అమరావతి : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి గురువారానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తుపాను కు అధికారులు 'మిధిలి' గా నామకరణం చేశారు. ఈ తుపాను ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. బంగాళాఖాతంలో మిథిలి తుఫాను తీరం వైపు వెళుతోంది. ఒడిశా పారాదీప్ కు దక్షిణంగా 190 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్ దిగాకు నైరుతి దిశ గా 200, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 220 కిలోమీటర్ల దూరంలో మిధిలి కేంద్రీకృతమైంది. రేపటికి (18వ తేదీ నాటికి) బంగ్లాదేశ్ ఖేపు పార మోంగ్ల మధ్య తీరం దాటుతుందని ఐఎండి ప్రకటించింది. ఈ తుఫాను ప్రభావంతో వెస్ట్ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని తెలిపింది. ఇప్పటికే ఆయా తీరాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మరోవైవు శ్రీలంక ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం, తుఫానుకు అనుబంధంగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఎపిలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లద్దని ఐఎండి సూచించింది.