వాషింగ్టన్ : జి 20 సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుకాకపోవడం నిరాశకు గురిచేస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. ఈ వారం భారత్ పర్యటన కోసం తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. ఆదివారం బైడెన్ మాట్లాడుతూ.. భారత్‌లో జి20 సమావేశానికి జిన్‌పింగ్ రావడం లేదనే వార్త నిరాశకు గురిచేసిందని, కానీ జిన్‌పింగ్‌ను తాను చూడబోతున్నానని అన్నారు. తాను భారత్, వియత్నాం పర్యటన కోసం వెళ్తున్నానని అన్నారు. ఆ రెండు దేశాలు అమెరికాతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నాయని, అది తమకు కూడా సహాయకారిగా ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ జి20 సదస్సుకు రెండు రోజుల ముందు అంటే ఈ నెల 7న భారత్ రానున్నారు. ఈ నెల 8న ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 9, 10 తేదీల్లో జి20 సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం వియత్నాం వెళ్తారు.