Jun 12,2022 06:54

క్రికెట్‌లో చివరి బంతి వరకూ ఆడాల్సిందే. ఒక్కోసారి ఒక్క బంతే ఫలితాన్ని తారుమారు చేస్తుంటుంది. ఒక క్యాచ్‌ సైతం విజయాన్ని నిర్ణయిస్తుంది. ఒక్క క్రికెటే కాదు...ఏ ఆటలోనైనా గెలుపును నిర్ణయించేది ఆత్మవిశ్వాసం. అలాగే ఒక పుస్తకం చదివి వదిలేస్తే... ఫలితం వుండదు. అందులో మనల్ని ప్రేరేపించే విషయాన్ని గుర్తించాలి. అది సరికొత్త ఆలోచనకు, కొత్త ప్రేరణకు, నూతన అవకాశానికి నాంది కావొచ్చు. ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే అది పతనానికి దారి తీస్తుంది. అదే విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది కొత్త అవకాశాన్ని సృష్టిస్తుంది. కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పురికొల్పుతుంది. విద్యార్థులు ఏడాదంతా చదివిన చదువును ఏడాది చివరిలో మూడు గంటల్లో పరీక్షగా రాస్తారు. ఫలితాన్ని నిర్ణయించేది ఈ మూడు గంటల సమయం.
          విద్యార్థి పరీక్షలో తప్పితే.... తననే బాధ్యుడిగా చూడటం పరిపాటి. కానీ, ఆ విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేదంటే... ఆ తప్పు విద్యార్థిది మాత్రమే కాదు. విద్యార్థికి పదో తరగతి పరీక్ష... మొదటి పబ్లిక్‌ పరీక్ష. ఉత్తీర్ణుడు కావాలంటే... ఆ విద్యార్థిని సన్నద్ధం చేయాలి. ఆకళింపు చేసుకోడానికి తగిన సమయాన్నిచ్చి, పరీక్షకు కూర్చోబెట్టాలి. అలాంటప్పుడు తన బుద్ధికుశలతను, సామర్థ్యాన్ని చూపించగలుగుతాడు. కానీ, గత రెండేళ్లుగా కోవిడ్‌తో స్కూళ్లు పనిచేయలేదు. ఈ ఏడాది కూడా స్కూళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఇటువంటి సమయంలో ప్రభుత్వం, అధికారులు తగిన పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు విద్యార్థులను మానసికంగా సన్నద్ధం చేయాలి. దీనికితోడు... రాష్ట్రప్రభుత్వం ఈ సమయంలోనే సిలబస్‌లో మార్పులు, స్కూళ్ల విలీనం, ఆంగ్ల విద్యాబోధన, టీచర్ల జీతభత్యాల విషయంలో పంతానికి పోవడం వంటి అనేక చర్యలకు కారణమైంది. 'ఈ దేశంలోని యువతరం చచ్చుపడిపోవడానికిక్కడి చదువే చాలావరకు కారణం' అంటారు రచయిత్రి వసుంధర. ఇన్ని గందరగోళాల మధ్య పరీక్షలు నిర్వహించి, ఇప్పుడు తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారని విద్యార్థులను నిందించడం సబబు కాదు. ప్రభుత్వం తన తప్పిదాలను గుర్తించి, విద్యార్థులకు సరైన పద్ధతిలో తర్ఫీదునివ్వాలి. పరీక్షలో తప్పిన విద్యార్థులకు తగిన న్యాయం చేయడం ద్వారా వారిలో మానసిక స్థైర్యం నింపాలి.
        పరీక్ష... మన జీవితానికి, ఉన్నతికి, శక్తి సామర్థ్యాలకు ఓ పాఠం. అంతేతప్ప... పరీక్ష తప్పితే, మార్కులు తక్కువ వస్తే సర్వం కోల్పోయినట్లు కాదు. అసలు పదో తరగతి పాసవడం మాత్రమే జీవితానికి సంబంధించిన పరీక్ష కాదు. ఇదే జీవితానికి చివరి పరీక్ష కాదు, ముందు ముందు ఎన్నో అద్భుతమైన అవకాశాలు, సుందరమైన జీవితం వుంది. గణిత శాస్త్ర మేధావి రామానుజన్‌ చదువులో వెనుకబడి వుండేవాడు. అయినా ఎప్పుడూ నిరాశ చెందలేదు. చివరకు గణితంలో మేధావి అయ్యాడు. అబ్దుల్‌ కలాంకు చిన్నప్పుడు మార్కులు ఎక్కువగా వచ్చేవి కావు. కానీ ఆయన గొప్ప శాస్త్రవేత్త, రాష్ట్రపతి అయ్యారు. భారతరత్న అవార్డు సైతం ఆయనను వరించింది. వీరే కాదు...పదో తరగతి, ఇంటర్‌ తప్పి కూడా...కలెక్టర్‌, గ్రూపు-1 అధికారులయిన వారెందరో వున్నారు. అసలు ఎప్పుడూ స్కూలుకే వెళ్లని లతా మంగేష్కర్‌ గానకోకిల అయ్యారు. దాదాసాహెబ్‌ ఫాల్కే, భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. క్రికెట్‌ దేవుడు అని అభిమానులు పిలుచుకునే సచిన్‌ టెండూల్కర్‌ పదో తరగతి తప్పాడు. సచిన్‌ సైతం పద్మశ్రీ, పద్మవిభూషణ్‌, భారతరత్న వంటి పురస్కారాలను అందుకున్నాడు. 'చదువు ప్రతిభను రాణింపజేసే ఒక సాధనమే కానీ, దానికి కారణమూ కాదు, ఫలితమున్నూ కాదు' అంటాడో రచయిత. పదో తరగతి తప్పినంత మాత్రాన జీవితం ముగిసిపోలేదు. ఓ నూతన ప్రపంచం, సుందర భవిత ఎదురుచూస్తున్నది మీకోసం. ఆ భవితవైపు దృష్టి మరల్చాలేగాని, కుంగిపోవద్దు... ఆత్మహత్యలకు పాల్పడవద్దు. తల్లిదండ్రుల ఆశలను నీరుగార్చొద్దు. అలాగే... పిల్లల చుట్టూ ఒక సుహృద్భావ వాతావరణం, చదువుకోవాలన్న ఆకాంక్షలను కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులది. అలాంటి పరిస్థితి ఏర్పర్చవలసిన కర్తవ్యం ప్రభుత్వానిది.