Jun 01,2023 13:20
  •  కేంద్ర కార్మికసంఘాల విమర్శ

ప్రజాశక్తి-కాకినాడ : మహిళా మల్లయోధులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిడ్జిభూషణ్ చరణ్ సింఘ్ తక్షణం అరెస్టు చేయాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని, నిరసన తెలియజేసే రాజ్యాంగ హక్కుని కాపాడాలని, కోరుతూ కేంద్ర కార్మికసంఘాల ఆధ్వర్యంలో ఇంద్రపాలెం లాకుల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐ.ఎన్.టి.యు.సి ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, టిఎన్టియుసి నాయకులు రాజారావు మాట్లాడుతూ 50 రోజులుగా ఢిల్లీ నడిబొడ్డున మాపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిడ్జి భూషణ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళ మల్లయోధులు పోరాడుతున్నారని, 38 కేసుల్లో హత్య, కిడ్నాప్, అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ ని ఆర్ఎస్ఎస్, బిజెపి, మోడీ ప్రభుత్వం కాపాడుతూ దేశానికి ప్రతిష్ట తెచ్చిన మహిళా రెజ్లర్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కి అధ్యక్షుడిగా ఉన్న బిజెపి ఎంపీ తన కుటుంబ పరివారాన్ని మొత్తం రెజ్లింగ్ ఫెడరేషన్ లో ఉన్నత స్థానాల్లో నియమించి తన కనుసన్నల్లో రెజ్లింగ్ ఫెడరేషన్ నడిచేలా ఏర్పాటులు చేసుకున్నాడని విమర్శించారు. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య పోరాడుతున్న మల్లయోధులకు మద్దతు తెలియజేస్తూ తక్షణం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఎన్నికలు తక్షణం నిర్వహించని పక్షంలో ప్రపంచ పోటీల నుండి బహిష్కరిస్తామని హెచ్చరిక చేయడాన్ని గుర్తుచేశారు. మహిళా రెజ్లర్లు సాధించిన పథకాలను చూసి మురిసిపోయిన భారతీయులందరూ కూడా ఆ మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల బాధను కూడా అర్థం చేసుకోని వారికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేసారు. తమ జీవితాంతం కష్టపడి సాధించిన మెడాల్ ను సైతం గంగా నదిలో కలపాలని రెజ్లర్లు తీసుకుని నిర్ణయం పట్ల కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం మహిళల పట్ల, లైంగిక వేధింపులు పట్ల ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మనుధర్మ శాస్త్రం ప్రకారం బిజెపి ప్రభుత్వం పరిపాలిస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని తెలిపారు. బిజెపి, ఆర్ఎస్ఎస్, మోడీ అవలంభిస్తున్న మహిళా వ్యతిరేక వైఖరితో దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా మంట కలుపుతున్నారని, తక్షణం లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ పై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. కార్పొరేట్ కనుసన్నల్లో నడిచే జాతీయ మీడియా మహిళా రెజ్లర్ల పోరాటాన్ని విస్మరించడం, మోడీ ప్రభుత్వానికి భయపడి ప్రసారం చేయకపోవడం భారత ప్రజాస్వామ్యానికి తీవ్ర హాని చేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో రైతులు కార్మికులు, విద్యార్థులు సంఘాలతో కలిసి ఉదృత పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడకొండ, ఏఐటియుసి నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, మహిళా సమాఖ్య నాయకురాలు లోవరత్నం, నగర అధ్యక్షులు జి అన్నవరం, సెక్యూరిటీ గార్డ్ యూనియన్ నాయకులు రామయ్య, కాశీ విశ్వనాథ్, సిఐటియు నగర ఉపాధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు వేణి, నాగబత్తుల సూర్యనారాయణ, అమృత, అభ్యద్,  టిఎన్టియుసి నాయకులు రేవు సురేష్, కొప్పాడ సత్తిబాబు, మల్లవారపు రాజు, ఐఎఫ్టియు నాయకులు బంగారు సత్యనారాయణ, గరగా దుర్గబాబు, శ్రీపాదం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు