- మన శరీరంలో సున్నితమైన ఇంద్రియం కళ్లు. కళ్లతో అధికంగా పనిచేస్తాం.. కానీ శరీరంలో అన్ని అవయవాల గురించి ఉన్నంత శ్రద్ధ కళ్ల గురించి ఉండదు . చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేం. అయితే, మనలో ఎంతమంది కంటి సంరక్షణపై దృష్టి సారించాం? ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నాం?
కళ్లున్న ప్రతి ఒక్కరికీ నేత్ర సంరక్షణ అనేది ప్రాధాన్యత గల విషయం.
కళ్లు తెరిచిన దగ్గర నుంచి తిరిగి మూసేవరకూ మనకు నిత్యం కళ్లతోనే పని. మనకు గుండె ఎంత ముఖ్యమో, కళ్లూ అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి అంటున్నారు వైద్య నిపుణులు. పరిగెత్తినప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీంతో మనం పరుగు ఆపి, కాస్త విరామం తీసుకుంటాం. కానీ కళ్ల దగ్గరకు వచ్చేసరికి, అలాంటి సడలింపులు ఏమీ ఇవ్వం. కళ్లు మాత్రం అలసట లేకుండా పనిచేస్తుండాలి. చాలామంది కంటి సంరక్షణ గురించి అంతగా పట్టించుకోరు.
అందరిలో ఉన్న ఈ ధోరణి మారాలి. కంటి సంరక్షణపై అందరికీ అవగాహన రావాలి. నేత్ర సంరక్షణ చాలా ముఖ్యమైనది. మనం కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి అన్న సందేశాన్ని అందరికీ తెలియజేయాలనేది నిపుణుల మాట.
- రొటీన్ చెకప్..
సాధారణ చెకప్ వలన దృష్టి లోప సమస్యల్ని ముందే గుర్తించి, కంటిచూపును కాపాడుకోగలం. అప్పటికే కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నా.. వయసు పెరుగుతున్నా.. పట్టించుకోం. వాటితోనే నెట్టుకొచ్చేస్తాం. ఒక్కోసారి కంటిలో మెరుపులు వస్తుంటాయి. అవేవో నీరసం వల్ల వచ్చాయని వాయిదా వేసేస్తాం. వైద్యుల్ని సంప్రదించినప్పుడు ఇవన్నీ అడిగితే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. ఇలాంటి సమస్య అలాగే కొనసాగుతుండటంతో కంటి వైద్యులను సంప్రదించాలి. కంట్లో రెటీనా డిటాచ్ అయితేనే, కంటిలో మెరుపులు వస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అత్యవసర శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఇది కనీసం అరగంటపైనే జరుగుతుంది. చికిత్స తర్వాత వారంపాటు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. కొన్ని నెలలకు కంటిచూపు సాధారణ స్థాయికి వచ్చి, పనులు చేసుకోవచ్చంటున్నారు.
అయితే సరైన, నాణ్యమైన వైద్యసేవలు అందరికీ లభించకపోవచ్చు. ముఖ్యంగా పేదరికం ఉన్న వారికి కంటివైద్యం అందడమే కష్టతరం. ఇలాంటి సందర్భాల్లో ఈ సమస్యనూ ప్రస్తావించక తప్పదు. ఆయా దేశాల ప్రభుత్వాలు దీనిపై కేంద్రీకరించి, ఆరోగ్యానికి సంబంధించి జాతీయ ఆరోగ్య ప్రణాళికల్లో విధి విధానాల రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందనేది ప్రజారోగ్యుల మాట. విధానాల అమలూ చాలా కీలకం.. అలాంటప్పుడే నేత్ర ఆరోగ్యానికి కావాల్సిన వనరులూ సమకూరుతాయి.
- పని ప్రదేశాలూ కారణమే..
ప్రపంచవ్యాప్తంగా 2020లో 1.3 కోట్ల మంది తమ వృత్తిరీత్యా కంటిచూపు సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఐఎల్‌ఓ చెప్తోంది. పని ప్రదేశాల్లోని పరిస్థితుల వలన కలిగే దృష్టి లోపాలను, ఈ సమస్యల కారణాల్లో మూడో కారణంగా పేర్కొంటు న్నారు. పని ప్రదేశాలూ దృష్టి లోప సమస్యలు ఏర్పడటానికి కారణం కావొచ్చని ఈ నివేదిక పేర్కొంది. వ్యవసాయం, మత్స్య, నిర్మాణం వంటి రంగాల్లో బహిరంగంగా పనిచేస్తారు. వీరు యూవీ, ఇన్‌ఫ్రారెడ్ రేడియషన్ బారిన పడటం వలన 'శుక్లాలు (క్యాటరాక్ట్)' బారిన పడే అవకాశం ఉంది. పని ప్రదేశాల్లో సంరక్షణ చర్యలు కీలకం. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలో పని ప్రదేశాలు, యంత్రాల దగ్గర పనిచేసేవారు కళ్లకు రక్షణగా అద్దాలు ధరించాలి.. లేకపోతే
ఆ రేణువులు కంటికి నేరుగా తగలడం వలన ప్రమాదం జరగొచ్చని నివేదిక పేర్కొంది. ఇప్పుడైతే కంప్యూటర్లతోనే ఎక్కువశాతం పని జరుగుతోంది. ఇక్కడా సమస్య ఉంది. కంప్యూటర్ స్క్రీన్‌ను తదేకంగా చూడటం వలన కంటిపై ఒత్తిడి పడుతుంది. రోజూ కంప్యూటర్ తెర, కంటి మధ్య స్థిరమైన దూరం ఉంచుతూ పనిచేస్తుంటారు. దీనివలన వక్రత స్థిరంగానే ఉండిపోతుంది. ఇదీ కంటిచూపు సంబంధిత సమస్యలకు దారితీయొచ్చని నివేదికలో పేర్కొన్నారు.
- చిట్కాలు..
> రెండు కళ్లలో ఒకదానిని మూసి, రెండో కంటితో మీరు చూస్తున్న ప్రదేశాన్ని గమనించండి. అలానే రెండో కంటితోనూ పరిశీలించండి. ఈ రెండుసార్లు మీకు ఏదైనా తేడా కనిపించిందా? ఇలా మీకు మీరే పరీక్ష చేసుకోండి.
> ఒకవేళ మీకు ఏడేళ్లలోపు పిల్లలు ఉండి, వారికి కంటి పరీక్ష చేయించే అవకాశం లేకపోతే గనుక, దూరంగా ఉన్నవాటిని చూపించి, అవేంటో గుర్తించమని చెప్పండి. రెండు కళ్లనూ పరీక్షించండి. దీనివలన అంబ్లియోపియా, దృష్టి లోపం వంటి సమస్యలు ఏమైనా ఉంటే గుర్తించే అవకాశం ఉంటుంది.
> క్రమం తప్పకుండా కంటి పరీక్షలకు వెళ్లడం ముఖ్యం.