
- నేటి సమాజంలో ఆడపిల్ల నెత్తిమీద కుంపటి అనుకునేవాళ్లు ఉన్నట్లుగానే.. కూతురు పుట్టిందని సంబరాలు చేసుకునేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఎంతో గారాబంగా పెంచి, పెద్ద చేస్తారు. చదివిస్తారు. పెళ్లీడు వచ్చాక అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు. ఇక అక్కడితో కూతురు బాధ్యత తీరినట్లు భావిస్తారు. అత్తింట్లో తను ఎన్ని బాధలు పడ్డా పట్టించుకోరు. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు పడ్డా, భర్త తాగుబోతు అయినా, తిరుగుబోతు అయినా, హింసలు పెడుతున్నా, అత్తింటి గడప దాటకూడదని, భర్త అడుగుజాడల్లో నడవమని, మంచి మాటలతో అతన్ని మార్చుకోమని నచ్చచెబుతారు. పరువు పోయే పనులు చేయొద్దని ఉపదేశిస్తారు. తల్లిదండ్రుల్లో కనిపించే ఈ ధోరణి వల్లే ఎంతోమంది ఆడపిల్లలు వేధింపులు తాళలేక తనువులు చాలిస్తున్నారు. వరకట్న వేధింపుల వల్ల అశువులు బాస్తున్న వనితలెందరో..!
అయితే తన కూతురికి ఆ కష్టం రాకూడదని ఓ తండ్రి భావించాడు. అత్తింట్లో తనకెదురైన చేదు అనుభవాలను నాన్నతో చెప్పుకున్న ఆమెకు ఆ తండ్రి కొండంత భరోసా ఇచ్చాడు. హింసిస్తున్న భర్త నుండి విడాకులు కోరిన కూతురిని పుట్టింటికి తీసుకువచ్చాడు. ఇక్కడే అతను ఈ సమాజానికి గొప్ప సందేశం ఇచ్చాడు. పెళ్లినాడు పుట్టింటి నుండి అత్తింటికి ఆమెను ఎంత సంబరంగా పంపించాడో.. ఇప్పుడు కూడా మేళతాళాలతో.. భాజాభజింత్రీలతో, టపాసులు పేలుస్తూ.. పుట్టింటికి తీసుకువచ్చాడు.
'నా కూతురు నా ఇంటి గౌరవం. ఆమెను తక్కువ చేసి చూసిన ఆ ఇంటి నుండి నా గౌరవాన్ని కాపాడుకున్నాను. చాలామంది తల్లిదండ్రులు భర్తతో విభేదించిన కూతురును గుండెల మీద కుంపటిలా భావిస్తారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురైనా సరే అత్తింట్లో ఆరళ్లు పడాల్సిందేనన్నట్లు చెబుతారు. వారందరికీ నేను ఒక్కటే చెప్పదలచుకున్నాను. కూతురి ప్రతి కష్టంలోనూ మీరు తోడుండాలి. చదువు, పెళ్లితోనే తల్లిదండ్రుల బాధ్యత తీరిపోదు. అత్తింట్లో ఆ పిల్ల బాగోగులు పట్టించుకోవాలి. అక్కడ ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే మేమున్నామంటూ ధైర్యం చెప్పాలి' అంటున్నాడు ఆ తండ్రి.
జార్ఖండ్ రాష్ట్రం, రాంచీ, కైలాష్ నగర్ కుమ్‌హార్ తోలీ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి తన కూతురు సాక్షి గుప్తాకు గతేడాది సచిన్ గుప్తాకి ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అయితే పెళ్లయి అత్తింటికి వెళ్లినప్పటి నుండి సాక్షికి వేధింపులు మొదలయ్యాయి. ఆమె భర్తకి అప్పటికే వివాహమైందని సాక్షికి అర్థమైంది. అయినా అతనితో కలిసుండాలనే నిర్ణయించుకుంది. కానీ రోజురోజుకూ భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయం తండ్రితో చెప్పింది. భర్తతో కలిసి ఉండలేనని, విడాకులు ఇస్తానని బోరున ఏడ్చింది. కూతురు కష్టం చూసిన ఆ తండ్రి ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్నాడు. ఆమె పరిస్థితి చూసి చలించిపోయాడు. బాధలో ఉన్న ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆమె తనకు ఎంత విలువైనదో చాటిచెప్పేలా, ఆ ఇంటి నుండి అమిత గౌరవంగా తన ఇంటికి తీసుకువచ్చాడు. అక్టోబరు 15న జరిగిన ఈ మొత్తం వేడుకను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
'మీరు గారాబంగా పెంచుకున్న మీ కూతురికి అత్తింట్లో అనుకోని పరిస్థితులు ఎదురైతే ఆమెను దూషించకండి. పరువు పోతుందని, అక్కడే ఉండిపొమ్మని బతిమాలకండి. కుమార్తెలు చాలా విలువైనవాళ్లు వాళ్లను కాపాడుకోవాలి' అంటూ గొప్ప మాటలు రాశాడు. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ప్రేమ్ గుప్తా సమాజానికి గొప్ప సందేశం ఇచ్చారని ఎంతోమంది ఆయనను అభినందిస్తున్నారు.