అమరావతి : కొన్ని చోట్ల ఘర్షణలు.. మరికొన్ని చోట్ల నిర్బంధాలు.. కొన్ని చోట్ల నేతల హడావుడి.. మరికొన్ని చోట్ల ఓటర్లకు ప్రలోభాలు.. కొంచెం ప్రశాంతం.. మరికొంత అత్యుత్సాహం.. అన్నట్లుగా ఎపిలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో 2,723 పంచాయతీలు, 20,157 వార్డు స్థానాలకు తొలిదశ పోలింగ్ జరిగింది. 168 మండలాల్లో జరిగిన పోలింగ్‌లో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగింసింది. సాయంత్రం 4 గంటల తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. క్యూలైన్‌లో ఉన్నవారికి సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్క వినియోగించే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 75.55 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా 'నోటా'ను అందుబాటులోకి తెచ్చారు. కరోనా పాజిటివ్ బాధితులకు పిపిఇ కిట్లతో చివరిలో గంటసేపు అవకాశం కల్పించారు.
అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు..
- చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్ పురం మండలం కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకుంది. కొత్తపల్లిమిట్ట ఐదో నెంబరు బూత్‌లో కొందరు నీళ్లుపోసినట్టు ఆరోపణలు రావడంతో అక్కడ పోలింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ ఘటనపై పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- వెదురుకుప్పం పోలీసు స్టేషన్ ఎదుట పోలింగ్ ఏజెంట్లు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ మద్దతుదారులు దాడి చేసి పోలింగ్ బూత్ నుంచి బయటకు లాగేశారని మాంబేడు, ఆర్కే పురం ఏజెంట్లు నిరసన వ్యక్తం చేశారు.
- తంబళ్లపల్లె నియోజకవర్గంలో అభ్యర్థుల తుది జాబితా ప్రచురించలేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఎస్‌ఈసీకి లేఖ రాశారు.
- గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులో ఎస్‌ఐ రాజేశ్‌లో వైసిపి నేతలు వాగ్వాదానికి దిగారు. బయట నుంచి వచ్చివారిని అనుమతించాలని పట్టుబట్టారు.
- కర్నూలు జిల్లా గోస్పాడు మండలంలో కానాపల్లి కాంగ్రెస్, వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో తనపై దాడిచేశారంటూ ఓ మహిళ గోస్పాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
- కడప ఖాజీపేట మేజర్ పంచాయతీ పోలీంగ్ కేంద్రం వద్ద వైసిపి వర్గీయుల మధ్య వాగ్వాదం. డిఎల్ రవీంద్రారెడ్డి, ఆయన ప్రత్యర్థి వర్గాల మద్దతుదారులు మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.
- విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం పెదపాడు 10 వార్డులో ఓటర్లు ఆందోళన చేపట్టారు. స్వస్తిక్ గుర్తువిరిగిపోవడంతో చెక్కను రంగులో ముంచి ఓట్లేశారు.
- తూర్పు గోదావరి జిల్లా ఉప్పలపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
- గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికిపాడులో పోలింగ్ ఏజెంట్ గుండెపోటుతో మృతిచెందాడు. 3వ బూత్‌లో పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న మస్తాన్ వలీ (44) గుండెపోటకు గురికావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
- కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ముత్తలూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాలు పరస్పర దాడులకు దిగాయి.
- చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కమ్మ కండ్రిగలో నిరసన చేపట్టారు. ఓటర్ స్లిప్‌పై ఎన్నికల గుర్తు రాసి పంపుతున్నారని, ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు.
- నెల్లూరు జిల్లా వరికుంటపాడులో ఓటర్ల ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియను బహిరంగంగా పెట్టడంపై అభ్యంతరం తెలిపారు.
- పశ్చిమ గోదావరి జిల్లాలోని వడ్డిగూడెం, బొప్పనపల్లిల్లో వార్డు సభ్యులకు గుర్తుల కేటాయింపులో జరిగిన పొరపాటు కారణంగా అక్కడ వార్డు ఎన్నికలు నిర్వహించడం లేదు. రెండో దశకు వాయిదా వేశారు.
- విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని పెదమల్లంలో ఏజెంట్ల మధ్య ఘర్షణ చటుచేసుకుంది. రెండు పార్టీలకు చెందిన ఏజెంట్లు పరస్పరం దాడికి దిగారు. దీంతో వైసిపి ఏజెంట్ పవన్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని ఐదో నెంబర్ పోలింగ్ బూత్ వద్ద సర్పంచ్ అభ్యర్థి శీలం రంగారావు గుర్తు వంకాయ కాగా, ఆ గర్తుపై అధికారులు నోటా అంటించారు.
- వెదురుకుప్పం మండలం బొట్లవారిపల్లిలో వైసీపీ నేత నారాయణ రెడ్డిని గ్రామంలో నిర్బంధించిన స్థానికులు. ఓటర్లను ప్రలోభ పెడుతున్నాడన్న ఆరోపణలపై ఏకమైన గ్రామస్తులు. గ్రామంలోని వీధుల్లో ముళ్ళ కంచె వేసి నిరసన. ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించిన పోలీసులు. జక్కదోన పంచాయతీకి చెందిన వారికి తమ పంచాయతీలో పనేమని నిలదీసిన బొట్ల వారి పల్లి గ్రామస్థులు.
- ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలో సూదివారిపాలెంలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. సర్పంచ్ అభ్యర్థి తరుపున డబ్బులు పంచుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా ఇద్దరి నుంచి రూ.32,500 స్వాధీనం చేసుకున్నారు.
- ప్రకాశం జిల్లా కూనంనేనివారిపాలెంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేసే విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. పరస్పరం దాడులకు దిగాయి.
- కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జూలూరుపాడు పంచాయతీలో హై టెన్షన్ నెలకొంది. పోలింగ్ జరుగుతున్న తొమ్మిదో వార్డులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం వివాదానికి దారితీసింది. నాయకులు పరస్పరం తోపులాడుకున్నారు.
- కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ముత్తలూరు పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారని ఒకరిపై మరొకరు ఆరోపించుకున్నారు. దీంతో స్పల్ప ఘర్షణ చోటు చేసుకుంది.
- అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పోతుకుంటలో ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరి ఓటు మరొకరు వేసేందుకు వచ్చారని వివాదం చెలరేగింది. దీంతో పోతుకుంటలో ఏజెంట్లు పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
- కృష్ణా జిల్లా మైలవరం మండలం మొర్సుమల్లిలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.














