
సైబర్ క్రైమ్ ఆఫీస్ చాలా ప్రశాంతంగా ఉంది. వెయిటింగ్ హాల్లో ఎస్‌ఐ గారి కోసం వెయిట్ చేస్తున్న ప్రణవి గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటూ అలజడి ఆవహించిన కళ్లతో దిగాలుగా కూర్చుంది.
''ఏం కాదు ఊరికే టెన్షన్ పడకే!'' అని ధైర్యం చెప్తుంది వెంట వచ్చిన తన స్నేహితురాలు ఇందు.
''అది కాదే! ఇంట్లో కూడా చెప్పలేదు తెలిస్తే ఇంక అంతే...!'' అని కంగారు పడుతుంది ప్రణవి.
ఇంతలో ఎస్‌ఐ వస్తూ హాల్లో ఉన్న ప్రణవి, ఇందుల వైపు చూస్తూ తన చాంబర్లోకి వెళ్ళిపోతాడు.
రెండు నిమిషాల తర్వాత కానిస్టేబుల్ వచ్చి ''ఎస్‌ఐ గారు అయిదు నిమిషాల తర్వాత మాట్లాడతారంట!'' అన్నాడు.
దాంతో ప్రణవి ఇంకొంచెం కంగారుగా ''చూస్తుంటే చాలా సీరియస్ అయ్యేటట్లు వుందే!'' అని ఇందుతో అంటుంది.
''అబ్బా..! ఏం కాదని చెప్పానా! ఊరికే నువ్వు టెన్షన్ పడి - నన్ను టెన్షన్ పెట్టకే!'' అని ఇందూ ప్రణవికి ధైర్యం చెప్తుందేకానీ లోపల తనూ కంగారు పడుతుంది.
***
ప్రణవిది విజయవాడ. అక్కడే ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తల్లిదండ్రులు చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్. అందుకే ఇంటర్మీడియట్ అయ్యేవరకూ ప్రణవికి ఫోన్ కూడా కొనియ్యలేదు. ఇంజినీరింగ్‌లో చేరిన తర్వాతే ప్రణవికి ఫోన్ కొనిచ్చారు. కరోనా కారణంగా కాలేజీలకు సెలవు కావడంతో ఇక ఫోన్‌తోనే ఎక్కువ సమయం గడిపేది. సోషల్ మీడియా హద్దులేంటో పెద్దగా ప్రణవికి తెలియకపోవడం.. కొత్తఫోన్ కావడంతో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా అన్నింటిలో అకౌంట్స్ ఓపెన్ చేసింది. ఇక అదే లోకం.. అందులో పాత ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్‌తోనే చాటింగ్ చేస్తూ గడిపేది.
లాక్‌డౌన్‌తో ప్రణవి ఇంట్లోనే ఉండిపోయిందనీ.. తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అలా కొన్ని రోజులు గడిచింది.
***
ఒకరోజు రాత్రి పన్నెండు గంటలకి గుర్తు తెలియని నంబర్ నుంచి ''హారు బేబీ! వాట్ ఈజ్ యువర్ రేట్ ఫర్ ఫుల్‌నైట్?'' అని మెసేజ్ వచ్చింది. అది చూసి ప్రణవికి గుండె ఆగినంత పనయింది. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి.
''అసలు ఎవరు చేసుంటారు? నా నంబర్ ఎవరిచ్చారు? ఎవరైనా కావాలనీ చేశారా?'' ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ.. వెంటనే ఆ మెసేజ్ వచ్చిన నంబర్‌ని బ్లాక్ చేసి, డిలీట్ చేసింది. రాంగ్ నంబర్ అయుంటుందని తనకి తాను సమాధాన పరుచుకొని, కొంచెం గుబులుగానే నిద్రపోయింది.
తెల్లారి ఉదయం కొంచెం భయం భయంగానే తడబడుతూ ఫోన్ ఓపెన్ చేసింది. మళ్లీ అదే అర్థం వచ్చేలా వేరే నంబర్ల నుంచి రెండు మెసేజ్‌లు వచ్చాయి. ఇక ప్రణవికి కాళ్లూచేతులు ఆడలేదు. అసలు విషయమేంటో కనుక్కుందామని ''ఎవరు మీరు? నా నెంబర్ ఎవరిచ్చారు?'' అని మెసేజ్ చేసింది.
''మీరు ప్రియాశర్మ కాదా..?'' అని అవతల నుంచి ప్రశ్న.
''కాదు.. మీరు రాంగ్ నంబర్‌కి చేశారు'' అని బదులిచ్చింది ప్రణవి.
కాసేపటి తర్వాత అదే నెంబర్ నుంచి అర్ధనగంగా ఉన్న ఒక అమ్మాయి ఫోటో కింద ప్రణవి నెంబర్‌ని జత చేసిన పోస్ట్‌ని స్క్రీన్‌షాట్ తీసి, మెసేజ్ చేశాడు అవతల వ్యక్తి. అది చూశాక, ఎవరో నా నెంబర్ తీసుకొని, ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అర్థమైంది ప్రణవికి.
అయితే విషయాన్ని ఇలా వదిలేస్తే తర్వాత మరిన్ని సమస్యలు వస్తాయనే ఆలోచన కాసేపు ప్రణవి మనసుని తొలిచేసింది. ఇంట్లో చెబుదామంటే ఏమంటారోనని భయం. చెప్తే నాన్న కచ్చితంగా కాలేజీ మాన్పించేసి, ఇంట్లో కూర్చోబెడతారు. అందుకే ఆ ఆలోచన మానుకుంది. కాసేపయ్యాక తన క్లోజ్ ఫ్రెండ్ ఇందూకి కాల్ చేసి, జరిగిందంతా చెప్పింది. విషయం అర్థమైన ఇందూ ''వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం బెటర్!'' అంది.
అది వినగానే ప్రణవి కొంచెం భయపడి ''వద్దు'' అంది.
కానీ ఇందూ ''నో ప్రాబ్లెమ్ మన డీటెయిల్స్ సీక్రెట్‌గానే ఉంచుతారు పోలీస్‌లు. ఏం కాదు కంప్లయింట్ చేద్దాం'' అని ప్రణవిని ఒప్పించింది ఇందు.
అలా నెల క్రితం సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. ఆ విషయమై మాట్లాడటానికి ఎస్‌ఐ గారు రమ్మని ఫోన్ చేస్తే ఇలా ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కి వచ్చారు.
***
ఐదు నిమిషాల తర్వాత కానిస్టేబుల్ వచ్చి శానిటైజర్ ఇచ్చి ''సార్! పిలుస్తున్నారు చేతులు శానిటైజ్ చేసుకొని, వెళ్లండి'' అని అన్నాడు.
''సరే'' అని ఇద్దరూ చేతుల్ని శానిటైజ్ చేసుకొని, లోపలికెళ్లారు.
వెళ్లగానే ఎస్‌ఐ ఇద్దర్నీ కూర్చోమని, ప్రణవి వైపు చూస్తూ ''నీకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయా..?'' అడిగారు ఎస్‌ఐ.
''హా! ఉన్నాయి సర్! కానీ ఇది జరిగాక డి అక్టీవ్ చేశాను సర్'' వణుకుతున్న గొంతుతోనే సమాధానం చెప్పింది ప్రణవి.
''ఓకే.. రెండింట్లో కలిపి ఎంతమంది ఫ్రెండ్స్ ఉండుంటారు సుమారుగా..?'' అడిగాడు ఎస్‌ఐ.
ప్రణవి ఇందూ వైపు చూస్తూ ''ఒక.. ఫిఫ్టీన్ హండ్రెడ్ మంది ఉండొచ్చు సర్'' అంది
వెంటనే ఎస్‌ఐ ''అందులో తెలిసినవాళ్ళు ఎంతమంది?'' అడిగాడు.
''అరవై, డెబ్బై మంది ఉంటారు సర్ అంతే!'' చెప్పింది ప్రణవి.
ఆ సమాధానం విని ఎస్‌ఐ నొసలు చిట్లిస్తూ కొంచెం ఆశ్చర్యం ప్రదర్శిస్తూనే.. చిన్ననవ్వు నవ్వి ''మీరిచ్చిన క్లూస్‌తో మా వాళ్లు ట్రేస్ చేసి, ఆ ఫేస్‌బుక్ పేజ్ అడ్మిన్‌ని పట్టుకొని విచారించారు. మీ నెంబర్‌ని ఫేస్‌బుక్‌లోనే తీసుకున్నాడు'' అన్నారు.
దానికి ప్రణవి వెంటనే ''నెవర్ సర్! ఛాన్స్ లేదు. నేను అసలు దేంట్లోనూ నా నెంబర్ పోస్ట్ చెయ్యలేదు!'' అంది ప్రణవి.
''ఒకసారి బాగా గుర్తుచేసుకో!'' అన్నాడు ఎస్‌ఐ
ప్రణవి ఆలోచనలో పడింది. అలా రెండు నిమిషాల తర్వాత ఎస్‌ఐ తో ''సారీ సర్! ఒకసారి ఫ్రెండ్ ఒకరు నెంబర్ అడిగితే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేశాను సర్!'' అని చెప్తూ తలదించుకుంది.
ఎస్ ఐ రిలాక్స్‌గా కాఫీ సిప్ చేస్తూ ''అదీ విషయం..! చూడండీ ఈ వయసులో ఫ్రెండ్స్, వాట్సాప్, ఫేస్‌బుక్, చాటింగ్స్ మామూలే కావచ్చు. తప్పు కాదు కూడా. కానీ మన ప్రైవసీ కూడా చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా అనేది మరో ప్రపంచం లాంటిది. ఇందులో బయట సమాజంలో ఎలాంటి మోసాలు, నేరాలు జరుగుతున్నాయో.. ఇక్కడా అలాగే.. ఇంకా చెప్పాలంటే చాలా సులువుగా మోసపోతారు. ఒకసారిగానీ మన వివరాలు అందులోకి పోయాయంటే అంతే సంగతి. ఇదిగో ఇలాంటి శాడిస్టులుంటారు. ఆ పేజ్‌లో పోస్ట్ డిలీట్ చేశాం. ఇక నో ప్రాబ్లెమ్! ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండండి. చాలా మంది భయంతో మాకు చెప్పకుండా చాలా సమస్యలు ఫేస్ చేస్తుంటారు. ఈ మొత్తం విషయంలో మీరు చేసిన మంచి పనేంటంటే వెంటనే మాకు కంప్లైంట్ చేయడం. గుడ్.. ఇక మీరు వెళ్లొచ్చు'' అన్నాడు ఎస్‌ఐ.
అది వినగానే ప్రణవి మనసు కుదుటపడింది. ''థాంక్యూ సో మచ్ సర్! ఇకనుంచి జాగ్రత్తగా ఉంటాం'' అని ప్రణవి, ఇందూ ఎస్‌ఐ కి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి బయల్దేరారు.
మళ్లీ ఎస్ ఐ వెళ్తున్న వాళ్లని ''ఒక్క నిమిషం. ఆల్రెడీ మీ నెంబర్ సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయింది. సో మీరు ఆ నెంబర్ మార్చేసి, కొత్త నెంబర్ తీసుకుంటే బెటర్'' అన్నాడు ఎస్‌ఐ.
దానికి ప్రణవి, ఇందూ చిన్న చిరునవ్వుతో ''ఓకే! సార్'' అని థమ్స్‌అప్ చూపించి, వెళ్లిపోయారు.
వెంకటేష్ పువ్వాడ
7204709732