Oct 03,2020 23:41
మన మంచే మనకు కంచె

అదొక పల్లెటూరి జాతీయ బ్యాంకు. మామూలుగానే అక్కడ జనం ఇసుకపోస్తే రాలనట్లుంటారు. అలాంటిది ఈ కరోనా పరిస్థితుల్లో ఎవరికీ పనులూ, ఆదాయం రెండూ లేక అల్లాడుతున్న స్థితిలో ప్రభుత్వం తెల్లకార్డుల వారికి ఖాతాల్లో పదిహేను వందలు వేసిందన్న విషయం తెలియడమేమిటి.. కిలోమీటర్‌ దూరం క్యూ కట్టేశారు. భౌతిక దూరం లేదు, కరోనా భయమూ లేదు వాళ్ళలో. జానకి రాముడు, వెనక శ్రీనివాస్‌ ముఖాలకి మాస్క్‌లూ, కళ్ళకి కళ్ళజోళ్ళు, చేతులకు గ్లవ్స్‌ ధరించి, యుద్ధవీరుల్లా బైక్‌ దిగారు. అప్పటికే అక్కడున్న జనాల్ని చూస్తూ పరిస్థితి అంచనా వేస్తూ లోపలికి వెళ్తూ.. ''ఇదిగో శ్రీనూ! బైక్‌ పార్క్‌ చేసి.. నువ్వు గుమ్మం దగ్గరే నిలబడు. నలుగురు నలుగుర్ని మాత్రమే లోనికి పంపు. వచ్చే ముందు వాళ్ళ చేతులు శానిటైజ్‌ చెయ్యడం మరచిపోకు..'' అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అతను అక్కడ క్యాషియర్‌. అప్పటికే అంతా యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లా ఎవరి స్థానాల్లో వాళ్ళు తయారుగా కూర్చున్నారు.
సబ్‌ మేనేజర్‌ రంజన్‌, జానకి రాముడు లోపలికి వెళ్ళి నగదు బయటకు తెచ్చారు.
''ఆ డబ్బులేవో ఇచ్చెయ్యక ఖాతాలో ఎందుకండీ బాబు? పాపం ఎండ చూస్తే విరగకాస్తోంది. ఇలా భౌతిక దూరం పాటిస్తూ అన్ని పేమెంట్స్‌ అయ్యేసరికి వడియాల్లా ఎండిపోతారు వాళ్ళు. పోనీ ఓ పని చేద్దామా జానీ! వాళ్ళను లోపలికి రమ్మనే కంటే నేనే బయటికెళ్ళి, వాళ్ళని పాస్బుక్‌ ఫోటోతో సరిచూసుకుని.. పది పది విత్‌ డ్రాయల్స్‌ ఒకసారి తెచ్చి, సిస్టంలో ఎంటర్‌ చేస్తాను. క్యాష్‌ పట్టికెళ్ళి పదిమందీ సంతకాలు తీసుకుని, ఓ సారి ఇచ్చేయనా?! .. ఈ లోపు మరో పది .. అలా చిన్న మొత్తాలే కదా .. అందరి ఫోన్‌ నెంబర్స్‌ వెనుక వేయిస్తా .. ట్రిప్పుకు పదేసిమంది అయిపోతారు ఏమంటావ్‌?!'' అన్నాడు రంజన్‌.
''ఊరుకోండి గురువు గారు! మీరు మరీనూ ఏదైనా తేడాపాడాలొస్తే!'' అన్నాడు. ఎందుకంటే ఒకటికి పదిసార్లు చాదస్తంగా చూసుకునే క్యాషియర్‌ అతను.
''పర్లేదులే.. ఏం రాదు.. నే జాగ్రత్తగా చేస్తాగా!'' ఒప్పించే ప్రయత్నం చేశాడు రంజన్‌.
''సరే మీ ఇష్టం'' అయిష్టంగానే ఒప్పుకున్నాడు జానకి రాముడు.
రంజన్‌ బయటికెళ్ళి ''ఇదిగో శ్రీనూ..! ఒక్కొక్కరి దగ్గరా విత్‌ డ్రావల్‌ సరిగా ఉందో లేదో చూసి, ఫోటోతో సరి చూసి వెనకాల సంతకం, ఫోన్‌ నంబర్‌ రాయించు. ఓ పది పట్టికెళ్ళి లోపల భాస్కర్‌ చేత త్వర త్వరగా ఎంటర్‌ చేయించి, క్యాషియర్‌ గారికిచ్చేరు..! ఈ లోపు నేను ఇంకొంత మంది దగ్గర తీసుకుంటా!'' అంటూ పని మొదలుపెట్టేశాడు రంజన్‌ ..
ఆ పదింటి నగదు పాస్‌బుక్స్‌లో పెట్టి తెచ్చేశాడు శ్రీను.. అంతా సరిచూసుకుని, దండాలు పెడుతూ వెళ్ళిపోయారు.
మొత్తానికి చాలా సమయం పట్టేది కాస్తా మూడు గంటల వ్యవధిలో అంతా క్లియర్‌ అయిపోయింది. మళ్ళీ రెండు గంటలకల్లా బ్యాంక్‌ మూసెయ్యాలి మరి.


***


''ఏమయ్యా రంజనూ! నీకు భలే వస్తాయయ్యా ఇలాంటి ఐడియాలు! బాగుంది.. తొక్కిసలాట లేకుండా ప్రశాంతంగా పని జరిగిపోయింది.. వెరీగుడ్‌'' అంటూ మెచ్చుకున్నాడు మేనేజర్‌.
''ఏం చేస్తాం సార్‌! శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలనీ, ఇప్పుడేం చూశారు! .. డీమోనిటజేషన్‌ అప్పుడు పాపం ముసలివాళ్ళు రోజూ ఇలా గంటల తరబడి క్యూలలో ఉంటే.. వాళ్ళని కూచోబెట్టి ఇదే పని చేశాం. లేకపోతే రోజుకు ఎంతమంది పడిపోయేవారో కళ్ళు తిరిగి. తప్పదు అప్పుడప్పుడు చిన్న చిన్న రిస్క్‌లూ, నియమోలంఘనలూ ..'' నవ్వుతూ వేరే పనిలో పడ్డాడు రంజన్‌.
''గురువు గారూ డే ఎండ్‌ చేసేద్దామా! మళ్ళీ త్వరగా, అదే లాక్‌డౌన్‌ టైంలో ఇంటికి చేరకపోతే దారిలో పోలీసువారికి సంజాయిషీలు ఇచ్చుకోవాలి'' మేనేజర్‌తో అన్నాడు రంజన్‌.
''ఊ .. చేసెయ్యండి! ఎందుకాలశ్యం ..'' నవ్వుతూ చెప్పాడు మేనేజర్‌.
పని ముగించుకుని, తాళాలేసి బయలుదేరారు అంతా. జానకిరాముడూ, భాస్కర్‌ ఓ బండి మీద వెళ్ళిపోయారు. రంజన్‌ దారిలో శ్రీనుని దింపి వేగంగా వెడుతూ .. ఎదురుగా వస్తున్న ఇంకో బైక్‌ని తప్పించబోయి కంట్రోల్‌ తప్పి, రోడ్‌ డివైడర్‌ని గుద్దేశాడు. దీంతో బండితో సహా రంజన్‌ వంద గజాలు ఈడుచుకుపోయాడు. అది కూడా ఇంకా మధ్య దారిలోనే. ఏం జరిగిందో తెలిసేలోపే స్పహ కోల్పోయాడు. సుమారుగా అంతా నిర్మానుష్యంగా ఉంది.. అతని అదృష్టమా అన్నట్లు ఇద్దరు వ్యక్తులు సైకిల్‌ మీద వస్తూ అతనిని చూసి ఆగారు.
''అయ్యో.. బ్యాంక్‌ సార్‌ రా ..!'' రెండో అతనితో అంటూనే జేబులోంచి సెల్‌ తీసి 100 నెంబరుకు చేసి పోలీసులకీ, 102కి చేసి అంబులెన్స్‌ వారికీ వెంట వెంటనే కాల్‌ చేశాడు.
''ఒరే మనకెందుకురా బాబు? ఏదైనా అటూఇటూ అయితే మనల్ని పట్టుకుంటారు. పోన్లే ఫోన్‌ చేశావుగా వాళ్ళే వచ్చి తీసుకెళతారు. రా ఇక మనం పోదాం'' రెండో అతను కంగారుపెట్టాడు.
''చస్‌ ఉండు, అలాగేం జరగదు.. సార్‌ ఎంత మంచోడో తెలుసా? ఎప్పుడు బ్యాంకు పని మీదెల్లినా విసుక్కోకుండా వెంటనే పని చేసిపెడతాడు. అంతెందుకు ఈయాల కూడా.. జనం అంతమందున్నా.. చకచకలాడిచ్చేశాడు .. పాపం మంచోడు .. వదిలేసి ఎలా పోతాం ..?'' అంటూ మళ్ళీ దగ్గరకెళ్ళి చూశాడు.
''అయ్యో సాన రగతం పోతోంది. ఈళ్ళు బేగ వస్తే బాగుండు..!'' పది నిముషాల వ్యవధిలో పోలీస్‌ జీప్‌, అంబులెన్స్‌ రెండూ వచ్చేశాయి. గబగబా అతనిని అంబులెన్స్‌ ఎక్కించి, తీసుకెడుతుంటే వెంటే ఫోన్‌ చేసిన వ్యక్తి కూడా ఎక్కాడు ''ఒరే నువింటికెల్లిపో! మా ఇంట్లో కబురు చెప్పు.. నేను ఈ సారు తాలూకా వాళ్ళు వచ్చాక వాళ్లకి అప్పజెప్పి వచ్చేస్తా!'' అంటూ.
అదృష్టవశాత్తూ రంజన్‌కి ప్రాణ భయం తప్పింది. రక్తం అవసరంపడితే వెంటెళ్లిన వ్యక్తి రక్తం పరీక్షిస్తే, సరిపోయింది. అతను రంజన్‌కి రక్తం ఇవ్వడం.. కాపాడడం వెంటవెంటనే జరిగిపోయాయి.
రంజన్‌ ఫోన్‌ ఉన్నా.. లాక్‌ అయి ఉండడంతో అతని ఇంటికి వెంటనే కబురు ఎలా చేరవేయాలి అన్నప్పుడు కూడా సదరు వ్యక్తి దగ్గర బ్యాంకు శ్రీను నంబర్‌ ఉండడంతో ఆయనకి ఫోన్‌ చేసి, విషయం చెప్పాడు. వెంటనే బ్యాంకు సిబ్బంది ఒకరు .. రంజన్‌ భార్యని తీసుకురావడం జరిగింది.
''మీరు సమయానికి దేవుడిలా చూసి రక్షించారు!'' అంటూ రంజన్‌ భార్య కళ్ళనీళ్ళపర్యంతం అయిపోయింది.
''అదేటమ్మా.. ఆ బాబు మా అందరికీ ఎన్నో సేసిపెడతాడు. చూసి కూడా ఆమాత్రం పట్టించుకోకుండా ఎట్టా వదిలేస్తాం..? పోనీలాండి .. ఇయ్యేల లేచిన ఏల బాగుండిపోనాది.. పెమాదం తప్పింది .. జార్తమ్మా! మరి నేనెల్లనా? ఏటన్నా కావాలంటే ఈ ఫోన్‌ నంబర్‌ ఎక్కించుకోమ్మా'' అంటూ అయినవాళ్ళ కంటే ఎక్కువగా చెప్పాడు.
''మన మంచే మనకెప్పుడూ కంచెలా కాపాడుతుంది!'' అని తండ్రి ఎప్పుడూ చెప్పే మాట గుర్తుకొచ్చింది రంజన్‌ భార్యకు.
 

- మీనాక్షి శ్రీనివాస్‌
9492837332