
తాము అన్ని మతాలను గౌరవిస్తామని మోడీ ప్రభుత్వం చెబితే సరిపోదు. అన్ని రకాలుగా ముస్లింలను సమాన పౌరులుగా పరిగణిస్తామని, ముస్లిం వ్యతిరేక కార్యకలాపాలను చట్ట ప్రకారం అణచివేస్తామని ఈ దేశానికి, యావత్ ప్రపంచానికి హామీ ఇవ్వాల్సి వుంది. కానీ, ఇంత స్పష్టంగా చెప్పడం లేదంటే - బిజెపి, ప్రభుత్వం కేవలం తాత్కాలికంగా, విదేశాల నుండి తలెత్తిన దౌత్య ఆగ్రహాన్ని తగ్గించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నాయని అర్ధమవుతోంది. తర్వాత మళ్లీ ముస్లింలను ఎరగా వేసే చర్యలకు సిద్ధమవుతుంది.
బిజెపి, మోడీ ప్రభుత్వం తమ సొంత బాంబును తామే పేల్చుకున్నాయి. ఒక పద్ధతి ప్రకారం ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని సాగించిన తర్వాత, ఇస్లామోఫోబియాను రెచ్చగొట్టిన తర్వాత అటు ప్రభుత్వం, ఇటు పాలక పార్టీ రెండూ పలు ముస్లిం దేశాల నుండి దౌత్యపరమైన ఆగ్రహావేశాలను ఎదుర్కొన్నాయి. యుఎఇ, కతార్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియా, మలేషియా, టర్కీ దేశాలు తమ నిరసన తెలియచేశాయి.
జాతీయ స్థాయిలో బిజెపి ప్రతినిధి నూపుర్ శర్మ, ఢిల్లీ బిజెపి ప్రతినిధి నవీన్ జిందాల్ వీరిరువురు వరుసగా జాతీయ టెలివిజన్ లోనూ, సోషల్ మీడియా లోనూ మహ్మద్ ప్రవక్తను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు. మే 27న నూపుర్ శర్మ జుగుప్సాకరమైన రీతిలో ఈ వ్యాఖ్యలు చేయగా వాటికి పార్టీలోనే తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కానీ ముస్లింలు, లౌకికవాద సంస్థలు వెలిబుచ్చిన నిరసనలను బిజెపి నిర్లక్ష్యం చేసింది.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాన్పూర్‌లో తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగాయి. దాంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఉక్కు పాదంతో వాటిని అణచివేశారు. డజన్ల సంఖ్యలో ముస్లింలను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు.
కానీ జూన్ 5న, కతార్ ప్రభుత్వం భారత రాయబారిని పిలిపించి తమ నిరసన తెలియచేసింది. ఆ తర్వాత కువైట్ ఇతర గల్ఫ్ దేశాలు కూడా అదే బాటలో పయనించాయి. దాంతో బిజెపి ఇక స్పందించక తప్పలేదు. నూపుర్ శర్మను పార్టీ నుండి సస్పెండ్ చేసింది, నవీన్ జిందాల్‌ను పార్టీ నుండి బహిష్కరించింది.
మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అభిప్రాయాలు కాదని, ఏదో చోటా మోటా నేతలవి అంటూ కతార్ లోని భారత రాయబారి ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనలోని కపటత్వం స్పష్టంగా కనిపిస్తోంది. పాలక పార్టీ అధికార ప్రతినిధినే చిన్నా చితకా వ్యక్తులుగా పేర్కొనడం ద్వారా పార్టీ తనను తానే ఖండించుకుంది. పార్టీ ప్రధాన స్రవంతిలో వున్న వారిని కింది స్థాయి వ్యక్తులుగా నిర్ధారించింది. వాస్తవానికి, బిజెపి ప్రకటిత హిందూత్వ సిద్ధాంత భావజాలంలో ఇస్లామోఫోబియా అంతర్లీనంగా వుంది.
ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని సాగించడమనేది బిజెపి అధికారిక వైఖరిలో భాగం. నూపుర్ శర్మ దుర్మార్గపు వ్యాఖ్యలు వెలువడగానే, మరో బిజెపి నేత, ఎంపి, బిజెపి యువ మోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య ఆస్ట్రేలియాలో మాట్లాడుతూ, భారతదేశంలో ముస్లింల విజయం 'ప్రపంచ చరిత్ర లోనే అత్యంత రక్తపాతంతో కూడిన అధ్యాయం' అని వ్యాఖ్యానించారు. ఇస్లామ్ చరిత్ర రక్తపాతంతో, హింసతో రాయబడిందని పేర్కొన్నారు. దీంతో ముస్లిం విద్యార్థి సంఘాలు, పౌరహక్కుల గ్రూపులు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేయడంతో అధికారిక కార్యక్రమమైన 'ఆస్ట్రేలియా-భారత్ యూత్ డైలాగ్'కు ఆయన దూరంగా వుండాల్సి వచ్చింది.
57 సభ్య దేశాలు కలిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసి) సెక్రటేరియట్ విడుదల చేసిన ప్రకటనను విదేశాంగ శాఖ ప్రతినిధి తోసిపుచ్చారు. ఆ ప్రకటన మతోన్మాదంతో ప్రేరేపితమైనదని ఆయన వ్యాఖ్యానించారు. నిందాపూర్వకమైన ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని ఓఐసి తన ప్రకటనలో కచ్చితంగా పేర్కొన్నందున ఇటువంటి తీవ్ర ప్రతిస్పందన వెలువడింది. ''పెరుగుతున్న విద్వేషం, ఇస్లామ్‌ను అవమానించడంలో భాగంగా, భారతీయు ముస్లింలకు వ్యతిరేకంగా ఒక పద్ధతి ప్రకారం సాగుతున్న చర్యలు-ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థల్లో హిజాబ్‌ను ధరించడాన్ని నిషేధించాలన్న నిర్ణయాలు, ముస్లిమ్‌ల ఆస్తులను ధ్వంసం చేయడం, వారిపై పెరుగుతున్న హింస'' నేపథ్యంలో చోటు చేసుకున్నవే పాలక పార్టీ ప్రతినిధి చేసిన ఈ వ్యాఖ్యలను ఓఐసి తన ప్రకటనలో పేర్కొంది. ఈ వాస్తవాలన్నింటినీ ఆ ప్రకటన వివరంగా పేర్కొన్నందున, మోడీ ప్రభుత్వం ఆ విధమైన ఉద్వేగంతో సమాధానమిచ్చింది.
ముస్లిం వ్యతిరేక ఎజెండా దేశ సమైక్యతపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అన్ని రకాలుగా తీవ్రవాద హింస ప్రజ్వరిల్లే అవకాశముంది. జమ్మూ కాశ్మీర్‌లో అత్యంత ప్రమాదకరమైన రూపంలో దీన్ని చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని, దానికున్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం కాశ్మీరీ ముస్లింలను, కాశ్మీరు లోయ లోని ప్రధాన రాజకీయ పార్టీలను చిన్న చూపు చూసేందుకు కారణమైంది. లోయ లోని ప్రజల ప్రాథమిక హక్కులను దారుణంగా అణచివేస్తున్నారు. ఈ పరిస్థితులు కాశ్మీరీ పండిట్లను, వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిస్ట్ తీవ్రవాదులు లక్ష్యిత దాడులకు పాల్పడేందుకు, వారిని చంపేందుకు దారితీశాయి. ఫలితంగా, మోడీ ప్రభుత్వం చేపట్టిన జమ్మూ కాశ్మీర్ విధానం చిన్నాభిన్నంగా మారింది. మతోన్మాదం ఫలితాలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు మత భావాలను లేదా మత సామరస్యతను దెబ్బ తీస్తున్నారన్న అభియోగాలపై పలువురు ముస్లింలను గతంలో అరెస్టు చేశారు. కానీ నూపుర్ శర్మపై గానీ నవీన్ జిందాల్‌పై గానీ అటువంటి చర్యలేమీ తీసుకోలేదు. బదులుగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు, నూపుర్ శర్మకు బెదిరింపులు వస్తున్నాయంటూ పోలీసు రక్షణ కల్పించారు.
నూపుర్ శర్మ పార్టీ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడం బిజెపి కార్యకర్తలకు, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుదారులకు అస్సలు రుచించడం లేదనేది స్పష్టమవుతోంది. కేవలం విదేశీ ఒత్తిళ్ళ కారణంగానే బిజెపి నాయకత్వం ఈ కంటితుడుపు చర్య అయినా తీసుకుంది. పార్టీ నాయకత్వం చేసిన ప్రకటన ఈ వ్యాఖ్యలను నిర్ద్వంద్వంగా ఖండించనూ లేదు, ఆమె వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పనూ లేదు.
తాము అన్ని మతాలను గౌరవిస్తామని మోడీ ప్రభుత్వం చెబితే సరిపోదు. అన్ని రకాలుగా ముస్లింలను సమాన పౌరులుగా పరిగణిస్తామని, ముస్లిం వ్యతిరేక కార్యకలాపాలను చట్ట ప్రకారం అణచివేస్తామని ఈ దేశానికి, యావత్ ప్రపంచానికి హామీ ఇవ్వాల్సి వుంది.
కానీ, ఇంత స్పష్టంగా చెప్పడం లేదంటే - బిజెపి, ప్రభుత్వం కేవలం తాత్కాలికంగా, విదేశాల నుండి తలెత్తిన దౌత్య ఆగ్రహాన్ని తగ్గించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నాయని అర్ధమవుతోంది. తర్వాత మళ్లీ ముస్లింలను ఎరగా వేసే చర్యలకు సిద్ధమవుతుంది. కానీ, మోడీ ప్రభుత్వం, బిజెపి హిందూత్వ ఎజెండాపై అంతర్జాతీయంగా నిశిత పరిశీలన పెరుగుతోందని నూపుర్ శర్మ అధ్యాయం స్పష్టం చేస్తోంది. చిమ్మ చీకటిలో, గుడ్డి వెలుతురులో ''విశ్వగురు''ను ప్రపంచం వీక్షిస్తోంది.
/ 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం /