- లక్షల ఎకరాల్లో పంటలకు దెబ్బ
- వరి, పత్తి, మిర్చి పంటలపై తీవ్ర ప్రభావం
- నష్టం అంచనాల్లో అధికార యంత్రాంగం
ప్రజాశక్తి-యంత్రాంగం : మాండూస్ తుపాను తీవ్ర నష్టాలను మిగిల్చింది. ముఖ్యంగా పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. రైతుల వెన్ను విరిచింది. తుపాను తీరం దాటిన తర్వాత కూడా వర్షాలు కూడా వర్షాలు కొనసాగి ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ముసరు వాతావరణం, చలి గాలులు మాత్రం కొనసాగాయి. తమ పొలాల్లోని పంట పరిస్థితిని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పంట నష్టాల అంచనాల్లో అధికార యంత్రాంగం ఉంది. బాపట్ల జిల్లా కృష్టా పశ్చిమ డెల్టా పరిధిలోని రేపల్లె, బాపట్ల వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో వర్షాలకు ముందు కోసి అరబెట్టిన 30 వేల ఎకరాల్లోపైగా వరి కంకులు నీట మునిగాయి. మాగాణి భూముల్లో కోసిన పరి పంట నీటిపై తేలియాడుతుంది. మరో 40 వేల ఎకరాల్లో వరి వరి పైరు వర్షం, గాలులకు ఒరిగిపోయింది. పత్తి, మినుము, మిర్చి, పసుపు, ఉద్యాన పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ప్రకాశం జిల్లాలో సాగర్ ఆయకట్టులో కోసిన వరి ఓదెలు నీటిలో తేలియాడుతున్నాయి. త్రిపురాంతకం, దర్శి, తాళ్లూరు మండలాల్లో వరికి బాగా నష్టం వాటిల్లింది. వరి ధాన్యం తడిచిపోవడంతో రంగు మారే ప్రమాదం ఉంది. పశ్చిమ ప్రాంతంలో మిర్చికి అధికంగా నష్టం వాటిల్లింది. దోర్నాల, పెద్దారవీడు ప్రాంతాల్లో మిర్చి తోటల్లో నీరు చేరింది. కాయలు రాలిపోయాయి. మినుము, బబ్బర్లు, పొగాకు పంటకూ నష్టం వాటిల్లింది.
కడప జిల్లాలోని 35 మండలాల్లో, అన్నమయ్య జిల్లాలోని ఏడు మండలాల్లో మొత్తం 9,001 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కడప జిల్లాలో పోరుమామిళ్ల, కలసపాడు, బి.కోడూరు, బి.మఠం, కాశినాయన, బద్వేల్, గోపవరం, అట్లూరు, సిద్ధవటం, ప్రొద్దుటూరు, పెద్దముడియం, మైదుకూరు, చాపాడు, వి.ఎన్‌పల్లి, వల్లూరు మండలాల్లోని సుమారు 30 రకాల పంటలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. 4,387 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 2,062 ఎకరాల్లో బుడ్డశనగ, 1,042 ఎకరాల్లో వరి, 1,235 ఎకరాల్లో జన్న పంటలు నేలకొరిగాయి. 141.5 ఎకరాల్లో పండ్ల తోటలపై ప్రభావం చూపించింది. అరటి, ఉల్లి, టమోటో పంటలకు నష్టం వాటిల్లింది. అన్నమయ్య జిల్లాలో మదనపల్లి, పీలేరు, రాజంపేట, లక్కిరెడ్డిపల్లి, మదనపల్లి, నిమ్మనపల్లి, కొరబాలకుంట, బి.కొత్తకోట, పెనగలూరు, రామాపురం మండలాల్లో వరి దెబ్బతింది.
తుపాను ప్రభావానికి తీవ్రంగా గురైన తిరుపతి జిల్లాలోని 126 పునరావాస కేంద్రాల్లో 620 మంది ఆశ్రయం పొందుతున్నారు. బాధితులకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు ఉచితంగా భోజనం వసతి కల్పిస్తున్నాయి. జిల్లా 76 ఇళ్లు దెబ్బతిన్నాయి. 600 ఎకరాల్లోపైగా వరి పంట నీట మునిగింది. వాగులు, నదుల ఉధృతితో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మల్లిమడుగు, కల్యాణి డ్యాముల నుంచి నీటిని దిగువకు వదిలారు. సముద్రతీర ప్రాంతాలైన గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
- 'శ్రీవారి' క్షేత్రాన్ని కమ్మేసిన మంచు దుప్పటి
తిరుమల శ్రీవారి క్షేత్రంలో మంచు దుప్పటి కమ్మేసింది. చలి తీవ్రత అధికంగా పెరగడంతో శ్రీవారి సందర్శకులు వణికిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చంటి పిల్లలతో వచ్చిన సందర్శకులు గదుల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
- సంగం వద్ద భారీగా వరద నీరు
నెల్లూరు జిల్లాలో వరి నారు మళ్లు, నార్లు దెబ్బతిన్నాయి. సంగం బ్యారేజీకి, సోమశిలకు వరద నీరు వచ్చింది. సోమశిల రెండు గేట్లు ఎత్తి 19.610 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ఉదయగిరి, వరికుంటపాడు, కందుకూరు ప్రాంతాల్లో కందులు, పొగాకు, మినుము పంటలు దెబ్బతిన్నాయి. కందుకూరు సబ్ డివిజన్ పరిధిలో సుమారు 2,460 ఎకరాల్లో శనగ పైరుకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపారు. 33 శాతం కన్నా ఎక్కువ నష్టపోయిన రైతులకు సబ్సిడీతో శనగ విత్తనాల సరఫరాకు ప్రతిపాదనలు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
- హైదరాబాద్‌లో ముసురు
తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లో ముసురు వాతావరణ నెలకొంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. రాగల మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
- తమిళనాడులో ఐదుకు చేసిన మృతుల సంఖ్య
తుపాన్ ధాటికి తమిళనాడులో మరొకరు మృతి చెందారు. దీంతో, మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
- కేరళ, బెంగళూరుల్లో ఎల్లో అలర్ట్
మాండూస్ తుఫాను కారణంగా కేరళ, బెంగళూరుల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ముల్లపెరియార్ డ్యాంలో నీటిమట్టం 141 అడుగులకు చేరుకుంది. కర్ణాటకలో ఆదివారం వరకు తుపాన్ ప్రభావం తక్కువగా కనిపించింది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కర్ణాటకలోని అనేక జిల్లాల్లో వర్షం పడుతోంది. శివమొగ్గ, హావేరి, బళ్లారి, చిక్కమగళూరు, చిత్రదుర్గ జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంటుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. కోలారు, మైసూరు, బాగల్ కోటే, రాయచూరు విజయపుర, యాదగిరి జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతాయని ఐఎండి అధికారులు చెబుతున్నారు. బెంగళూరు, హాసన్, కొడుకు జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. బెంగళూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బిబిఎంపి అధికారులు తెలిపారు. ఇప్పటికే రోడ్లన్నీ జలయమం కావడంతో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.










