Apr 19,2023 17:06
  • అధికారుల ఆదేశించిన మంత్రి దాడిశెట్టి రాజా

ప్రజాశక్తి-కాకినాడ : నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం కింద తుని నియోజకవర్గంలో చేపట్టిన  గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా, జిల్లా కలెక్టరు డా కృతికా శుక్లా, జాయింట్ కలెక్టరు ఎస్ ఇలక్కియ హౌసింగ్, రెవెన్యూ, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో కలిసి తుని నియోజకవర్గ పరిధిలో గృహ నిర్మాణాలు, ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్ తదితర పధకాల క్రింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని   సమీక్షించారు. ఈ సందర్భంగా కోటనందూరు, తుని, తేటగుంట, తొండంగి, ఏవి నగరం లేఔట్లో  అవసరమైన అప్రోచ్, ఇంటర్నల్ రోడ్లు,  లెవెలింగ్,  స్టోన్ ప్లాంటేషన్ పనులపై ఆయన నిశితంగా సమీక్షించి, వాటిని ముమ్మరం చేసేందుకు కార్యాచరణను, ఎదురౌవుతున్న చిన్న చిన్నసమస్యలనుఅధిగమించేందుకు పరిష్కారాలను అధికారులకు సూచనలు జారీ చేశారు.  లబ్ధిదారులు గృహ నిర్మాణానికి చొరవ చూపని చోట్ల అందుకు గల కారణాలను విశ్లేషించి, అవరోధాలను, సంశయాలను తొలగించాలని,  అందరూ  ఇళ్లు నిర్మాణాలు సత్వరం చేపట్టేలా చైతన్య పరచాలని  మంత్రి రాజా అధికారులను కోరారు.   పేద ప్రజలందరికీ  గృహ  కల్పన లక్ష్యం నెరవేర్చే దిశగా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని, ఇందుకు హౌసింగ్, రెవిన్యూ ఇతర  ఇంజనీరింగ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ప్రస్తుత సీజన్ గృహ నిర్మాణానికి అత్యంత అనువైన సమయని, పనులు ముమ్మరంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా కలెక్టరు కృతికా శుక్లా మాట్లాడుతూ సమీక్షలో మంత్రి సూచించిన అంశాలపై ఆయా శాఖలు సమన్వయంతో త్వరితగతిన చర్యలు చేపట్టి సకాలంలో లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
      
     ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ బి సుధాకర్ పట్నాయక్, పెద్దాపురం ఆర్డీవో జే సీతారామరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, డీఆర్డీఏ పీడీ కె శ్రీరమణి,  పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు, తుని కమిషనర్ ప్రసాద్ రాజు, తుని నియోజకవర్గ  మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.