Sep 24,2022 17:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో కార్మికుల భవిష్యత్‌కు ప్రమాదం ఏర్పడిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటీష్‌ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మికులకు హక్కులు లేకుండా చేశారని విమర్శించారు. లేబర్‌ కోడ్స్‌ పేరుతో నాలుగు చట్టాలను తీసుకొచ్చి పెట్టుబడీదారులకు బలవంతంగా పనిచేసే చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగాలు లేకుండా చట్టం తీసుకొచ్చారని తెలిపారు. అవసరాల ప్రతిపాదికన కార్మికులకు వేతనం ఉండాలని దేశవ్యాప్తంగా తాము పోరాడుతుంటే బిజెపి రూ.7వేలు చాలని చెబుతోందన్నారు. అసమర్ధత వల్ల దేశంలో కరోనాతో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. బాధ్యత రహిత ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోందని, నరేంద్రమోడీ ఇచ్చిన హామీలకు అమలు చేస్తున్న విధానాలకు పొంతనలేదని విమర్శించారు. పెట్టుబడీదారులకు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ప్రజలను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రైతులకు అనుకూలంగా చట్టాలు చేసి మద్దతు ధర తేస్తానని చెప్పి చేయలేదన్నారు. ప్రజలను అన్ని విధాల పీల్చిపిప్పి చేసి కార్పొరేట్లకు తొత్తుగా ఉన్న ప్రభుత్వం దేశంలో ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని సాగనింపకపోతే సామాన్యులకు విముక్తి ఉండదన్నారు. రాష్ట్ర విభజన హక్కుల కోసం కేంద్రంపై ఐక్య పోరాటం చేద్దామని చెబుతుంటే జగన్‌, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ పట్టించుకోవడం లేదన్నారు. బూతులు తిట్టుకోవడం తప్ప రాష్ట్రప్రజలు, రైతాంగ అభివృద్ధి వీళ్ల అజెండాలో లేదని విమర్శించారు. మోడీ దయ తమపై ఉంటే చాలు అన్నట్లుగా జగన్‌, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ పాకులాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను మర్చిపోయి బిజెపి భజన చేస్తున్నారని విమర్శించారు. బిజెపి, దాని అనుకూల శక్తులను ఓడిస్తేనే రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల భవిష్యత్తు ఉంటుందన్నారు. రాబోయే కాలంలో ప్రజలు చైతన్యవంతమై పోరాటం చేయాలని కోరారు.
దేశంలో మహిళలను గౌరవించాలి, రక్షించాలని మోడీ ఎర్రకోటపై ప్రకటనలు చేస్తూ మరోపక్క గుజరాత్‌ బలిస్కబాన్‌ నిందితులను స్వాతంత్ర దినోత్సవం రోజు జైలు నుంచి విడుదల చేశారని విమర్శించారు. మహిళలకు మోడీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. పార్లమెంటులో అనేక ప్రజావ్యతిరేక బిల్లులను ప్రవేశపెట్టిన మోడీ పార్లమెంట్‌లో మగ్గుతున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. తనకు 25 ఎంపిలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న ముఖ్యమంత్రి జగన్‌ పార్లమెంట్‌లో ప్రజావ్యతిరేక బిల్లులకు మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. మోడీ ప్రవేశపెడుతున్న ప్రజలకు నష్టదాయకమైన బిల్లులపై వైసిపి, టిడిపి నోరు విప్పడం లేదని విమర్శించారు. నిత్యావసర ధరలను విపరీతంగా పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. చంటిబిడ్డలు తాగే పాలపై కూడా జిఎస్టి వేసి ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూడా మహిళలపై దాడులు పెరిగాయని, వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.