
'రోజా' సినిమాలో చిన్ని చిన్ని ఆశ పాట గుర్తురాగానే పల్లెటూరి అమ్మాయిలా గడుసుగా ఉండే మధుబాల గుర్తొస్తుంది. ఆ సినిమా వచ్చి ఏళ్లు గడిచినా ఇప్పటికీ మరిచిపోలేం. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మధుబాల ఆ తరువాత 'జెంటిల్ మెన్, తెలుగులో అల్లరి ప్రియుడు, చిలక్కొట్టుడు' వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో తక్కువ సినిమాల్లో నటించిన మధుబాల దాదాపు ఐదారు భాషల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా ఉండేవారు. అయితే మధుబాల అసలు పేరు పద్మమాలిని. ముంబైలో చదివే రోజుల్లో మధుగా పేరు మార్చారు. తల్లి వద్ద భరత నాట్యం నేర్చుకున్న మధు బాలచందర్ సినిమాలో నటించే సమయంలో మధుబాలగా మార్చుకున్నారు. ఇక పరిశ్రమలోకి రావడానికి హేమామాలిని స్ఫూర్తి అంటూ చెప్పే మధుబాల హేమామాలిని మేనకోడలు. కాగా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని, అమెరికా వెళ్లిపోయిన చాన్నాళ్లకు నిఖిల్ నటించిన 'సూర్య వర్సెస్ సూర్య'తో టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తాజాగా 'ప్రేమదేశం' అనే చిత్రంలో నటించిన మధుబాల ఆ చిత్రం ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొంటూ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటా..
ఇక 'నా కెరీర్ ప్రారంభంలో ఈ భాషలోనే చేయాలి.. ఆ భాషలోనే చేయాలని అనుకోలేదు. అన్ని భాషల్లో సినిమాలు చేశా. ఈ మధ్యే నేను ఒక తెలుగు సినిమాను పూర్తిచేశాను. ''గేమ్ ఆన్'' అనే చిత్రం అద్భుతమైన కథ. నా వద్దకు వచ్చిన వాటిల్లో నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటాను. నెగెటివ్ రోల్ అయినా, కామెడీ రోల్ అయినా నేను చేసేందుకు రెడీగా ఉన్నా. ప్రస్తుతం హిందీలో 'కర్తమ్ హుక్తమ్' సోనమ్ షాతో కలిసి చేస్తున్నా. మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. జీ5లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. వివేక్ శర్మ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాను. ఈ మధ్యే ''కలిబలి'' అనే సినిమా వచ్చింది' అని అన్నారు.
మిగతా భాషల్లో కాస్త డిఫరెంట్..
'నేను ఇది వరకు చాలా వరకు తల్లి పాత్రలు పోషించాను. కానీ, ఈ చిత్రంలో తల్లీకొడుకుల రిలేషన్ చాలా చక్కగా చూపించారు. ''ప్రేమదేశం'' అనే టైటిల్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలోని మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇండిస్టీలో ఎప్పుడూ పోటీతత్వం ఉంటుంది. మనకు ఏ పాత్ర అవకాశం ఉంటే.. ఆ పాత్రలు వస్తాయి. తమిళ్ మిగతా భాషల్లో కాస్త డిఫరెంట్ అనిపిస్తుంది. తెలుగులో అయితే దర్శకులతో చర్చించే అవకాశం ఉంటుంది. తెలుగు భాష నాకు అంతగా తెలియకపోయినా మిగతా భాషల్లో నటించిన దానికంటే బాగా నటించానని అనిపిస్తుంది. నేను ''దేజావు'' అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాను. తమిళ్ దేజావులో కంటే తెలుగు దేజావులోనే చక్కగా చేసినట్టు అనిపిస్తుంది' అని చెప్పుకొచ్చారు.
పోటీతత్వం ఎప్పుడూ ఉంటుంది..
'నేను ''ప్రేమ దేశం'' లో ఒక హీరోయిన్‌లాంటి పాత్రలోనే కనిపిస్తాను. నా కెరీర్ ప్రారంభంలో అన్ని భాషల్లోనూ సినిమాలు చేశాను. ఇప్పుడు తెలుగులో చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది. అందుకే తెలుగు మీద ఫోకస్ పెట్టాను.
గతంలో హీరోయిన్‌గా నటించాను. అయితే ఇప్పుడు అలాంటి పాత్రలు చేయలేను.. కాబట్టి, తల్లి పాత్రలు చేస్తున్నాను. ''ప్రేమదేశం''లోని పాత్రను నా కోసమే రాశానని దర్శకుడు అన్నారు. నేను ముందు నో చెప్పాను. కానీ పలుమార్లు కలిసి, ఒత్తిడి చేయడంతో అంగీకరించాను. అయితే ఇండిస్టీలో ఎప్పుడూ పోటీతత్వం ఉంటుంది. హీరోయిన్‌గా చేసినప్పుడు అంతే, ఇప్పుడూ అంతే. కానీ దాన్ని నేను కాంపిటీషన్‌లా ఎప్పుడూ చూడను' అని వివరించారు.
ఫ్యామిలీతో కలిసి నటించాలనుంది..
'సుహాసిని, చారుహాసన్ ఇలా అందరూ కలిసి ఓ వెబ్ సిరీస్ చేశారు. అలా మాకు కూడా ఫ్యామిలీ అంతా కలిసి నటించాలని ఉంది. కానీ సరైన కథ దొరకాలి. అయితే ఆ ప్రాజెక్ట్‌ను మాత్రం మేం నిర్మించం. కేవలం నటించాలని మాత్రమే ఉంది. పెద్ద సినిమాలు, నెగెటివ్ రోల్స్ చేయాలని అనుకుంటున్నాను. అయితే, నేను బయట చాలా ఫన్నీగా ఉంటాను. తమిళ్‌లో నేను ''స్వీట్‌కార్న్ కాఫీ'' అనే వెబ్ సిరీస్‌లో ఫుల్ కామెడీ రోల్ చేశా. ఆ వెబ్ సిరీస్ చూశాక.. అందరూ నా కామెడీ టైమింగ్ బాగుందని అన్నారు.'
పేరు: మధుబాల రఘునాథ్
అసలుపేరు: పద్మమాలిని
పుట్టిన తేదీ: మార్చి 26, 1972
పుట్టిన ప్రాంతం: చెన్నరు
భర్త: ఆనంద్ షా
పిల్లలు: ఆమెయా షా, కేయ షా.
తల్లిదండ్రులు: రఘునాథ్, రేణుకా
హాబీస్: షాపింగ్, డ్యాన్సింగ్, కుక్కింగ్