- నాడు 30 వేల ఎకరాల్లో సాగు
- 10 వేలకు పడిపోయిన సాగు విస్తీర్ణం
- గిట్టుబాటు ధరల్లేక విలవిల
- భారంగా మారిన పెట్టుబడులు
- ఆందోళనలో రైతులు
ప్రజాశక్తి-పెద్దమండ్యం (అన్నమయ్య జిల్లా) : అన్నమయ్య జిల్లాలో చెరకు సాగు చితికిపోయింది. ఒకప్పుడు జిల్లాలో 'మూడు పువ్వులు.. ఆరు కాయలుగా' వెలుగొందిన చెరకు సాగు ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎంతో కష్టపడి పండించిన పంటకు సరైన ధర లేక చెరకు రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఒకప్పుడు జిల్లాలో 30 వేల ఎకరాల నుంచి 40 వేల ఎకరాల్లో చెరుకు పంటను రైతులు సాగు చేస్తుండేవారు.
గిట్టుబాటు లేక తగ్గిన సాగు..
చెరకు పంట సాగు చేసిన రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో భారీగా సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. అరకొర సాగైన పంటను కూడా వివిధ రూపాల్లో రైతులు కష్టపడుతూ విక్రయించుకుంటున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే ఫ్యాక్టరీలకు తరలిస్తారు. మరి కొంత మంది రైతులు గానుగ ఆడిస్తున్నారు. చాలా మంది రైతులు ఖర్చులకు బయపడి సంతల్లో వ్యాపారం కోసం సాగు చేస్తున్నారు. దుక్కి దున్నేటప్పుడు నుండి పంట పండించే దాకా డబ్బులు రాకపోవడంతో రైతులు ఆర్ధిక ఇబ్బందులు ఎదురు కొంటున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నగదు చెల్లించినప్పుడు తీసుకుంటూ అంతవరకు పంట సాగుకు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటున్నారు.
ఇబ్బందిగా బారిన ఆంక్షలు
నల్లబెల్లంపై ఆంక్షలు లేని సమయంలో విరివిగా బెల్లం తయారీ చేస్తూ రైతులు బెల్లం అమ్ముకుంటు లాభాలు గడించేవారు. ప్రస్తుతం బెల్లం తయారీ కేంద్రాలు ఎక్కువుగా లేవు. కూలీల ఖర్చు, ప్రమాదాలు వీటిలో దృష్టిలో పెట్టుకొని రైతులు బెల్లం తయారీని నిలిపి వేశారు. పల్లెల్లో రైతులు అక్కడక్కడ కొంత మంది రైతులు మాత్రమే బెల్లం తయారు చేస్తున్నారు. ఈ బెల్లం తయారీలో కూడా నష్టాలు అధికం అవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
భారంగా మారిన పెట్టుబడులు
బెల్లం తయారీకి ఖర్చులు అధికం కావడంలో గిట్టుబాటు ధరలు లేక రైతులు విలవిల్లాడిపోతున్నారు. కిలో బెల్లం తయారీకి దాదాపు40-50 వరకు ఖర్చు అవుతోంది. చెరకు సాగు మొదలు పెట్టినప్పుడు దుక్కి దున్నేటప్పుడు గంటకు రూ.వెయి నుంచి రూ. 1200 ఖర్చు అవుతుంది. ట్రాక్టర్ ఖర్చులకు 10 వేలుకు పైగా అవుతుంది. చెరకు సాగు మద్యలో యూరియా, కూలి ఖర్చులకు ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతోంది. ఒక కూలి ఖర్చు సుమారు రూ.వెయ్యి ఇవ్వాల్సి ఉంది. లేకపోతే కూలీలు దొరకడం కష్టంగా మారింది.
సంస్కృతిని వీడలేక...
పాత సంస్కృతిని వీడలేక నష్టమూనా చెరకు గానుగ మంచిదని బావిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతు లు ఖర్చులు భరించలేక కుటుంబ సభ్యులతోనే చెరకు గానుగాలు ద్వారా నల్లబెల్లం తయారు చేస్తున్నారు. వ్యాపారులు తక్కువ రేటు ఉన్నప్పుడే రైతుల నుండి నల్లబెల్లం కొనుగోలు చేస్తున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరకు రైతులు అభివృద్ధి చెందాలంటే చెరకు పంటకు సైతం ఇన్సూ రన్స్ సౌకర్యం కల్పిస్తే మంచిదని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం చెరకు పంటలలో వ్యవసాయ అధికారులు సరైన సూచనలు, సలహాలు ఇవ్వకపోవడంతో పంట దిగిబడి తక్కువ వస్తుందని రైతులు వెల్లడిస్తున్నారు. వ్యవసాయ అధికారులు చెరకును కొనుగోలు చేసి రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని పలువురు కోరుతున్నారు.
నల్లబెల్లం తయారీపై ఆంక్షలు ఎత్తివేయాలి
ప్రభుత్వం గతంలో నల్లబెల్లం తయారీపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఎత్తివేయాలి. బెల్లంకు ప్రభుత్వం గిట్టుబాట ధర కల్పించి కొనుగోలు చేయాలి. చెరకు పంట పండించేందుకు రుణాలు మంజూరు చేయాలి.
- తుమ్మల మహేశ్వర, రైతు, పెద్దమండ్యం
చెరకు రైతుకు ప్రోత్సహమేదీ ?
చెరకు రైతుకు ప్రభుత్వ ప్రోత్సాహం దారుణంగా వుంది. కనీసం అధికారులు సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం లేదు. మా పోలాలల్లో చెరకు తప్ప వేరే పంట సరిగ్గా పండదు. గత్యంతరం లేక చెరకును పండిస్తున్నాం. గిట్టుబాటు ధర లేక తల్లడిల్లుతున్నాం. అధికారులు చెరకు రైతులకు ప్రోత్సాహం అందించాలి.
- నారా గంగాధర్, రైతు, పెద్దమండ్యం.
చక్కెర ఫ్యాక్టరీలకు తరలిస్తే గిట్టుబాటు ధర
రైతులు పండించిన చెరకును చక్కెర పరిశ్రమలకు తరలిస్తే గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. మండలంలోని వెలిగల్లు, కలిచర్ల, పెద్దమంద్యం పంచాయతీల్లో చెరకు సాగు చేశారు. దగ్గర్లో ఫ్యాక్టరీలు లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. సంతలల్లో అమ్ముకోవటం, గానుగ ఆడుకోవటం వలన బెల్లం అమ్ముకోచ్చు. జ్యూస్ బండ్లకు అమ్మితే కొంత మేరకు నష్టాలు రాకుండా చూసుకోవచ్చు.
- సురేష్ కుమార్‌నాయక్, ఎఒ, పెద్దమండ్యం.










