Jun 10,2022 06:46

పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) విషయంలో మరోసారి మోడీ ప్రభుత్వం రైతులను దగా చేసింది. రానున్న ఖరీఫ్‌ పంటలకు ఎంఎస్‌పి నిర్ధారిస్తూ ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఆహార పంట వరి మద్దతు ధర నిరుటికీ ఈ ఏటికీ పెరిగింది క్వింటాకు వంద రూపాయలు. గతేడాది రూ.1,940 కాగా ఇప్పుడు 2,040. ఎంఎస్‌పి ప్రకటించిన 14 పంటల్లో గరిష్టంగా నువ్వులకు 523 పెంచగా కనిష్టంగా మొక్కజొన్నకు 92 పెరిగింది. రైతులు పంట పండించడానికి చేసే ఖర్చుకు 50 శాతం కలిపి మద్దతు ధర ఇచ్చామన్న కేంద్ర బిజెపి సర్కారు ప్రచారం శుద్ధ అబద్ధం. ఎంఎస్‌పి ప్రకటించిన ప్రతి సందర్భంలో ఈ విధంగానే బుకాయిస్తోంది. రైతుల స్థితిగతులపై అధ్యయనానికి సుప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్‌ స్వామినాథన్‌ కమిటీని యుపిఎ-2 ప్రభుత్వం వేసింది. కమిటీ సిఫారసులను కాంగ్రెస్‌ అమలు చేయలేదంటూ తెగనాడి, తాము రాగానే అమలు చేస్తామని 2014 ఎన్నికల సభల్లో మోడీ హామీ ఇచ్చారు. ఒక కేసులో సుప్రీంకోర్టుకు స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేయడం సాధ్యం కాదంటూ మోడీ సర్కారు అఫిడవిట్‌ ఇచ్చింది. మరోవైపు స్వామినాథన్‌ చెప్పినట్లు ఎంఎస్‌పి ఇచ్చేశామని తప్పుడు ప్రచారం చేయడం బిజెపికే చెల్లింది.
         వ్యవసాయోత్పత్తుల వ్యయాలు, ధరల కమిషన్‌ (సిఎసిపి) ప్రతి ఏడాదీ పంటలకు ఎంఎస్‌పి ఎంత ఉండాలో కేంద్రానికి నివేదిక ఇస్తుంది. సిఎసిపి నివేదిక అసమగ్రమే అయినా ఆ రిపోర్టును సైతం కేంద్రం పరిగణనలోకి తీసుకోవట్లేదు. 2022 సిఎసిపి నివేదికనే తీసుకుంటే క్వింటా వరి ధాన్యం పండించడానికి రైతుకు అయ్యే సమగ్ర ఖర్చు (సి2) రూ.1,805. సి2కు అదనంగా 50 శాతం కలిపి ఎంఎస్‌పి ఇవ్వమన్నారు స్వామినాథన్‌. ఆ ప్రకారం కనీస మద్దతు ధర రూ.2,707 ఇవ్వాలి. రైతులు ఉత్పాదకాలకు పెట్టే ఖర్చు (ఎ2)+ రైతు కుటుంబం శ్రమ (ఎఫ్‌ఎల్‌) వీటినే సర్కారు పరిగణనలోకి తీసుకుంది. ఆ ప్రకారం ఖర్చు 1,360గా పేర్కొని దానికి 50 శాతం కలిపి ఎంఎస్‌పి నిర్ణయించింది. ఇది ముమ్మాటికీ రైతును మోసగించడమే. ఎంఎస్‌పి తగ్గడం వలన రైతుకు జరిగే ఆర్థిక నష్టం అపారం. వరి ధాన్యాన్నే తీసుకుంటే క్వింటాకు రూ.667 తక్కువ ప్రకటించారు. ఎకరాకు సగటున 20 క్వింటాళ్ల వడ్లు పండాయనుకుంటే రైతు కోల్పోయేది రూ.13 వేలకు పైమాటే. ఒక్క ఖరీఫ్‌లో ఎ.పి లో వరి రైతుకు కలిగే నష్టం రూ.5 వేల కోట్లు. దేశ వ్యాప్తంగా నష్టం రూ.1.33 లక్షల కోట్లు. ఈ నష్టం ఒక్క వరి రైతుకు జరిగేది. అన్ని పంటలకూ లెక్కేస్తే రైతుకు కలిగే ఆర్థిక నష్టం ఊహకందదు. ఈ పర్యవసానమే రైతును కుంగదీస్తోంది. సంక్షోభానికి దారులు వేస్తోంది. ఆత్మహత్యల బాట పట్టిస్తోంది.
       దేశంలో వందల సంఖ్యలో పంటలు పండుతుండగా 23 పంటలకే ఎంఎస్‌పి ఉంది. వాటిలోనూ గోధుమ, వరికే, అదీ అరకొరగా అమలవుతోంది. దేశంలో పండే వరిలో 20 శాతానికే ఎంఎస్‌పి వస్తోంది. మిగతా 80 శాతాన్ని రైతులు అయిన కాడికి తెగనమ్ముకొని నష్టపోతున్నారు. ఎంఎస్‌పి దక్కే దాంట్లో 80 శాతం పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకే పరిమితం. ఈ అసమానతలుండగానే మొత్తానికే ఎంఎస్‌పి ఎత్తేయాలని మోడీ ప్రభుతం నల్ల వ్యవసాయ చట్టాలు తేగా రైతాంగం వీరోచితంగా పోరాడి వెనక్కి తీసుకునేలా చేసింది. 2022 కల్లా రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని 2016లో మోడీ ప్రకటించగా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. డీజిల్‌, పెట్రోలు ధరల మూలంగా సాగు ఖర్చులు రైతులకు తడిసి మోపెడవుతున్నాయి. మరోవైపు పంటలకు గిట్టుబాటు ధరల సంగతేమో, ఎంఎస్‌పి లోనూ మోసం జరుగుతోంది. ఇటీవలి నేషనల్‌ శాంపిల్‌ సర్వేలో రైతు కుటుంబ నెలసరి ఆదాయం రూ.10 వేలుగా వెల్లడైంది. రోజువారీ కుటుంబ ఆదాయం రూ.333. పరిస్థితి ఇంత దారుణంగా ఉండగా రైతులకు మేలు చేశామనడం బిజెపి నయ వంచనకు పరాకాష్ట. అన్ని పంటలకూ ఎంఎస్‌పిని గ్యారంటీ చేస్తూ చట్టబద్ధత, స్వామినాథన్‌ సిఫారసుల మేరకు ఎంఎస్‌పి...ఈ డిమాండ్లను రైతాంగం పోరాడి సాధించుకోవాలి. అప్పుడే రైతు మనుగడకు గ్యారంటీ.