Oct 24,2020 06:57

ప్రస్తుతం లాక్‌డౌన్‌ అన్‌లాక్‌లో భాగంగా పిల్లల స్కూళ్లకు, కాలేజీలకు అనుమతులు వచ్చాయి. ఇదే సందర్భంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో బాలలు అసాంఘిక కార్యకలపాలవైపు, బాల కార్మిక వ్యవస్థ వైపు బలవంతంగా నెట్టివేయబడ్డారు. సామాజిక చైతన్యంలో పురోగతి, ప్రజారోగ్యం వంటి వాటిలో నెలకొన్న దారుణ పరిస్థితి మనదేశాన్ని కొన్ని దశాబ్దాల వెనక్కి నెట్టివేసింది. ముఖ్యంగా పేదరిక కుటుంబాలలోని ఎంతోమంది పిల్లలకు చదువు దూరమైంది. వారంతా బలవంతంగా ఆదాయమార్గాల వైపు మళ్లించబడ్డారు.
                 దేశంలో ముఖ్యంగా ఈ కరోనాకాలంలో 5 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో కోటి మందికి పైగా మెకానిక్‌ పనులు, ఫ్యాక్టరీ కార్ఖానాలు, పొలం పనులు, హోటల్‌ పనులు వంటి వాటి వైపు వెళ్లిపోయారు. కర్నాటకలోని ఒక గ్యారేజ్‌లో 18 ఏళ్ల లోపు యువకులు సుమారు 16 గంటలు పని చేయడానికి లాక్‌డౌన్‌లో పనికి కుదిరారు. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా వారు పనిచేస్తూనే ఉంటున్నారు. ఆ శ్రమకు గాను వారికి చాలా స్వల్ప ఆదాయమే వస్తోంది. అయినా పస్తులు పడుకోకుండా ఉండాలంటే ఆ పని చేయకతప్పదు.
                స్కూళ్ల మూసివేతతో ఒక్క మనదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా పిల్లలు రోడ్డు మీదకు వచ్చారు. వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. వివిధ దేశాల పిల్లలు రకరకాల పనుల్లోకి జొరబడాల్సి వచ్చింది. బాల కార్మికుల అంశం ప్రపంచ విపత్తులో ఒక భాగమైనప్పటికీ తీవ్రమైన ఆకలి ఆప్ఘనిస్తాన్‌ నుంచి దక్షిణ సూడాన్‌ వరకు వారిని వెంటాడుతోంది. ఈ కాలంలో ఆఫ్రికా, ఆసియా దేశాలలో బాల్యవివాహాలు ఎక్కువయ్యాయి. ఉగాండా బాలికలు యుక్త వయసులోనే గర్భం దాల్చటం ఈ కాలంలో ఎక్కువైంది.
                ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ... ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్లా 40 లక్షల మంది పిల్లల చదువు అర్ధంతరంగా ముగిసిపోయింది. కోట్లాదిమంది పిల్లలు వారికి అల-వికాని పనుల్లో చిక్కుకుపోయారు. కెన్యాలో పదేళ్ల లోపు మగ పిల్లలు మైనింగ్‌ పనికి వెళుతుంటే ఆడపిల్లలు వ్యభిచార వృత్తిలోకి గెంటివేయబడ్డారు. ఇప్పుడు వారంతా అతి ప్రమాదకరమైన హెచ్‌ఐవి వ్యాధి ముంగిట్లో ఉన్నారు. కుటుంబ పోషణార్థం వేరే గత్యంతరం లేక ఈ మార్గాన్ని ఎంచుకున్నారని సర్వేలు తెలుపుతున్నాయి. లాక్‌డౌన్‌ ప్రారంభమైన మార్చి నుంచి ఇప్పటివరకు కెన్యాలో అత్యధికంగా సుమారు వెయ్యిమంది బాలికల జీవితాలు సెక్స్‌వర్కర్లుగా మారిపోయాయి. పశ్చిమ ఆఫ్రికాలోని పిల్లలు కొబ్బరితోటల పెంపకం పనుల్లో చేరారు. ఇండోనేషియా పిల్లలు ఒంటినిండా సిల్వర్‌ పెయింట్‌ వేసుకుని శిల్పంలా కూర్చొని వీధుల్లో భిక్షమెత్తుకుంటున్నారు.


                                                                 మన దేశంలో...
                 మన భారతదేశంలో లాక్‌డౌన్‌ కాలంలో పిల్లల మానసిక, శారీరక అభివృద్ధి కేంద్రాలైన అంగన్వాడీలను కూడా మూసివేశారు. దీనివల్ల పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల పిల్లలకు బాల్యంలో అందాల్సిన పోషకాహారం అందకుండా పోయింది. అత్యధిక పేదరిక స్థాయిలు, 9 వేల కోట్లకు పైగా జనాభా చౌక శ్రమపై ఆధారపడుతున్నందున మనదేశంలో ఇప్పటికే బాలకార్మిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉంది. బీహార్‌లో గయకు సమీపంలో ఉన్న ఓ నిర్మాణరంగ పనిలో 10 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలే అధికంగా ఉన్నారు. భుజాలపై అధిక బరువైన గ్రానైట్‌ రాళ్లను మోస్తూ ఎత్తైన భవనాలు ఎక్కుతున్నారు. పదేళ్ల షహనాజ్‌ వణుకుతున్న శరీరంతో కాంక్రీట్‌ నిండిన బక్కెట్‌ తలపై పెట్టుకుని భవనం పైకి అందించే పనిలో కుదిరాడు. ఆ పని చేస్తున్నప్పుడు ఆ బాలుని లేత కాళ్లు తడబడుతున్నాయి. కళ్లను బలవంతంగా మూసుకొని, వస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ పనిచేస్తున్నాడు. అతని చుట్టూ అతనికంటే మూడు రెట్లు వయసులో పెద్దవారున్నా ఆ పని షహనాజ్‌కే అప్పగించారు. ఎందుకంటే ఆ పని చేస్తేనే అతనికి ఇచ్చే కూలీ గిట్టుబాటవుతుందనుకుంటాడు ఆ బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌. 'రాత్రిపూట విపరీతమైన తలనొప్పితో నాకు నిద్రపట్టదు. పడుకున్నా పగలు చేసిన పనితో నా ఒళ్లు జలదరిస్తూ ఉంటుంది' అంటాడు షహనాజ్‌ బిక్కమొఖం వేసుకుని.
మనదేశంలో 14 ఏళ్ల లోపు పిల్లలతో కుటుంబ సంబంధిత పనులు మినహా, ఇతర ప్రమాదకర పనులు చేయించుకోవడం చట్టవిరుద్ధం. కానీ కరోనా కాలంలో వారంతా సిగరెట్లు, బీడీలు వంటి హానికారక పదార్థాల తయారీలో, నిర్మాణరంగం, ఇటుక బట్టీలు, హోటల్‌ రంగాలకు మారిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే అర్ధాంతరంగా తమ బాల్యాన్ని ముగించారు.

- జ్యోతిర్మయి