లక్నో : కనీసమద్దతు ధర (ఎంఎస్‌పి)పై మోడీ ప్రభుత్వం బూటకపు హామీకి వ్యతిరేకంగా ఈ నెల 20న ఛలో ఢిల్లీ చేపట్టనున్నట్లు కార్మీక, రైతు సంఘాలు ప్రకటించాయి. యుపిలోని మీరట్ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్‌లో రైతు సంఘాలు ఈ మేరకు పిలుపునిచ్చాయి. మీరట్ డివిజన్‌లోని వివిధ జిల్లాలతో పాటు బిజ్నోర్, షామ్లి, ముజఫర్‌నగర్, హపూర్, మోర్దాబాద్ జిల్లాలకు చెందిన వందలాది మంది రైతులు పాల్గొన్నారు. వివిధ ట్రేడ్ యూనియన్స్‌తో పాటు భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం)లు నేతృత్వంలో ఢిల్లీలో నిరసన సమావేశాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఎంఎస్‌పి తో పాటు 13 నెలల పాటు చేపట్టిన నిరసనలో రైతులపై నమోదు చేసిన కేసులు కొట్టివేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
అలాగే చెరుకు బకాయిలు వెంటనే చెల్లించాలని, బలవంతపు భూ సేకరణను నిలిపివేయాలని, విచ్చలవిడిగా తిరుగుతున్న పశువులను అదుపుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రైతులకిచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా ప్రధాని మోడీ నెరవేర్చలేదని బికెయు నేత రాకేష్ తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చేంతవరకు ఎస్‌కెఎం ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతుందని రైతు నేతలు పునరుద్ఘాటించారు. చెరకు రైతులకు న్యాయం జరిగేలా చెరకు చట్టం గాని, అలహాబాద్ తీర్పును గాని యుపి ప్రభుత్వం అమలు చేయడం లేదని మండిపడ్డారు. దేశంలోని మొత్తం చెరకు ఉత్పత్తిలో సుమారు 45 శాతం యుపి నుండి ఉత్పత్తి అవుతోందని .. కానీ 11-13 శాతం రికవరీతో దేశంలోనే అత్యల్ప స్థానంలో నిలిచిందని అన్నారు.










