
న్యూయార్క్ : ఫేస్‌బుక్ మాతఅసంస్థ మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. సుమారు 11,000 మందిని తొలగించనున్నట్లు మార్చిలో మెటా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ముఖ్యంగా ఇంజీనిరింగ్‌యేతర విభాగాలైన మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ఇంజినీరింగ్, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ సహా పలు విభాగాల్లో తొలగింపులు ఉన్నట్లు సమాచారం. ఈ తొలగింపుల్లో భాగంగా భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపైనా మెటా వేటు వేసింది. పింక్ స్లిప్స్ అందుకున్న వారిలో భారత్‌లో పలువురు ఉన్నత ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ అవినాశ్ పంత్, మీడియా పార్ట్‌నర్‌షిప్స్ డైరెక్టర్ సాకేత్ ఝా సౌరభ్‌లను తొలగించినట్లు సమాచారం. భారత్‌లో మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, మానవ వనరుల విభాగాల్లో పలువురు ఉద్యోగాలు కోల్పోయారు. తొలగింపుకు గురైన ఉద్యోగులు లింక్డిన్ వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో 11,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించిన మెటా, రెండో రౌండ్ మాస్ లేఆఫ్‌లను ప్రకటించిన మొదటి అతిపెద్ద టెక్ సంస్థగా నిలిచింది. 2020లో రెట్టింపు స్థాయిలో నియామకాలను చేపట్టిన మెటా.. మరుసటి ఏడాది మధ్య నాటికి ఆ సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ఉద్యోగులను తీసివేయనున్నట్లు మార్చిలో సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. కంపెనీ రెండవ రౌండ్‌లో ఎక్కువ తొలగింపులు ఉండనున్నాయని, మేతో ముగుస్తాయని అన్నారు. ఆ తర్వాత చిన్న రౌండ్లో తొలగింపులు కొనసాగవచ్చని చెప్పారు.