల్లించాలి. లేకుంటే వీరంతా అప్పుల నుండి బయటపడలేక ఆర్థికంగా చితికిపోవడంతోపాటు ఆ ఇబ్బందుల నుండి బయటపడలేక సాగుకు వెనకడుగేసే పరిస్థితి వస్తుంది. రైతులను, కౌల్దార్లను ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే రైతు, కౌలురైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం.