Sep 22,2023 12:04

ఇంఫాల్‌ : రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో 'ఇంటర్నెట్‌ సేవలు' లీకేజీ అవుతున్నాయంటూ మణిపూర్‌ ప్రభుత్వం ఎయిర్‌టెల్‌పై ధ్వజమెత్తింది.  ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర హోంశాఖ తీవ్ర పదజాలంతో ఎయిర్‌టెల్‌కు లేఖరాసింది. కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు ఎందుకు లీకవుతున్నాయని ప్రశ్నించింది.  ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినందుకు, రాష్ట్రంలో సేవలను నిషేధించేలా తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని మణిపూర్‌ హోంశాఖ కమిషనర్‌ టి. రంజిత్‌ లేఖలో పేర్కొన్నారు.

అయితే కుకీలు అధికంగా నివసించే చురచంద్‌పూర్‌ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలు కొనసాగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం ఎయిర్‌టెల్‌పై మండిపడింది. ఇంటర్నెట్‌ సేవల లీకేజీకి కారణమైన అధికారుల వివరాలు తెలియజేయాలని ఎయిర్‌టెల్‌ సంస్థను ఆదేశించింది.

మణిపూర్‌లో జులై 25న ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేసింది. మొబైల్‌ ఇంటర్నెట్‌ నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైఫై మరియు విపిఎన్‌ సేవలపై కూడా నిషేధం విధించింది. దీంతో కేసులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణ అవకాశాలను పరిశీలించాలని ఆగస్ట్‌ 12న మణిపూర్‌ హైకోర్టు ఆదేశించింది.