Oct 31,2020 22:32

సమాజం.. స్త్రీ.. విముక్తి కావాలంటే సోషలిస్టు మార్గం ద్వారానే సాధ్యం. అదే అక్టోబర్‌ విప్లవం, అనంతర సోవియట్‌ యూనియన్‌ ఏర్పాటు ప్రపంచానికి అత్యద్భుతంగా నిరూపించాయి. ప్రపంచంలోనే తొలి సోషలిస్టు దేశమైన రష్యాలో బోల్షివిక్‌ పార్టీ నాయకత్వంలో లెనిన్‌ రూపొందించి, ఆచరించిన విధానాలతో స్త్రీలు, పిల్లలు గొప్ప ఫలితాలు పొందారు. జార్‌ ప్రభుత్వాన్ని కూలదోసే విప్లవోద్యమాల్లో,
ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో స్త్రీలూ సమ భాగస్వాములయ్యారు. 'మహిళలు సంపూర్ణ స్వేచ్ఛ పొందనంత వరకూ శ్రామికవర్గం పూర్తి స్వేచ్ఛ పొందలేదు' అన్న లెనిన్‌ మాటలు అక్షరసత్యాలు. అక్కడ మహిళలు దానికి దగ్గరగా వెళ్లారు. అక్టోబర్‌ విప్లవం స్త్రీ విముక్తి కోసం చేసిన బహుముఖ పోరాటాల అనుభవం, సాధించిన విజయాలపై ప్రత్యేక కథనం.


కొద్దికాలపు పారిస్‌ కమ్యూన్‌ అనుభవాన్ని పక్కనపెడితే.. ప్రపంచంలో కార్మికవర్గ తొలి రాజ్యం ఏర్పరిచింది అక్టోబర్‌ విప్లవం. బూర్జువా రాజ్యాంగాన్ని రద్దు చేసి, శ్రామికవర్గ నియంతృత్వ రాజ్యాంగాన్ని నెలకొల్పింది ఈ విప్లవం. దోపిడీకి, పీడనకు, ఆకలికి, అణచివేతకు, వివక్షకు, అన్యాయాలకు గురైన కార్మిక, పీడిత వర్గం రాజ్యాధికారం చేపట్టేలా చేసింది అక్టోబర్‌ విప్లవం. సోషలిజం కల కాదు నిజమంటూ.. ఆ సమాజాన్ని అవనిపై అనుభవంలోకి చూపించింది ఈ విప్లవం.. 1917 మొదలు మూడు దశాబ్దాలకు పైగా ప్రపంచంలో పెట్టుబడిదారీ విష వలయంలోని మానవాళికి సమానతను చాటిచెప్పింది అక్టోబర్‌ విప్లవం. సోషలిస్టు సమాజం నిలిచి, గెలిచిన తీరు మానవాళికి నిజంగా కొత్త బంగారులోకమే.

మహిళా విముక్తికి మార్గదర్శనం... అక్టోబర్ విప్లవం..!


స్త్రీ వికాస సాధన..
అక్టోబర్‌ విప్లవం ఊహాజనితంగా రాలేదు. ఆయాచితంగానూ రాలేదు. ఎందరో త్యాగాల, కష్టాల, పోరాటాల, సైద్ధాంతిక, రాజకీయ సంఘర్షణల మధ్య కార్మికవర్గ సిద్ధాంతం పదును తేలింది. మార్క్సిజం సైన్సును మరింత అభివృద్ధిచేసి, దోపిడీ సమాజానికి వర్తింపజేసిన ఫలితమే లెనినిజం. అందులో స్త్రీ సమ భాగస్వామ్యం విస్మరించలేనిది.. విలువైనది. స్త్రీ విముక్తికి చేసిన బహుముఖ పోరాటంలో అక్టోబర్‌ విప్లవం అనుభవం, సాధించిన విజయాలు అపూర్వం. అవి చట్టాల్లోనూ, భౌతికంగానూ మార్పుకు దోహదపడింది. సామాజికోత్పత్తిలో స్త్రీ-పురుష శ్రమ విభజనలో, కుటుంబంలోనూ స్త్రీ వికాసానికి దోహదపడింది. అంతేకాదు పార్టీలో స్త్రీల పాత్ర, పార్టీ పాత్ర చాలా కీలకమైంది.


స్ఫూర్తినిచ్చిన విధానాలు..
విప్లవం వచ్చిన తొలి ఆరునెలల్లోనే ఉన్న చట్టాలన్నింటినీ రద్దు చేశారు. స్త్రీ-పురుష వివక్షకు తావులేని చట్టాలను సోవియట్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. భూస్వామ్య విధానాన్ని రద్దు చేసింది. భూమిని పేద రైతులకు పంపిణీ చేసేలా తొలి ఉత్తర్వులను ఇచ్చింది. లెనిన్‌ సంతకం చేసిన ఈ ఉత్తర్వు మహిళా రైతులకూ భూమిపై సమానహక్కును కల్పించింది. అక్టోబర్‌ విప్లవానంతరం నవంబర్‌ 11వ తేదీన 8 గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టే ఉత్తర్వునిచ్చింది. ఆ కాలంలోనే స్త్రీలు రాత్రివేళల్లో పనిచేయడాన్ని నిషేధిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వు స్త్రీలకి గొప్ప ఉపశమనం. శ్రామిక మహిళలకు 16 వారాల కనీస ప్రసూతి సెలవును ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిగా స్త్రీలకి నెలసరి సమయంలో ఐచ్ఛిక సెలవుని ఇచ్చింది. ప్రసూతి సదుపాయాల్ని మరింత విస్తృతం చేస్తూ 1918లో పసిబిడ్డలకు పాలిచ్చేందుకు తల్లులకు ప్రతి మూడు గంటలకోసారి విరామ సమయాన్ని కేటాయించింది. స్త్రీలకు సమాన వేతనాన్ని కల్పించేలా కనీసవేతన ఉత్తర్వు తెచ్చింది. భూమి, పనికి సంబంధించి స్త్రీలకు చట్ట సౌకర్యం కల్పించిన దేశం ఏదైనా ఉందంటే అది సోవియట్‌ యూనియనే. అనేక దశాబ్దాల తర్వాత సోవియట్‌ అందించిన ఈ స్ఫూర్తితో పెట్టుబడిదారీ దేశాల్లో ప్రజలు ఆయా ప్రభుత్వాలపై వర్గ పోరాటాలతో ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా నిర్బంధంగా వీటిల్లో కొన్ని చట్టాలు ఆ ప్రభుత్వాలూ చేయాల్సి వచ్చింది.


స్త్రీలకు ఓటు హక్కు
సోషలిస్టు ప్రభుత్వం 1918లో తొలి రాజ్యాంగాన్ని స్వీకరించింది. స్త్రీలకూ ఓటు హక్కు కల్పించింది. అన్ని రంగాల్లో స్త్రీలకు సమానహక్కు పొందేలా సంస్థాగత ఏర్పాట్లు చేసింది. బ్రిటన్‌ కరటే దశాబ్దం ముందే రష్యా మహిళలు ఓటు హక్కు పొందారు. అమెరికాలో స్త్రీలకు ఓటు హక్కు 1920లో లభించింది. నిర్బంధ విద్యావ్యాప్తికీ ఉత్తర్వును జారీ చేసింది. భారత్‌లో అక్షరాస్యతా కార్యక్రమం చేపట్టి 'ప్రతి ఒక్కరం ఇంకొకరికి బోధిద్దాం' అన్న నినాదాన్ని సోషలిస్టు రష్యా 1919 డిసెంబర్‌లోనే చట్టంగా తెచ్చింది. దీంతో 20 ఏళ్లలో రష్యా స్త్రీలలో నిరక్షరాస్యత దాదాపుగా కనుమరుగైంది. ఇవన్నీ కుటుంబ చట్ట పరిధిలో తీసుకున్న విప్లవాత్మక చర్యలే. కుటుంబంలో నెలకొన్న పురుషాధిపత్యాన్ని, పాశ్చాత్య స్త్రీ వాదులు సవాల్‌ చేయడానికి కొన్ని దశాబ్దాల ముందే తొలి సోషలిస్టు ప్రభుత్వం పితృస్వామిక చట్టాలను, కుటుంబ కట్టుబాట్లనూ రద్దు చేసేసింది. ఈ విజయాల్ని సమీక్ష చేస్తూ లెనిన్‌ 'మేం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో సాధించిన విజయాల్లో కనీసం వందోవంతైనా ప్రపంచంలోని ఏ ఒక్క ప్రజాతంత్ర పార్టీగానీ, ఎంతో పురోగమించిన బూర్జువా రిపబ్లిక్కులుగానీ చేయలేకపోయాయి. స్త్రీలకు పురుషులతో సమాన స్థానం కల్పించని హేయమైన చట్టాల్ని సమూలంగా నేలమట్టం చేశాం'. ఇది న్యాయమైన, సమానమైన చట్టాల రూపకల్పన దిశగా వేసిన అతి పెద్ద అడుగు.


నాడే అలాంటి మార్పు..
స్త్రీల పట్ల వివక్ష చూపే చట్టాలన్నీ విప్లవంలో కొట్టుకుపోయాయి. వాటి స్థానంలో స్త్రీలకు సమాన హక్కుల్ని ఇచ్చే చట్టాలు తెచ్చారు. పెళ్లి, విడాకులు, శిశు సంరక్షణ, భరణం, ఆస్తిలో సమానవాటా వంటివన్నీ నాడే తీసుకొచ్చారు. సక్రమ, అక్రమ సంతానం మధ్య ఉన్న భేదాన్నీ తొలగించారు. చిన్నారుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే స్వీకరించింది. మన దేశంలో ఇప్పటికీ దీనిపై సరైన విధానం లేదు. అయితే 18 ఏళ ్ల వయసు వరకూ తల్లిదండ్రుల సంరక్షణ పొందే చట్టబద్ధమైన హక్కు పిల్లలకి ఉంటుంది. అబార్షన్‌ చేయించుకునే హక్కు మహిళలకు కల్పించారు. స్వలింగ సంపర్కం, ఇతరత్రా ఏకాభిప్రాయ లైంగిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను ఆ ప్రభుత్వం నాడే రద్దు చేసింది. మనదేశంలో గత ఏడాదే ఒక చట్టం తెచ్చింది. ఈ విషయాలపై సోషలిస్టు ప్రభుత్వం 1923 అధికారికంగా ఒక పత్రం విడుదల చేసింది. అందులో 'ఏ ఒక్కరూ గాయపడనంత వరకూ ఏ ఒక్కరి హక్కులకు భంగం వాటిల్లనంత వరకూ ప్రభుత్వంగానీ, సమాజంగానీ లైంగిక సంబంధ అంశాల్లో జోక్యం చేసుకోదు' అని ప్రకటించింది. వ్యభిచారం చట్ట వ్యతిరేకమైందని ప్రకటించకపోయినా, దానిని నిరుత్సాహపరచింది. ఆ వృత్తిలో ఉన్న వారికి ఉపాధి కల్పించి, ఉత్పత్తిలో భాగస్వాముల్ని చేసే ప్రయత్నం చేసింది.


వివాహ నమోదు తప్పనిసరి
శతాబ్దాల కాలం నాటి సంప్రదాయాల్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. వాటి స్థానంలో సమానత నెలకొల్పే చట్టాన్ని ప్రవేశపెట్టింది. గృహహింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంది. నేటికీ మనదేశంలో ఈ చట్టం పోరాడి తెచ్చుకున్నా.. సాక్షాత్తూ డీజీపి స్థాయి అధికారులే భార్యలపై తీవ్రహింసకు పాల్పడుతున్న స్థితి కొనసాగుతోంది. ఈ విషయంలో అక్కడ సమాజంలోనూ అసమ్మతి ఉండేది. పెట్టుబడిదారీ దేశాల్లో భర్తల నుంచి తీవ్ర హింస ఎదురయ్యేది. వీటితో పోలిస్తే సోషలిస్టు రష్యాలో కొంత మెరుగే. అయితే విడాకుల చట్టాల సరళీకరణ, వివాహాల నమోదు తొలగింపును పురుషులు అవకాశంగా తీసుకునేవారు. స్వల్పకాల బంధాల వల్ల స్త్రీలు లైంగిక దోపిడీకి గురయ్యేవారు. ఒక్కోసారి పసిపిల్లలతో సహా రోడ్డున పడాల్సిన దుస్థితి. దీంతో సోవియట్‌ ప్రభుత్వం కుటుంబ నియమావళిని సవరించింది. వివాహ నమోదును తప్పనిసరి చేసింది. అంతేకాక విడాకుల అనంతరం భరణం ఇవ్వాల్సిందే. ఈ మార్పులతో అలాంటి ఇబ్బందులకు గురిచేసే పురుషుల్ని కట్టడి చేసే వీలు కలిగింది. కుటుంబం, వ్యక్తుల సంబంధాల విషయంలో జరిగే చర్చలపై ఈ మార్పు ప్రభావం చూపింది. అయితే పితృస్వామిక భావజాలం తిరిగి బుసలు కొట్టడాన్నీ విస్మరించలేం. భౌతిక పరిస్థితుల్లో వచ్చిన మార్పు పురుష జాత్యహంకార సిద్ధాంతాల్ని ఓటమిపాలు చేస్తుందనుకున్న భ్రమల్ని ఇది పటాపంచలు చేసింది.


స్టాలిన్‌ యుగంలో.. స్త్రీ ఆర్థిక ప్రగతి
ఆ తర్వాత స్టాలిన్‌ నాయకత్వంలో స్త్రీలు అద్భుతమైన ఆర్థిక ప్రగతిని సాధించారు. ఆ సమయంలో భిన్నమైన సవాళ్లూ ఎదురయ్యాయి. దేశ సంరక్షణ కోసం స్టాలిన్‌ స్ఫూర్తితో చేసిన సాహసోపేతమైన పోరాటంలో స్త్రీలు వీరోచిత పాత్ర పోషించారు. అయితే ఈ కాలంలో మరీ ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధానంతరం పోరు వల్ల ధ్వంసమైన దేశాన్ని పునర్నిర్మించడంలో కుటుంబం పాత్ర కీలకమైంది. ఒకప్పుడు వ్యతిరేకించిన తల్లి ప్రాధాన్యతను పునరుద్ధరించారు. అలాగే గర్భస్రావం చేయించుకునే హక్కు తలకిందులైంది. దీంతో 1955లో తిరిగి దానిని తీసుకొచ్చారు. కుటుంబంలో స్త్రీ ప్రాధాన్యతను తిరిగి ప్రవేశపెట్టారు. స్త్రీలు, చిన్నారుల సంరక్షణకు ప్రవేశపెట్టిన చట్టంతోపాటు యుద్ధానంతర కాలంలో చేపట్టిన అనేకాంశాల్లో పరాజయం ప్రారంభమైంది. 'కుటుంబ నిర్మాణాలు, స్త్రీ-పురుష వ్యక్తిగత సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటాయి.. మారుతుంటాయి..' అని ఏడు దశాబ్దాల సోషలిస్టు అనుభవం నిరూపించింది. ఈ విషయాన్ని సోవియట్‌ తీవ్ర విమర్శకులు సైతం అంగీకరించాల్సిన వాస్తవం.


సామాజిక విముక్తిలో స్త్రీ నేతల పాత్ర
రాజకీయాలు, ఉపాధి, చట్టపరమైన అంశాల్లో స్త్రీలకు శిక్షణ ఇచ్చేందుకు పార్టీ ప్రత్యేకమైన మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది లెనిన్‌ ప్రోత్సాహంతోనే సాధ్యమైంది. స్త్రీలకు శిక్షణ ఇవ్వడంలో ఈ విభాగం అద్భుతంగా పనిచేసింది. విప్లవోద్యమ కాలంలో పార్టీలో స్త్రీలు 10 శాతం మాత్రమే. ఆ తర్వాత మహిళా విభాగం ద్వారా పార్టీ కోట్లాదిమంది స్త్రీలకు చేరువైంది. సైద్ధాంతిక శిక్షణ ఇచ్చేందుకుగానూ మహిళా కమ్యూనిస్టు కార్మికుల కోసం ప్రత్యేకంగా పత్రికలను పార్టీ తీసుకొచ్చింది. దీంతో ఫలితాలు ఉత్తేజకరంగా వచ్చి, మహిళా ప్రాతినిధ్యం పెరిగింది. తొలి పదేళ్లలో అన్ని స్థాయిల్లోనూ 40 శాతం మహిళలు ఎన్నికయ్యారు. ఈ చారిత్రక విజయాన్ని నేటికీ పెట్టుబడిదారీ దేశాలతో పోల్చలేము. అయితే మహిళా విభాగపు ప్రయోజనం నెరవేరిందనుకొని, 1903లో సోవియట్‌ దీన్ని ఎత్తివేసింది. ఇది అపరిపక్వ నిర్ణయమని, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని వెనక్కి తిరిగి చూస్తే అర్థమయ్యే విషయం.


నవ్య ప్రపంచం నిర్మాణంలో..
స్త్రీ ప్రగతి సాధ్యమైంది. కుటుంబం లోపల, బయట పురుషాధిక్యాన్ని ఎదుర్కొని, మహిళా నేతలు ఆత్మవిశ్వాసంతో ముందుకొచ్చారు. అందుకు లెనిన్‌ అందించిన ప్రోత్సాహమే ప్రధాన కారణం. నవ్య ప్రపంచాన్ని నిర్మించేందుకు రాత్రింబవళ్లూ శక్తివంచన లేకుండా కృషి చేసిన వీరోచిత కమ్యూనిస్టు మహిళా నేతలలో అలెగ్జాండ్రా కొల్లంతారు, ఇనెస్సా అర్మాండ్‌, ఎన్‌.కృపస్కయా, కె.శామ్లినోవా, మరియా ఉల్యనోవా, సోఫియా స్మిదోవిచ్‌, ల్యుద్మిలా స్టల్‌, రోసాలియ జ్మెలియాచిక, ఎనోవా స్టసోవా, వెరా గొలులెవ, పోలీనా వి, అలెగ్జాండ్రా అల్టుఖినా, వెరా లెబెడెవా వంటి వారెందరో ఉన్నారు. ప్రభుత్వంలో, రెడ్‌ ఆర్మీలో, పార్టీలో, చట్టపరమైన రంగాల్లో, సోవియట్‌ లో, పలు కమిషన్లలో, విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో ముందుపీఠిన నిలిచిన ఈ స్త్రీలంతా విప్లవోద్యమ మార్గదర్శులే. సామాజిక మార్పుకు, పరిణామానికి ఇవన్నీ క్రియాశీలకంగా పనిచేశాయి.


మహిళా నేతల వ్యక్తిగత చరిత్రలన్నీ సాహిత్య రూపంలో అనేక పుస్తకాల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లోని సమాచారం ఆసాంతం తొలి సోషలిస్టు రాజ్య నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో స్త్రీలు పోషించిన కీలకపాత్రను కళ్ల ముందుంచుతుంది. అక్టోబర్‌ విప్లవ వేళ.. రష్యాతో సహా పూర్వ సోషలిస్టు దేశాల్లో స్త్రీల హోదాను పెట్టుబడిదారీ ప్రతీఘాత విప్లవం దెబ్బతీసింది. పాత అసమానతలన్నీ అక్కడ తిరిగి తిష్టవేశాయి. స్త్రీలు అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నట్లు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. సోవియట్‌ యూనియన్‌ ఇన్నేళ్ల చరిత్రలో మహిళా విముక్తి కోసం చేసిన పోరాటంలో ఎన్నో ఎత్తుపల్లాలు, గొప్ప విజయాలు, వైఫల్యాలు ఉన్నాయి. అయితే స్త్రీ, సామాజిక విముక్తి సోషలిజంలోనే సాధ్యమని ఈ విప్లవం నిరూపించింది. అదే మనం అవగాహన చేసుకోవాలి.. అందుకోసం అందరం అడుగులు కదపాలి.

విప్లవం ఆవిర్భావం..


విప్లవం ఆవిర్భావం..
అది 1917 సంవత్సరం, నవంబర్‌ 7 అర్ధరాత్రి గడ్డకట్టే చలిలో రష్యన్‌ ప్రజలు, తిరుగుబాటు సైన్యంతో కలసి వీధుల్లో వీరవిహారం చేశారు. రష్యన్‌ పాత కేలండర్‌ ప్రకారం అక్టోబర్‌ 25. అందుకే దానికి 'అక్టోబర్‌ విప్లవం' అనే పేరు. అది మామూలు తిరుగుబాటు కాదు. ప్రపంచ చరిత్రలో అత్యద్భుతమైన ఘట్టం. అప్పటివరకు ఎవరూ కనీవినీ ఎరుగని సరికొత్త ఉషోదయం. 'నెత్తిమీద పావలా పెడితే పైసాకూ కొరగాని లేబర్‌ వెధవలు తమ అధికారాన్ని సవాల్‌ చేస్తారా?' అంటూ పెట్టుబడిదారులు, భూస్వాములు గాండ్రించిన సమయం. 'సర్వాధికారం సోవియట్లకే (స్థానికంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు) యుద్ధం వద్దు.. శాంతి కావాలి..' అంటూ రష్యన్‌ కార్మికవర్గం, రైతులు, కూలీలు, తిరుగుబాటు సైనికులతో కలసి నాటి నిరంకుశ చక్రవర్తి జార్‌ సైన్యాన్ని ఓడించారు. అందులో మహిళలూ పెద్దఎత్తున పాల్గొన్నారు. వింటర్‌ ప్యాలెస్‌పై ఎర్రజెండా ఎగురవేసి, విజయదుందుభి మోగించారు. తెల్లవారేసరికి ఓ కొత్తరాజ్యం... అదీ కార్మికవర్గ నాయకత్వంలో... లెనిన్‌ సారథ్యంలో నూతన రాజ్యం ఆవిర్భవించింది.

ప్రభావంతమైంది..
అక్టోబర్‌ విప్లవానంతరం రష్యాలో భూములపై భూస్వాముల ఆధిపత్యాన్ని తొలగించారు. భూమి ఉమ్మడిసొత్తుగా మారింది. భూమిని దున్నే రైతులంతా దానికి యజమానులు. సహకార వ్యవసాయం అమల్లోకి వచ్చింది. కమ్యూన్లు ఏర్పడ్డాయి. ఫ్యాక్టరీలు కార్మికుల పరమయ్యాయి. మొదటి పదేళ్లలో యూరప్‌లోని మిగతా దేశాలకు భిన్నంగా నిరక్షరాస్యతను సంపూర్ణంగా నిర్మూలించింది. అందరికీ ఉపాధి కల్పించింది. 1936లో ఆఖరి ఎంప్లాయిమెంట్‌ ఎక్ఛేంజీ మూసేశారు. పాలన లో, యాజమాన్యంలో మహిళలు సమాన భాగస్వాములయ్యారు. పురుషులతో సమానంగా అన్ని హక్కులూ సాధించుకున్నారు. అప్పటికింకా అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కూడా లేదు. ఎంతో వెనుకబడిన ఒక దేశాన్ని శాస్త్ర, సాంకేతికాభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దింది. మనదేశంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, పెరియార్‌, అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ లాంటి ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, మేధావులు, విప్లవకారులు ఆ విప్లవాన్ని స్వాగతించారు.. బలపరిచారు.

మన దేశంలో.. ప్రస్తుతం ...


మన దేశంలో.. ప్రస్తుతం ...
సంస్కరణలు, వాటి ప్రభావం మాత్రమే ఈ తరానికి తెలుసు. ప్రజా సంపదను కొందరు ఎలా కొల్లగొడుతున్నారో ప్రత్యక్షంగా నేడు చూశారు. నేడు అత్యధికులు ఉపాధి లేమి, అస్థిరత, అశాంతిని అనుభవిస్తున్నారు. మనువాద సిద్ధాంతాన్ని, నూతన ఆర్థిక విధానలను మేళవించి పాలకపక్షం వ్యహరిస్తోంది. ఇది మహిళలను, రైతులను, ప్రధానంగా యువతను తీవ్ర ఆవేదన కలిగించి, ఆవేశాన్ని రగిలిస్తోంది. ఈ అత్యాచార భారతంలో పాలకులే నిందితుల పక్షాన నిలబడే నిస్సిగ్గు పరిస్థితుల్లో స్త్రీలూ పోరాటాల్లోకి వస్తున్నారు. రైతు వ్యతిరేక బిల్లులతో వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ల వశం చేస్తున్న దుస్థితి. దీనికి వ్యతిరేకంగా రైతులూ ఆయా రాష్ట్రాల్లో కదం తొక్కుతున్నారు. యువత రాజకీయాలకు దూరంగా ఉండాలనే సిద్ధాంతాల్ని పక్కనపెట్టి ఉద్యమాల్లోకి వస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. పాలకపక్షాల తీరుపై స్వతంత్రంగా, నిర్మొహమాటంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహం కరోనాను సైతం పక్కనపెట్టి.. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో కనిపిస్తోంది. నిర్భయ నుంచి హథ్రాస్‌ హత్యాచార ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఒకప్పుడు గుజరాత్‌ మోడల్‌ అన్న మోడీ.. ఉత్తర ప్రదేశ్‌ ఇప్పుడు వారి మనువాద విధానాలకో ప్రయోగశాల. అందులో భాగంగా పాలకపక్షాలే అత్యాచార నిందితుల కొమ్ము కాస్తున్నాయి. కాశ్మీర్లో ఆసిఫా ఘటనలో మొదట చూశాం. ఇప్పుడు యుపిలో వరుస సంఘటనల్లో చూస్తున్నాం. ఈ చర్యల పట్ల మహిళలు, దళితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ వ్యతిరేకత రేపు జరిగిన, జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లోనూ ప్రతిబింబించొచ్చు. రాజకీయాలొద్దనే భావం స్థానంలో మంచి రాజకీయాలు కావాలనే భావాలు వస్తున్నాయి. 'మంచి పాలన, మంచి రాజకీయాలు' వంటి నినాదాలకు వీళ్లు ఆకర్షితులవున్నారు. ఆందోళనలు, సమ్మెలలో భాగస్వాములవుతున్నారు. పాత-కొత్త భావాల మధ్య సంఘర్షణ మొదలైంది. వర్తమాన సమస్యలకు పరిష్కారం చూపే మార్గం కోసం వెతుకులాట ఆరంభమైంది. ఇదే ఈ తరంలో వస్తున్న కొత్త మార్పు. దీన్ని అభ్యుదయ శక్తులు స్వాగతించి, అవగాహన చేసుకోవాలి. దాని కనుగుణంగా ఆ ఉద్యమాలకు సారథ్యం వహించాలి.

- నవ్యసింధు
8333818985