Jan 03,2021 12:40

                                                     

                                                           పండుమిర్చి కాయల పచ్చడి 

pandu mirchi kayala pachchadi

కావాల్సిన పదార్థాలు :  పండుమిర్చి- పావుకిలో, సోంపు- 30 గ్రాములు, మెంతులు- 20 గ్రాములు, జీలకర్ర- 15 గ్రాములు, వాము- 5 గ్రాములు, నల్ల మిరియాలు- ఎనిమిది, నిమ్మకాయ- రెండు, ఆవనూనె- కప్పు, ఆవాలు- 40 గ్రాములు, పసుపు- 7 గ్రాములు, నల్ల ఉప్పు- పది గ్రాములు, ఇంగువ- రెండు చిటికెలు.

తయారుచేసే విధానం : ముందుగా కప్పు నూనెను వేడి చేసి పెట్టుకోవాలి. సోంపు, మెంతులు, జీలకర్ర, వాము, నల్ల మిరియాలను దోరగా వేగించి మెత్తగా పిండి చేసుకోవాలి. ఆవాలను కూడా విడిగా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అందులోనే నిమ్మకాయల రసం, నల్ల ఉప్పు, ఇంగువ, పసుపు, వేడిచేసిన నూనెను ఈ పొడిలో వేసి రెండు గరిటెలు వేసి కలపాలి. ఇప్పుడు పండు మిరపకాయలను చీల్చి దానిలోపల విత్తనాలతో సహా తీసి పొడిలో కలపాలి. తర్వాత ఈ పౌడరును చీల్చిన మిరపకాయల్లో పెట్టి మిగిలిన నూనెలో మిరపకాయలను ముంచి సీసాలో పెట్టేసుకోవాలి. మిగిలిన పౌడరు, నూనె ఉంటే అదీ బాటిల్లో పోసేసుకోవాలి. అంతే పండుమిర్చి కాయల పచ్చడి రెడీ.

                                                     

                                                          పచ్చిమిర్చి ముక్కల పచ్చడి

pachchi mukkala pachchadi

కావాల్సిన పదార్థాలు : పచ్చిమిర్చి- 20 నుంచి 30 కాయలు, నూనె- నాలుగు టేబుల్‌ స్పూన్‌లు, ఇంగువ- అర టేబుల్‌ స్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టేబుల్‌ స్పూన్‌లు, ఉప్పు- తగినంత, పసుపు- అర టేబుల్‌ స్పూన్‌, పసుపు రంగు ఆవాలు- టేబుల్‌ స్పూన్‌ (బరకగా పొడి చేసుకోవాలి), నిమ్మరసం- నాలుగు టేబుల్‌ స్పూన్లు.


తయారుచేసే విధానం : ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. తర్వాత చిన్నచిన్న ముక్కలుగా అడ్డంగానే కోసుకోవాలి. స్టౌపై పాన్‌పెట్టి నూనెవేసి వేడయ్యాక ఇంగువ, అల్లంవెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. తర్వాత ఉప్పు, పసుపు, మెంతుల పొడి బాగా కలపాలి. ఇప్పుడు నాలుగు టేబుల్‌ స్పూన్‌ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీనిని గాలి చొరబడని గాజుసీసాలో పెట్టి భద్రపరచ ుకోవాలి. ఈ పచ్చడి ఒకరోజు తర్వాత తింటే సూపర్‌గా ఉంటుంది.

                                                     

                                                                పచ్చిమిర్చి కాయల పచ్చడి

pachchi mirchi kayala pachchadi


కావాల్సిన పదార్థాలు : పచ్చిమిర్చి- 150 గ్రాములు(మీడియం సైజు), పసుపు రంగు ఆవాలు - ఒకటిన్నర స్పూన్‌(బరకగా పొడి చేసుకోవాలి), ఉప్పు- ఒకటిన్నర స్పూన్‌(వేగించాలి), ఇంగువ- అరస్పూన్‌, పసుపు- అరస్పూన్‌, నూనె- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, నిమ్మకాయలు- రెండు.


తయారుచేసే విధానం : ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. వాటిని మధ్యలో చీల్చి పక్కన పెట్టుకోవాలి. ఒకబౌల్‌ తీసుకుని మెంతిపొడి, ఉప్పు, ఇంగువ, పసుపు, నూనె, నిమ్మకాయరసం అన్నీ వేసుకుని కలుపుకోవాలి. అందులో చీల్చిన మిరపకాయలు వేసి బాగా కలపాలి. అంతే పచ్చిమిర్చి కాయల పచ్చడి రెడీ.

                                               

                                                         పండు మిరపకాయల ముక్కల పచ్చడి

pandu mirapakayala mukkala pachchadi


కావాల్సిన పదార్థాలు : పండుమిర్చి- అరకిలో, పసుపు రంగు ఆవాల పొడి- 150 గ్రాములు (బరకగా), ధనియాలు- 75 గ్రాములు, ఎండు మామిడి పొడి- 150 గ్రాములు, జీలకర్ర- 50 గ్రాములు, ఉప్పు- 150 గ్రాములు, కల్లు ఉప్పు- 75 గ్రాములు, పసుపు- 50 గ్రాములు, జీలకర్ర- మూడు టేబుల్‌ స్పూన్లు(వేగించాలి), సోంపు- 50 గ్రాములు, ఇంగువ- 15 గ్రాములు, కలోంచి గింజలు- పది గ్రాములు, వాము- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌(వేగించాలి), నూనె- తగినంత.


తయారుచేసే విధానం : పండు మిరపకాయలను కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి. దనియాలు, సోంపులను స్టౌపైన వేగించుకోవాలి. తర్వాత మిక్సీలో జీలకర్ర, వాము, ధనియాలు, సోంపులను బరకగా పొడి చేసుకోవాలి. మిరపకాయలను రెండు ముక్కలుగా అడ్డంగా కోసుకుని లోపల గింజలతో సహా తీసి వెయ్యాలి. ఒక బౌల్‌ తీసుకుని అందులో తయారు చేసుకున్న పొడి, ఎండు మామిడి పొడి, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె కొద్దిగా వేసి కలుపుకోవాలి. దానిని ముక్కల్లో స్టప్‌ చేసుకోవాలి. ఈ ముక్కలను జాడీలో పెట్టు కొని మిగిలిన పొడి, నూనెలను వేసి మూత పెట్టుకోవాలి.