Apr 08,2023 10:18
  • అకాల వర్షాలతో కోలుకోలేని దెబ్బ
  • నాణ్యత పేరుతో క్వింటాలుకు రూ. 2 వేలు తగ్గింపు
  • దిగుబడిపైనా ప్రభావం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : అకాల వర్షాలు మిర్చి రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. దీంతో మిర్చి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గత వారం రోజుల్లో క్వింటాలుకు రూ.2 వేల వరకు తగ్గింది. సాధారణ రకాలు కనిష్ట ధర క్వింటాలు రూ. 9 వేలు, గరిష్ట ధర రూ.25 వేలు ఉంది. మేలురకాలైన తేజ, బాడిగ, దేవనారు డీలక్స్‌్‌ రకాలు కనిష్టంగా రూ.9500, గరిష్టంగా రూ.27 వేల వరకు లభిస్తోంది. ఎక్కువ సరుకు కనిష్ట ధరలకే కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత లేదనే కారణంతో ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
      మిర్చి అధికంగా సాగయ్యే గుంటూరు, పల్నాడు, ఎన్‌టిఆర్‌, ప్రకాశం, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఈ జిల్లాలతోపాటు అనంతపురం, సత్యసాయి, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా గుంటూరు యార్డుకు మిర్చి వస్తోంది. మిర్చి నాణ్యత తక్కువగా ఉందని చెబుతూ ప్రస్తుతం కొనుగోలును వ్యాపారులు తగ్గించారు. దీనికితోడు విదేశీ ఆర్డర్లు కూడా గత 15 రోజులుగా నిలిచిపోయాయి. ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డుకు రోజుకు లక్ష టిక్కిలకుపైగా సరుకు వస్తోంది. గత నెలలో నాణ్యమైన సరుకు వచ్చినప్పుడు సగటు ధర రూ.20 నుంచి రూ.25 వేలు ఉండగా ప్రస్తుతం రూ.17 వేల నుంచి రూ.20 వేల మధ్యన ధరలు వస్తున్నాయి. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంలేదని రైతులు చెబుతున్నారు. మొత్తం నాలుగు కోతల్లో 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు ఆశించగా ఎక్కువ ప్రాంతాల్లో 12 క్వింటాళ్లకు మించి రాలేదు. పెట్టుబడి ఎకరాకు రూ.లక్షకుపైగా పెట్టినట్టు రైతులు చెప్పారు. కనీసం 15 క్వింటాళ్ల దిగుబడి రావాలని, అలాగే క్వింటాలు రూ.20 వేలకు తగ్గకుండా ఉంటేనే కొంత వరకు నష్టాల నుంచి బయటపడతామని అంటున్నారు. గత అక్టోబరులో మాండూస్‌ తుపానుతో కొంత నష్టం జరిగింది. తరువాత జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లోనే అకాల వర్షాలు రైతులను కోలుకోని దెబ్బతీశాయి. మిర్చి తడిసిన ప్రాంతాల్లో నాణ్యత తక్కువగా ఉందని వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పూర్తి స్థాయిలో నాణ్యత అంతగా తగ్గలేదని, స్వల్ప మార్పు మాత్రమే వచ్చిందని రైతులు తెలిపారు.