- విత్తనాలు మొలకెత్తిన వారం పది రోజులలో మనకు కనిపించే చిన్నచిన్న ఆకులతో వచ్చిన మొక్కలను మైక్రోగ్రీన్స్ అంటాము. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొంతకాలంగా జనంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. కల్తీలేని.. ఆర్గానిక్ ఆహారాలపైకి దృష్టి మళ్లింది. పోషకాలు పుష్కలంగా ఉండే ఆర్గానిక్ ఆహార పదార్థాలుగా ప్రథమ స్థానంలో నిలిచేవే ఈ మైక్రోగ్రీన్స్. అపార్ట్‌మెంట్ కల్చర్ పెరిగిన తర్వాత మట్టి లేకుండా కూడా మొక్కలను పెంచే విధానాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ మైక్రోగ్రీన్స్‌ని కొద్దిగా శ్రద్ధ.. కొద్ది చోటులో.. కొద్దిగా నీటితో.. పెంచుకోవచ్చు. అయితే తయారైన వెంటనే వీటిని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చాలా వరకు సలాడ్స్‌లోనే ఉపయోగించే మైక్రోగ్రీన్స్‌తో మరికొన్ని రుచులు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
- చపాతీ..
కావలసినవి : గోధుమపిండి - కప్పు, చియా, ఆవ, మెంతి, సోయా మైక్రోగ్రీన్స్ పేస్ట్ - కప్పు, ఉప్పు - తగినంత, నూనె - స్పూను
తయారీ : ముందుగా మైక్రోగ్రీన్స్‌ను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వెడల్పు గిన్నెలో గోధుమపిండి, మైక్రోగ్రీన్స్ పేస్ట్, ఉప్పు వేసి ముద్దగా కలపాలి. ఇంకా అవసరమైతే కొంచెం నీరు చిలకరించుకుని అరచేతితో బాగా వత్తుకుంటూ ముద్ద చేసుకోవాలి. ఈ ముద్దకు నూనె రాసి పది నిమిషాలు తడి గుడ్డ కప్పి ఉంచాలి. తర్వాత చపాతీ చేసుకుని కాల్చుకోవడమే. దీనిలోకి మైక్రోగ్రీన్స్, ఆలు కూర చేసుకోవచ్చు.
కూర : తాలింపులో ఉల్లిపాయ వేగిన తర్వాత ఉడకబెట్టిన బంగాళాదుంప ముక్కలు వేయించుకుని, మైక్రోగ్రీన్స్ తరుగు, ఉప్పు, కారం చల్లి నిమిషంపాటు తిప్పుతూ వేయించాలి. అంతే ఆకుపచ్చని ఆరోగ్యకరమైన మైక్రోగ్రీన్స్ చపాతీ కూరతో రెడీ.
(ఇలాగే ఇతర కూరల్లోనూ, పప్పులోనూ ఈ మైక్రోగ్రీన్స్ చేర్చుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికరమైన ఆహారం మన సొంతం)
- మొలకెత్తేదిలా..
మట్టి అస్సలు లేకుండా పాత ప్లాస్టిక్ బాక్సుల్లో టిస్యూ పేపర్లుంచి.. నీరు చిలకరించి విత్తనాలు చల్లి మూత పెట్టేస్తే.. ముప్పైఆరు గంటల్లో మొలకలొస్తాయి. ఉదయం, సాయంత్రం అలాగే చేస్తుంటే మూడు నాలుగు రోజులకు చిన్నచిన్న ఆకులు ఏర్పడతాయి. అప్పటివరకూ మొక్కలపై నీరు చిలకరిస్తూ.. అడుగున నీరు ఏమాత్రం నిల్వ లేకుండా చూడాలి. వారం పదిరోజుల్లో వాడుకునేందుకు వీలుగా మైక్రోగ్రీన్స్ తయారవుతాయి. ఇలా చేస్తే అందరికీ అనుకూలం.. తేలిక.. ఆరోగ్యం.. మరి చేసేద్దామా!
- జూస్..
కావలసినవి : మైక్రోగ్రీన్స్-కప్పు, తేనె-స్పూను, నీరు - 2 కప్పులు, జీరాపొడి-1/2 స్పూను
తయారీ : ఏవైనా రెండు, మూడు రకాల మైక్రోగ్రీన్స్ (గోధుమ, చియా, ఆవాలు, మెంతులు..) అన్నింటినీ నీరు పోసి, మిక్సీ పట్టి వడకట్టాలి. దానిలో తేనె, జీరాపొడి వేసి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. తేనె గానీ, బెల్లం పొడిగానీ కలుపుకోవచ్చు.
- ఆమ్లెట్..
కావలసినవి : గుడ్లు - 6, మైక్రోగ్రీన్స్, కొత్తిమీర తరుగు - కప్పు, ఉల్లికాడల తరుగు - 2 స్పూన్లు, టమోటా-1, కరివేపాకు- రెండు రెబ్బలు, ఉల్లిపాయ -1, ధనియాల పొడి - 1/2 స్పూను, జీలకర్ర పొడి - 1/2 స్పూను, కారం - స్పూను, పసుపు - స్పూను, ఉప్పు, నూనె- తగినంత
తయారీ : ముందుగా గుడ్లు, పంచదార పొడి జార్‌లో వేసి, నురగ వచ్చేలా మిక్సీ పట్టి పక్కనుంచాలి. బాండీలో రెండు స్పూన్లు నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి నిమిషం పాటు వేయించాలి. తర్వాత బాగా సన్నగా తరిగిన టమోటా ముక్కలు, కారం వేసి ఒకసారి తిప్పి, మూతపెట్టి మగ్గనివ్వాలి. బాండీలో టమోటా ముక్కలు మగ్గి ఉంటాయి. దానిలో చాలా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, మైక్రోగ్రీన్స్, కొత్తిమీర, ఉల్లికాడలు, కరివేపాకును వేసి ఒకసారి తిప్పి, ధనియాలు జీలకర్ర పొడి చల్లాలి.
అంచుతో ఉన్న మరో పెనంలో రెండు స్పూన్ల నూనె వేడిచేసి స్టౌ సిమ్‌లో పెట్టి, మిక్సీ పట్టిన గుడ్లసొన సగం మాత్రం ఆమ్లెట్‌గా వేసి మూత పెట్టాలి. నిమిషం తర్వాత మైక్రోగ్రెయిన్స్‌తో తయారు చేసిన మిశ్రమాన్ని దీనిపై పరచాలి. ఆపైన జార్‌లో మిగిలిన సొన పొరలా పోసి మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత ప్లఫీగా పొంగి, యమ్మీయమ్మీగా ఉండే ఆమ్లెట్ రెడీ.