'కథకు అవసరమైతే ఉంటాడు.. లేకపోతే లేదు.'
'అంటే? నువ్వు సృష్టించిన పాత్ర గనుక నీకు ఇష్టం వచ్చినట్లు చంపేసే హక్కు నీకుందని నీ భావనా?'
'అంతే కదా మరి !?'
'మరైతే మిగతా పాత్రల మనోభావాలు, వేదనల పట్ల నీకు బాధ్యత లేదా?'
'ఎందుకు లేదు? అది కూడా చెబుతాను కదా?'
'ఎందుకు? కథ పాఠకుల మెప్పు, సానుభూతి పొందటానికా?'
'అంటే.. కథలు పాఠకుల కోసమే కదా?'
'కథలు.. పాత్రల సమ్మిళితమే కదా?'
'అవును. కానీ పాత్రలు చెప్పినట్లు కథ నడవదు కదా?'
'అవును. నడవదు.. కాదు రచయితలు నడిపించరు.'
'నిజమే! ఎలా నడిపించగలరు? ఒక పాత్రకు ఇష్టమైనది మరో పాత్రకు నచ్చదు కదా?'
'అందుకని పాత్రల ఇష్టాయిష్టాలన్నీ మీ చెప్పు చేతుల్లోనే పెట్టేసుకుంటారా? మీరు ఎలా చెబితే అలా నడుచుకోవడమేనా మా పని? లేదు. నేను అలా చేయలేను. మీ చేత చేయనివ్వను. నా కొడుకును చంపనివ్వను. కాదు కూడదంటే.. కావాలంటే.. నిన్నే చంపేస్తా!.'
ఆమె నిప్పులు రాలే కళ్ళతో కోపంగా చూస్తూ.. భయంకరంగా అరుస్తూ.. మీద మీదకు వచ్చేస్తోంది.
ఆమె నుంచి తప్పించుకోవడానికి అన్నట్లు.. భయం భయంగా.. వెనక్కి వెనక్కి వెళుతూ కొండ అంచు నుంచి జారి, లోయలోకి పడిపోయింది. ఓ పెనుకేక ఆమె నోటి వెంట అప్రయత్నంగా వెలువడింది.
ొొొ
'మహీ! ఏమైంది? లే!.' తనను కుదుపుతుంటే చప్పున మెలకువ వచ్చింది. చెమటలు దిగ కారుతున్నాయి. ఏదో తెలియని భయంతో ఒళ్లంతా వణుకుతోంది.
'పీడకల వచ్చిందా? ఇదిగో.. నీళ్లు తాగు'
శివ అందించిన నీళ్ల సీసా అందుకుని, గటగటా తాగింది మహేశ్వరి.
'నువ్వు తల్లివైతే తెలిసేది నీకా బాధ?'
సుతి మెత్తని గుండె మీద సమ్మెట పోట్లలాంటి మాటలు.. మనసును చితక్కొడుతుంటే.. భరించలేనంత బాధతో మెలితిరిగిపోయింది. హఠాత్తుగా ఏడవటం ప్రారంభించింది మహేశ్వరి.
'మహీ! ఏమిటి? ఎందుకు?' శివ కంగారు పడిపోయాడు.
మహేశ్వరి దుఃఖం సముద్రపు అలలే అయ్యాయి. ఎంత ఓదార్చినా ఆగటం లేదు.
ఆమెను దగ్గరకు తీసుకుని, ఓదార్పుగా తలా, వీపు నిమురుతూ ఉండిపోయాడు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్లు మహేశ్వరి అలాగే నిద్రపోయింది. నిద్రలో కూడా ఎక్కిళ్ళు పడుతోంది. ఆమె మొహంలో కలవర పాటు స్పష్టంగా తెలుస్తోంది. ఏమైందో అర్థం కాలేదు శివకు.
మెల్లగా ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి.. లేచి వెళ్ళి మహేశ్వరి రైటింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. టేబుల్ పైన పేపర్ వెయిట్ కింద ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతున్న కాగితాలు తీశాడు.
***
నాన్నకు ప్రేమతో
'నాన్నా! మీకో నిజం చెప్పాలి.'
'పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఏమిట్రా మొండి పట్టుదల? వచ్చి టిఫిన్ తిను. నిన్నటి నుండి తినకుండా సాధిస్తున్నావు..' సుజాత బతిమలాడుతోంది కొడుకును.
'మీ పరిస్థితులు ఎప్పుడూ ఉండేవే కదా? ఎటూ నెట్‌క్యాష్‌కు గతి లేదు. లోన్ తీసుకోమనే కదా చెప్పేది.' దురుసుగా అన్నాడు బబ్లూ.
'పిల్లల కోరికలు తీర్చలేని వాళ్లు కనడం ఎందుకో?'
నిర్ఘాంత పోయింది సుజాత. 'ఎంతమాట అనేసాడు?' లజ్జా భారంతో మనసు చితికిపోయింది.
ఛిద్రమైన ఎద నుండి ఎక్కిళ్లుగా దుఃఖం పొంగుకు వచ్చింది. పంటి బిగువున ఏడుపు ఆపుకొంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళిపోతున్న భార్యను చూసాడు టిఫిన్ తింటున్న రమణ. కొడుకు మాటలు అతనికి విపరీతమైన కోపం తెప్పించాయి. తింటున్న ప్లేటును విసిరికొట్టి లేచాడు.
'కంటే.. మీ ప్రతి కోరికా తీర్చాలని రూలేమన్నా ఉందా?' బబ్లూను చితకబాదేశాడు రమణ. అడ్డు వచ్చిన సుజాత, సుప్రియను పక్కకు తోసేసాడు.
'పదిహేడేళ్ళ ఉడుకు రక్తం కుర్రాడు.. ఆరడుగుల దాకా ఎదిగిపోయిన కొడుకును వంగదీసి మరీ కొట్టింది కోపమా? వాడి కోరిక తీర్చలేని తన నిస్సహాయతా? అయినా బిడ్డలు తమను అడగక ఇంకెవరిని అడుగుతారు?' రమణ అంతరాత్మ ఘోష పెట్టింది.
లంచ్ బాక్స్ కూడా తీసుకోకుండా సుజాత వెనుక నుండి లంచ్ బ్యాగు పట్టుకొని పిలుస్తూ వస్తున్నా, పట్టించుకోకుండా స్కూలుకు వెళ్లిపోయాడు రమణ. అతను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో టీచరు. స్కూలుకు వెళ్లినా.. మనసంతా బబ్లూను కొట్టిన బాధ సలుపుతూనే ఉంది. చెట్టంత ఎదిగిన కొడుకును స్నేహితుడిలాగా చూసుకోవాలంటారు. తనేమిటి? ఒక టీచర్‌గా ఉండి కూడా కోపాన్ని అదుపు చేసుకోలేక.. బిడ్డకు నచ్చజెప్పుకోలేక అలా బాదేయడమేమిటి? అన్న ఆలోచన అతన్ని స్థిమితంగా ఉండనీయడం లేదు.
'ఏం సార్ అలా వున్నారు? హెల్త్ బాలేదా? లీవ్ పెట్టుకోకపోయారా? క్యారేజీ తెచ్చినట్లు లేదు. రండి సార్ భోంచేద్దాం..' మధ్యాహ్నం లంచ్ టైములో కొలీగ్ పిలిచాడు.
'లేదు సార్. కడుపునొప్పి. మోషన్స్ అవుతున్నాయి.. అందుకే తెచ్చుకోలేదు. మీరు కానివ్వండి.' అని చెప్పి తప్పించుకున్నాడు.
'బబ్లూ! సారీ నాన్నా! నువ్వు అలిగి, అన్నం తినలేదన్న బాధ.. నువ్వు ఆకలికి ఆగలేవన్న బాధతో కొట్టేసాను. ప్లీజ్ ! లే నాన్నా! అన్నం తిని మాత్ర వేసుకో!'
దెబ్బల నొప్పికి జ్వరం వచ్చేసింది బబ్లూకు. ఎప్పుడూ కొట్టింది లేదు.. మరీ కోపమొస్తే అరవటం తప్ప! మరీ అంతలా కొట్టడం.. తనకే సిగ్గుగా వుంది. వాడు తిరగబడుంటే.. తనేం చేసేవాడు? పాపం! నొప్పిని భరించాడే కానీ కనీసం ఒక్కమాటా అనలేదు. పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాడు రమణ. సుజాత, సుప్రియ, రమణ ఎంత బతిమిలాడినా వినడం లేదు బబ్లూ.
'ఇప్పటికే హోమ్ లోన్ కడుతున్నాను. మీ చదువులు, ఫీజులు, పుస్తకాలు.. ఖర్చులున్నాయి కదా! తీసుకొన్న హ్యాండ్ లోన్స్ వడ్డీలు కడుతున్నాను. వాటిని తీర్చేయాలని చీటీలు కడుతున్నాను. నెక్స్ట్ నీ బీటెక్ చదువు కోసం తప్పనిసరిగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి. మళ్లీ వెహికల్ లోన్ అంటే.. ప్రతి నెలా ఆ ఈయంఐ కీ.. నా జీతం ఎలా సర్దగలను చెప్పు?' బబ్లూకు రమణ తన ఆర్థిక పరిస్థితి వివరించాడు.
'ఏం పర్వాలేదు. హౌమ్ లోన్ ఇప్పట్లో తీరదు. అది, నా కోసం చేసే ఎడ్యుకేషన్ లోను రెండూ నేనే కట్టుకుంటాను. బీటెక్ అవగానే జాబ్‌లో చేరతా!.' బబ్లూ ధీమాగా అన్నాడు నీరసంగా ఉన్నా కూడా.
బబ్లూ చిన్నప్పటి నుంచి అంతే! పడితే పట్టు వదలడు. సాధించాల్సిందే!
కొత్త అపాచీ బండిలో రమణా సుజాత, ఫ్రెండ్ స్కూటర్లో సుప్రియ బబ్లూ కాణిపాకం వెళ్లి, కొత్త బండికి పూజ చేయించుకుని వచ్చారు.
కొత్త బండిలో ముందు తల్లిదండ్రులే ఎక్కాలని.. అదో పట్టు! బబ్లూ మొహం ఆనందంతో వెలిగిపోయింది అమ్మానాన్నలు కొత్త బండిపై వెళుతుంటే!
***
'నాన్నా! మీకో నిజం చెప్పాలి.'
సుప్రియ గద్గదంగా అంది.
ఆ రోజు ఫాదర్స్ డే! బబ్లూ ఫోటో ముందు కూర్చుని, తదేకంగా చూస్తున్న రమణ తల తిప్పి చూశాడు. తన ప్రతి పుట్టినరోజుకు, ఫాదర్స్ డే కు విష్ చేసేవాడు. ఈసారి రెండూ ఒకేరోజు కలిసి వచ్చాయి. అయినా బబ్లూ విషెస్ చెప్పలేదు. చెప్తూ ఉంటాడు. బహుశా తనకు వినిపించడం లేదేమో!
'బబ్లూ బండి కావాలని అంత రభస చేసింది వాడి కోసం కాదు నాన్నా! సైకిల్ తొక్క లేక మీరు అవస్థ పడుతుండటం చూడలేక. అవును నాన్నా! ఆ రోజు మనం కాణిపాకం వెళ్తున్నప్పుడు చెప్పాడు.'
'మమ్మీ డాడీ అలా బండిపై వెళుతుంటే బాగుంది కదా అక్కా! మమ్మీ మొహం చూడు ఆనందంతో ఎలా వెలిగిపోతుందో?'
'కానీ డాడీ మనసులో బాధగానే ఉంటుందిరా.. ఇంకో ఇఎమ్‌ఐ కట్టాలని! అయినా నువ్వంత రచ్చ చేసుండకూడదురా! నిజంగానే నువ్వో మొండిమనిషివి రా!.'
'నిజమే అక్కా! కానీ అప్పు కన్నా ఆరోగ్యం ముఖ్యం కదా! ఆరోగ్యంగా ఉంటేనే కదా ముందు.. ఏ పని అన్నా చేయడానికి?' ఆరిందాలా అన్నాడు బబ్లూ.
'అక్కా! ఒకరోజు అమ్మానాన్న మాట్లాడుకుంటుంటే విన్నాను. నాన్నకు హెర్నియా ప్రాబ్లం అట. ఆపరేషన్ చేయాలట. సైకిల్ తొక్కకూడదని డాక్టర్ చెప్పాడట. కానీ నాన్న రోజూ స్కూల్‌కి సైకిల్ పైనే వెళతాడు. ఆటోలో వెళ్ళమని అమ్మ చెప్పినా డబ్బులు ఎక్కువ అయిపోతాయని అన్నాడు. మరి రోజుకు అప్ అండ్ డౌన్ 20 కిలోమీటర్లు. నొప్పితో ఎలా సైకిల్ తొక్కేది? ప్రాబ్లం ఇంకా ఎక్కువవుతుంది కదా? ఆటోలో వెళ్ళమంటేనే వెళ్ళనన్నవాడు తన కోసం బండి కొంటాడా? అందుకే నేను అంతలా గొడవ చేసి, బండి కొనిపించాను. ఇదో..ఇంటర్ ఎగ్జామ్స్ ఇంకా రెండు నెలలే కదా! తర్వాత నేనెటూ బీటెక్‌లో ఎక్కడ సీటు వస్తే అక్కడికి వెళ్లి పోతాను కదా? నాకెందుకు అక్కా బండి?'
'ఎన్ని దెబ్బలు తిన్నావురా?' చెమ్మగిల్లిన కళ్ళతో తమ్ముడి వీపు ఆప్యాయంగా నిమిరింది సుప్రియ.
'నాన్న మనకోసం పడే నొప్పి ముందు అదెంతలే అక్కా!.'
ఇంట్లో పూసిన ఎర్ర గులాబీల గుత్తి తమ్ముడి ఫోటోకి పెడుతూ అట్లే కూలబడి బావురుమంది సుప్రియ.
వింటున్న రమణ, సుజాతల గుండె కాసారాలు కన్నీటి అలల్లో బబ్లూ నిర్మలమైన నవ్వు తేలియాడుతోంది.. స్వచ్ఛ వేణుగానంలా!
***
తన భుజంపై చేయి పడడంతో ఉలిక్కిపడి.. చదువుతున్న పేపర్లు పడేసి, వెనక్కి చూశాడు శివ. మహేశ్వరి నిలబడి ఉంది.
'బబ్లూ అమ్మ నన్ను ఎన్ని మాటలు అన్నదో తెలుసా శివా?' మహేశ్వరి కళ్ళు చెమ్మగిల్లాయి.
'నీ కథకు బహుమతి రావాలన్న స్వార్థంతో నా కొడుకును యాక్సిడెంట్ చేసి చంపేసావు. అసలు నువ్వు ఆడదానివేనా? అయినా నువ్వు తల్లివై ఉంటే.. నీకు తల్లి ప్రేమ తెలిసేది. ఏ తల్లీ తనకన్నా ముందు తన బిడ్డ పోతే భరించలేదన్న కఠిన సత్యం నీకు తెలిసేది. అదే తెలిస్తే నన్నో.. మా ఆయన్నో.. చంపేసుండే దానివి కానీ.. నా కొడుకును కాదు..' మహేశ్వరి ఇక మాట్లాడలేక పక్కనే ఉన్న కుర్చీలో కూలబడి, ఏడుస్తూ చేతుల్లో మొహం దాచుకుంది.
ఎన్ని కథలు రాయలేదు? ఇంతవరకు ఇంతలా.. బాధపడినట్లు తనకు తెలియలేదు. రచయితలు కూడా కొన్ని సంఘటనలు రాస్తున్నప్పుడు.. రాసాక.. ఇంత బాధపడతారా అనుకుంటుంటే..
ఏం వాళ్లు మనుషులు కాదా? మనసుండదా? మమతలు ఉండవా? ఫీలింగ్స్ ఉండవా? భావోద్వేగాలు ఉండవా? అసలు ఒక అక్షరం కాగితం మీద పెట్టాలంటే ఆ అక్షరంలోని భావాన్ని అనుభవించి, అనుభూతి చెందుతూ రాయడమే కదా? కథలో తల్లి పడ్డ ఆవేదన మహేశ్వరి మనసును తీవ్రంగా కదిలించి ఉంటుంది. అందుకే తను ఇంతలా బాధపడుతోందా?
'నిజమే శివా! ఏదైనా తన దాకా వస్తేనే తెలుస్తుంది అంటారు కదా! నాకు ఆ తల్లి బాధ తెలియాలంటే ఆమె అన్నట్లు.. నేను తల్లిని అవ్వాలి. అప్పటిదాకా తల్లి పాత్రలు సృష్టించే అర్హత నాకు లేదు.' దృఢంగా అంటూ టేబుల్ పైన కాగితాలు తీసి, పరపర చింపేసింది మహేశ్వరి.
తమ సహజీవనానికి తమ ప్రేమబంధమే రక్ష అని.. మరే చట్టబద్ధమైన పెళ్ళి, తాళి, రిజిస్ట్రేషన్ లాంటి ప్రక్రియలు అవసరంలేదని.. అయితే పిల్లలు మాత్రం వద్దని కచ్చితంగా చెప్పిన మహేశ్వరి.. తాను తల్లిని అవుతానంటున్న మాటలకు ఆశ్చర్యానందాలతో చూస్తుండిపోయాడు శివ.
ఒక సంఘటన మరో సంఘటనకు మూలమైనట్లు.. ఒక సమస్య మరో సమస్యకు పరిష్కారం కూడా అవుతుంది అన్నట్లుగా కిటికీలో నుండి చల్లని వెన్నెల నవ్వులు రువ్వుతున్నాడు పున్నమి జాబిలి.
ఎం.ఆర్. అరుణకుమారి
81215 23835