భారత పార్లమెంటు తన సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసింది. ఈ కరోనా విపత్తు సమయంలో పార్లమెంటు సమావేశాలు జరపడమే ఓ గొప్ప విషయం అని, (మన పిల్లలకి స్కూళ్ళు తెరిచెయ్యడం ఏమంత గొప్ప విషయం కాదు వీరికి. ఎందుకంటే పోతే పోయేది పిల్లల ప్రాణాలే కదా. ఎటుతిరిగీ అవి కరోనా ఉన్నా, లేకున్నా పోతూనే వున్నాయి కద! ఏవిుటో! ఈ ముక్క అన్నందుకు నామీద పార్లమెంటు ధిక్కరణ కేసు పెడతారో ఏవిుటో? నా వెర్రి గాని, అంతటి ప్రశాంత్ భూషణ్ నే వదల్లేదు, సినిమా హీరో సూర్యనీ వదిలేట్టు లేరు. ఇహ నాబోటివాడొక లెక్కా?) అందుచేత ఆ అపురూపమైన సమయాన్ని ప్రశ్నోత్తరాలతో వృధా చేయరాదని, బిజెపి, వారి మిత్ర పక్షాలు (ఆ పక్షాలలో మన వైసిపి, టిడిపి ఉన్నాయని వేరే చెప్పనక్కరలేదు) భావించి ప్రతిపక్షాల నిరసనలను తోసిరాజని నిర్ణయించేశాయి.
మనం చట్టసభలకి ప్రజా ప్రతినిధులని ఎన్నుకుంటాం. ఓట్లడిగే టప్పుడు అభ్యర్ధు లంతా వచ్చి ''మీ సమస్యలని చట్టసభ దృష్టికి తీసుకెళతాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం'' అని చెప్తారు. మనమంతా నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేము. ఒకవేళ ప్రశ్నించినా దానికి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలన్న నియమం ఏమీ లేదు. ఈ ప్రజాస్వామ్య (!) దేశంలో ప్రజలడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే తీరిక లేదు పాలకులకు. కనుక కనీసం మనం ఎన్నుకునే ఎంపీలకు, ఎమ్మెల్యేలకైనా (ఎమ్మెల్సీలకు కూడానండోరు) మన తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం, అవకాశం ఉండాలి. అలా వచ్చినదే ఈ ప్రశ్నోత్తరాల సమయం. దానిని మన పార్లమెంటు ప్రస్తుత సమావేశాల వరకు వదిలేసుకుంది. అంటే మేము ప్రజా ప్రతినిధుల బాధ్యతను నెరవేర్చం అని చెప్పడమే (ప్రశ్నోత్తరాలు ఉంటే మాత్రం మనవాళ్ళు ఏం పొడిచేస్తున్నారు అన్నది వేరే ప్రశ్న). అంతే గాక, ప్రభుత్వాన్ని వాళ్ళ ద్వారా ప్రశ్నించే మన పరోక్ష హక్కును కూడా మనల్ని అడక్కుండానే వాళ్ళే ఒదిలేసుకున్నారు.
ఈ ప్రశ్న అనేది, చూశారూ, మహా గట్టిది సుమండీ. ఇంట్లో పిల్లాడిని ''నువ్వు ప్రశ్న అడగకూడదు.'' అని వాడి నోరు మూయించడానికి చూస్తే ''ఏం? ఎందుకు అడగకూడదు?'' అని మరో ప్రశ్న సంధిస్తాడు వాడు. నీకు కోపం వచ్చి నాలుగు పీకేవనుకో. ఏడుపు లంకించుకుంటాడు. ఏడిస్తే ఏడ్చాడులే, ఆ పాడు ప్రశ్నల బాధ తప్పింది అని నువ్వు అనుకునే లోపే ఇంట్లో, పక్కింట్లో వాళ్ళందరూ చేరి ''వాడెందుకు అలా ఏడుస్తున్నాడు'' అని మొదలుబెట్టి వరస ప్రశ్నలు వదులుతారు. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ఈ ప్రశ్న అనేది ఉంది చూశారూ, దాని నుంచి తప్పించుకోవాలనుకోవడం అంత మూర్ఖత్వం, తెలివితక్కువతనం ఇంకోటి లేదు (అయితే ఏమిటి? ఈ లక్షణాలు మన పాలకులకున్నాయని నీ అభిప్రాయమా? అని మీరు నన్నడిగితే సమాధానం వాయిదా వేసి కొంత సమయం కోరుతానే తప్ప మీ ప్రశ్న హక్కును నేను రద్దు చేయను, చేయలేను).
''నేను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడికి పోతాను?'' వంటి ప్రశ్నలు లేకపోతే ఇంత తత్వశాస్త్రం అంతా ఎక్కడి నుంచి వచ్చి వుండేది? మన ఘనత వహించిన ఉపనిషత్తులన్నీ ప్రశ్నలు, సమాధానాలే కదా? వాటి గురించి రోజూ గొప్పలు చెప్పుకునే సంఘపరివారమంతా ఈ ప్రశ్నోత్తరాల సమయం రద్దు కావడం వెనక సూత్రధారులు కావడం ఉపనిషత్తులకు పెద్ద ద్రోహం కాదా? మన సనాతన ధర్మం ఏమైనట్టు? అన్నట్టు 'ప్రశ్నోపనిషత్తు' అని ఓ ఉపనిషత్తు కూడా ఉందండోరు!
మనం ఇప్పుడు కరోనాతో సతమతమౌతున్నాం. డిసెంబరు 2019 లోనే చైనా వాళ్ళకి ఇదేమి జబ్బు? అన్న ప్రశ్న రాబట్టి, వాళ్ళు శరవేగంగా సమాధానం కనుక్కోబట్టి ఇప్పుడు మనం అంతా కోవిడ్-19 అని, కరోనా అని అంటున్నాం. చైనా ప్రభుత్వం గనుక మన ప్రభుత్వం మాదిరిగానే ప్రశ్నించడం మీద ఆంక్షలు పెడితే వాళ్ళు ఈ కరోనా ను కనుక్కుని వుండేవారా? ప్రపంచాన్ని హెచ్చరించగలిగేవారా?
అసలు ప్రశ్నించడం మనిషి సహజ లక్షణం. ''ఈ నీరు అంతా ఎక్కడికి, ఎలా పోతోంది?'' అని ప్రశ్న వేసుకుని, నీరు పల్లమెరుగు అని నిర్ధారించుకుని, పల్లానికి పోతున్న నీటిని అలానే వదిలెయ్యకుండా ఆనకట్టలు కట్టి, ఎత్తు పెంచి, తను నివసించే చోటికి నీటిని రప్పించుకుంటున్నాడు మనిషి. ఆ ప్రశ్నే గనుక లేక పోయి వుంటే తక్కిన జంతువుల మాదిరిగానే ఇప్పటికీ దాహం వేస్తే నది దగ్గరకు పోయే స్థితి లోనే ఉండేవాళ్ళం కదా? కాబట్టి మనిషి మనిషిలా ఉండాలంటే ప్రశ్నించాల్సిందే. లేకపోతే మనిషి జంతువు కన్నా హీనం. అందుకని ఎవరు బెదిరించినా, ఎవరు వద్దన్నా, మనం ప్రశ్నిద్దాం. ప్రశ్నపై నిషేధాన్ని మరీ గట్టిగా ప్రశ్నిద్దాం. ప్రశ్నించేవాడు మనిషి. వొద్దనేవాళ్ళు ఏ కోవకు చెందుతారో వాళ్ళే తేల్చుకోవాలి.
- ఎం.వి.ఎస్










