Jun 11,2023 12:00

ఇంఫాల్‌  : మణిపుర్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు ఇంటర్నెట్‌ సేవలపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్‌ 15మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్నెట్‌ నిషేధం అమల్లో ఉంటుందని శనివారం హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. చాలా జిల్లాల్లో, ముఖ్యంగా ఇంఫాల్‌ ఈస్ట్‌ మరియు ఇంఫాల్‌ వెస్ట్‌లలో కర్ఫ్యూని సడలించారు. ఇంఫాల్‌లో ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు సడలించినట్లు ముందస్తు ఉత్తర్వుల్లో పేర్కొంది.

శుక్రవారం ఇంఫాల్‌లోని ఓ గ్రామంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. తిరుగు బాటుదారులు మెయితీ కమ్యూనిటకీ చెందిన వారని, కూంబింగ్‌ ఆపరేషన్‌ పేరుతో గ్రామస్తుల నుండి సమాచారం సేకరించేందకనే సాకుతో వారిపై కాల్పులు జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు.

అయితే గడిచిన 24 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోలేదనిరాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి సపమ్‌ రంజన్‌ తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరే అవకాశాలు కన్పిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మణిపుర్‌ వ్యాప్తంగా 349 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.